2️⃣8️⃣0️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*10. విభూతి యోగము.*
(పదవ అధ్యాయము)
_________________________
*32. సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జునl*
*అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ll*
ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతము నేనే. ఈ సృష్టి ఎప్పుడు ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ముందు మొదలయిందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు అంతం అవుతుందో ఎవరికీ తెలియదు. పోనీ ఈ సృష్టి ఎలా నడుస్తూ ఉందో, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటే భూత, భవిష్యత్, వర్తమానములు ఎవరికీ తెలియవు. ఎందుకంటే అది నేనే. నా నుండి వచ్చిన వాళ్లకు నా గురించి తెలుసుకునే అవకాశం లేదు. టార్చిలైట్ కాంతి సూటిగా ముందుకు ప్రసరిస్తుంది కానీ వెనక్కు తిరిగి తాను ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోలేదు. ఈ సృష్టి అంతా నేనే కాబట్టి నాకు ఆది, అంతము లేదు. ఈ సృష్టికి ముందు నేను ఉన్నాను. సృష్టి అంతా లయం అయిన తరువాత కూడా నేను ఉంటాను, కాబట్టి, ఈ సృష్టి గురించి నాకు మాత్రమే తెలుసు. నాచే సృష్టింపబడిన వాటికి నా గురించి తెలియదు.
అన్ని విద్యలలో ఆధ్యాత్మిక విద్య ఉత్తమమైనది. మిగిలిన విద్యలు అన్నీ కేవలం ఉదర పోషణార్ధమే. అవన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. కాని ఆధ్యాత్మిక విద్య నీ గురించి నీవు తెలుసుకోవడానికి ఉపకరించే విద్య. సాధారణంగా మనం ఎవరి దగ్గరకన్నా వెళ్లినపుడు, నేను ఫలానా అని మనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు, పుట్టిన ఊరు, చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం గురించి, ఏ పని మీద వచ్చామో అవన్నీ చెప్పుకుంటాము. కానీ నేను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఈ లోకం విడిచిన తరువాత ఎక్కడికి పోతాను. అంటే నీ గురించి నీవు తెలుసుకోవడం లాంటిది. మనం ఈ విషయాలను గురించి అస్సలు ఆలోచించము. వాటి గురించి చెప్పేదే ఆధ్యాత్మిక విద్య. ప్రాపంచిక విద్యలు మనకు సుఖాలను, వాటి వెంట దుఃఖాలను రెండింటినీ కలుగజేస్తాయి. కాని ఈ ఆధ్యాత్మిక విద్య మనకు పరమ శాంతి సుఖము ప్రసాదిస్తుంది. ప్రాపంచిక విద్యలు అన్నీ "నేనే ఈ దేహము" అనే ప్రాతిపదిక మీద పని చేస్తాయి. ఆధ్యాత్మిక విద్య "నీవు ఈ శరీరము కాదు నీవు వేరు ఈ శరీరము వేరు", అనే ప్రాతిపదిక మీద పని చేస్తాయి. ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. కాని ఆధ్యాత్మిక విద్యకు డిగ్రీలతో సంబంధం లేదు. ఆత్మజ్ఞానము ముఖ్యము. నీ గురించి నీవు తెలుసుకుంటే ఇంక తెలుసుకోవలసింది ఏమీ ఉండదు అని బోధిస్తుంది. ఇన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఈ అధ్యాత్మవిద్య నేనే అని అంటున్నాడు కృష్ణపరమాత్మ.
ప్రతి విషయానికి అవును, కాదు, అంటే వాదము ప్రతి వాదము అనేవి ఉంటాయి. అప్పుడే అసలు నిజం తేలుతుంది. అందుకే నేతి (న ఇతి... నేతి అంటే ఇది కాదు) సిద్ధాంతము వచ్చింది. పరమాత్మను తెలుసుకోవడానికి ఇది కాదు ఇది కాదు అని అన్నిటినీ పరిహరిస్తూ పోతే తుదకు మిగిలేది పరమాత్మ. అది నేను అంటున్నాడు. వాదమునే సంవాదము అని కూడా అంటారు. భగవద్గీత కూడా కృష్ణార్జున సంవాదము. అంటే తనకు తెలియని విషయాలను అర్జునుడు అడిగితే, ఆ విషయాలను లోతుగా చర్చించి, విశదపరిచి చెప్పడం. దీనిని వాదము, సంవాదము అని అంటారు. అంటే ఒక విషయాన్ని లోతుగా విశ్లేషించడం, దాని అంతం దాకా ఆలోచించడం. ఈ సంవాదము మనిషిలో జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేస్తుంది. ప్రతివాదము మనిషిలో వ్యతిరేక భావాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వాదించేవారిలో వాదనా శక్తిని నేను అని అంటున్నాడు పరమాత్మ.
ఈ వాదాలు మూడు రకాలు అని చెబుతారు. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడం, విశ్లేషించి, విశదపరిచి చెప్పడం, అర్ధం అయ్యేటట్టు చెప్పడం వాదము. ఆ వాదమును ఖండిస్తూ, తన వాదమును మాత్రమే వినిపించడం ప్రతివాదము. అంటే ఎల్లప్పుడూ ఎదుటి వాడు చెప్పింది తప్పు, తాను చెప్పింది మాత్రమే ఒప్పు అని వాదించడం ప్రతి వాదము. ఎదుటి వాడు, మంచి చెప్పినా, చెడు చెప్పినా, ఏం చెప్పినా, దానిని ఖండిస్తూ, ఇతరులు చెప్పింది తప్పు, ఇతరులు చెడ్డవాళ్లు, వాళ్లకు ఏమీ తెలియదు, తనకు మాత్రమే అంతా తెలుసు, తాను చెప్పిందే ఒప్పు అని ఏ విధమైన ఆధారాలు లేకుండా వాదించడం వితండ వాదము అని అంటారు. పరమాత్మ ఈ ప్రతివాద, వితండ వాదం జోలికిపోవడం లేదు. కేవలం సంవాదములో ఉన్న వాదనాశక్తిని నేను అంటున్నాడు.
(సశేషం)
👏🌺🧘🧘♀️🧘♂️🇮🇳🌍🧘🧘♀️🧘♂️🙏
https://youtu.be/yvHkEAa93WM?si=xWQqwS35iNFGlmay
👏🧘🧘♀️🧘♂️🧘🧘♀️🧘♂️🧘🧘♀️🧘♂️🙏🇮🇳🌍🙏🧘🧘♀️🧘♂️
No comments:
Post a Comment