దేవుడు లేడు అన్న దానికి సాక్ష్యం ఏమిటి?
వాడు లేడు— అని ఎపుడంటాం?.
వాడు* అని ఒకడుండి , ఇపుడు ఆ అడ్రస్ లో కనబడనపుడు గదా—వాడు లేడు. ఎక్కడికో వెళ్లాడు అనో , ఒకప్పుడు ఉండి, ఇపుడు ఇక్కడి నుంచి వెళ్లి పోయాడు అనే సందర్భంలో గానీ అంటాం.
హిరణ్యకశిపుడు ఎక్కడ ఎక్కడ? అని మొండిగా కొడుకును చంపాడు.
అతడేమన్నాడు? ఎందెందు *వెదకి చూచిన* అందందే కలడు… అన్నాడు. * వెదకి చూచిన * అన్నాడు.
వెదకాలి — అంటే ముందు ఆ వస్తువు ఎట్లా ఉంటుందో తెలియాలి.
హరి అనే వాడు ఈ సమయంలో ఈ విధంగా ఉంటాడు. ఇక్కడ ఉంటాడు . అని ముందు తెలిస్తే ఆ చోట ఆ సమయంలో వెదకడం సాధ్యం.
సంపాతి సీతమ్మను లంకలో ఉన్నట్లు దర్శించాడు.
ఆయన ఎప్పటి నుంచో రెక్కలువిరిగి పడిఉన్నాడు . ఏ అయోధ్యకో , మిథిలకో వెళ్లి ఆమెను చూచి ఉండలేదు. ఎట్లా చూడడం సాధ్యమో అతడికి తెలుసు . రెక్కలు విరిగి పడడం ఒక అదృష్టం. తదేక చింత (విచారణ ) చేసే సదవకాశం భగవంతుడు కలిగించాడు . వినతా కశ్యపుల వంశంలో పుట్టిన పూర్వసంస్కారం ఇలా కలిసి వచ్చింది. అందుకే* బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే * అన్నారు. జ్ఞానికే చాలా జన్మల కాలం పడుతుంది భగవంతుణ్ణి చేరుకోడానికి.
న వేద యజ్ఞాధ్యయనైః | న దానైః న చ క్రియాభిః తపోభిరుగ్రైః
ఏవం రూపః శక్య అహం నృ లోకే| ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర!
అంటూ ఒక రూపం అర్జునుడికి చూపాడు .
ఈ రూపం ఎట్లా చూచాడతడు? " భక్త్యా తు అనన్యయా" చూచాడు. మైత్రితో చూచాడు. ఆ ఇద్దరికీ అంతటి మైత్రి ఎట్ల కుదిరింది?
వాళ్లు అనేక జన్మలుగా మిత్రులు నరనారాయణులు.
జీవో బ్రహ్మైవ నాపరః— అన్నట్లు ఒకే శరీరంతోనూ ఉండిన వారు.
దివ్యం దదామి తే చక్షుః — అని ఒక వేరే చూపును ఇచ్చాడు ఆయన .. జీవుడు ఈ ఉపాధిలో చూడగలగడానికి.
ధృతరాష్ట్రుడికీ పుట్టుగుడ్డికి కళ్ళతో( ప్రత్యక్షంగా ) చూడడానికి ఒక చూపు ఇచ్చాడు . కానీ అపుడు భీష్మద్రోణాదులకూ , నారదాది ఋషులకూ ఏ చూపూ ఇవ్వలేదే . వాళ్లూ చూచారు ధృతరాష్ట్రుడు చూచినట్టే.
వాళ్లకు చూడడం ముందే అభ్యస్తమై ఉంది అనుకోవాలి.
ఇక్కడ కావలసింది చూడాలనే తపన . తీవ్ర ఇచ్ఛ.
చూపించేవాడు — రామకృష్ణ పరమహంస మాదిరిగా ఒకరు కావాలి.
ఉద్దామ ధ్యాన గరిష్ఠులైనన్ హరిన్ పొందన్వచ్చు.*. అంటారు మరో చోట. తీవ్రమైన ధ్యానం . తపన —
*ఈ జన్మలోనే చూడాలి . కైవల్యం పొందాలి *—అనే బలీయమైన ఆలోచన.
భగవంతుణ్ణి వాడుకోవడం కాదు . భగవంతుడికి నీవూ, నీ తనుమనః ప్రాణాలూ ..అన్న స్థాయి కలగాలి .
నాకు మోక్షమే వద్దు. జన్మ జన్మకూ నీ స్మరణ కలిగితే అదే చాలు… అన్నంత తీవ్రంగా భగవద్భావన ఏర్పడాలి.
అపుడు నీలోనే ఎపుడూ ఆ భగవంతుడు ఉండిపోతాడు. అపుడు భక్తుడూ , భగవంతుడూ వేరువేరు కాదు.
ధృతరాష్ట్రుడు దర్శనం చేసుకొన్నాడు గదా!
ఆ దుర్యోధనాదులూ అక్కడే ఉన్నారే. వాళ్లు భయభ్రాంతులయ్యారు. చూడలేక పోయారు.— అదేదో ఇంద్రజాలం . అదేముంది గొప్ప? ప్రాక్టీస్ చేస్తే ఎవడైనా చేయగలడు— అని చులకన చేశారు.
ప్రహ్లాదుడో! ఉపదేశ బలంతో ఏ సందేహమూ లేకుండా *ఇందుగలడందులేడని సందేహము వలదు * అని అందరికీ చెప్పేస్తున్నాడు. ఎందువల్ల ? రామకృష్ణ పరమహంస మాదిరిగా ఆయన గూడా ఎపుడూ చూస్తూ భాషిస్తూ ఉన్నాడాయె !
విష్ణుడింతియ కాని , వేరొండు లేడని ఒత్తిలి నగుచుండు నొక్కచోట..
ఓస్ ! ఇంతేనా దేముడంటే. ఏమో అనుకొన్నానే—అని ఆ దర్శనం అత్యంత సులభం అంటూన్నాడు. అలవాటైపోయిన వాడికి అందులో కష్టమేముంటుంది ? ఏదైనా బుద్ధి కుదిరే వరకే..
ఈయన పెదతండ్రి హిరణ్యాక్షుడు అంతటా వెతికాడు . కానీ , తనలో వెతకలేదే !
తనను వెదుకుతున్నాడే అని, బాగా దగ్గరగా — అంతకంటే దగ్గర ఏముంటుంది? వచ్చి, ఎక్కడికో పోకుండా ఉన్నాడు. ఆ పూర్వదేవుడి హృదయంలోనే చేరాడు పరమాత్మ.
ఆయనను బయట చూడవలె …అని ఆతడి ప్రయత్నం —. పట్టుకొని చంపేయాలని.
*ఆత్మ రక్షా కర్తవ్యా* అని చెప్పినవాడు దానిప్రకారం తనను కాపాడుకోవాలి గదా! అందుచేత విష్ణువు భద్రప్రదేశం చూచుకొన్నాడు.
ఇతగాడు * వాడు భయపడి ఎక్కడో దాక్కున్నాడు పోనీలే ! భయపడ్డ వాళ్లను ఏమీ చేయగూడదు* అని అప్పటికి బుద్ధి మంతుడయ్యాడు.
లోపల ఆయన చేరి , తిష్ఠ వేసుకొన్నాడు గదా ! అందువల్ల…. వాడి నైసర్గిక బుద్ధి అణగి పోయి , సుబుద్ధి కలిగింది.
కానీ దాన్ని చిరస్థాయిగా నిలుపుకోలేక పోయాడు.
భగవంతుడు ఎపుడూ లోపలే ఉన్నాడు .అతన్ని చూడడానికి మనకు తీరిక లేదు.
అసలు ఎవరి దగ్గరకైనా ఎపుడు పోతాం? వాళ్లవల్ల ఈ పని ఔతుంది—అనుకొన్నపుడు . అంటే అది మన ప్రయోజనాపేక్ష.!. ఆతని మంచి కోరి కాదు.
అలాగే మన పనులలో మనం బిజీ . మనకు కావలసిన పని మనవల్ల కాక , అల్లాడుతూన్నపుడు ఎవరో మన శ్రేయోభిలాషులు చెప్తారు. ఆ డాక్టర్ దగ్గరకు పో— నయం ఔతుంది . ఇంకొకరు తమ అనుభవంతో ఆ కొండకు పో—నీ కష్టాలు తీరుతాయి..అని ..
ఆ *గురు* వాక్యం నిన్ను ఆలోచనలోకి తోస్తుంది..
అక్కడా మళ్ళీ సందేహం . నిజమో కాదో అని. దీనికి కొంత ప్రారబ్ధం అడ్డు వస్తున్నది. కొంత కాలం పడి లేచి, అపుడు నిజంగా గురుత్వం కుదిరి , ఆర్తితో ఆ వైద్యో నారాయణో హరిః దగ్గరకు పోయి కుదుట బడతాం..
ఇక్కడ విశ్వాసం కుదిరింది ఎక్కడ? బయట గాదు. నీ లోనే . అది జరిగినపుడు రోగం— భవ రోగం—నయమౌతున్నది. చూచేది నీవే— ఇతరమైనవి అన్నీ సహకారులే !
మనలో మనం చూచుకొనే శక్తి అభ్యస్తమయ్యే వరకూ బయట చూచి, ఇదే గదా లోపల చూడవలసినది —అని అనుకోవాలి.
తన విధి తాను చక్కగా పూర్తిగా చేసినపుడు —బంధాలు అవరోధాలు తొలగిపోతాయి. అపుడు ఆత్మలోనే రమిస్తూ, ఏ పని చేస్తూన్నా ఆ తత్వంలో స్థిరపడగలం.
'మంత్రం' ఆ కోశం తెరిచే తాళపు చెవి . నారదుడు ప్రహ్లాదుడికి మాతృగర్భంలోనే ఇచ్చాడు. కొందరు వెనకటి (జన్మలోని) అన్వేషణ, దర్శనానుభూతి తమ వెంట తెచ్చుకొని చూడగలరు.
కొందరికి ఆ విభూతి (సంపద ) ముందే ఉంది . కొందరు ఇపుడు సంపాదించుకౌవాలి.
భగవంతుణ్ణి ఏమన్నారు? *వేద వేద్యుడు * అని గదా!
వేదం అంటే జ్ఞానం (వాసుదేవః సర్వం— ఇతి జ్ఞానం ) సంపాదిస్తే ఆ దేవుణ్ణి చూడడం సాధ్యం.
సుజనులందు తరచు(గా ) చొచ్చియుందు ..అని మరోచోట అంటాడాయన.
కాబట్టి అక్కడా చూడవచ్చు .. సుజనులు దుర్జనులను దరి జేరనీరే ! కాబట్టి ముందు సౌజన్యం సంపాదించుకోవాలి. అంతకు ముందే దౌర్జన్యం (హిరణ్యకశిపుత్వం ) తొలగించుకోవాలి .
హరి సర్వాత్మకుడే . కానీ, నీవు ఏ విధంగా చూడదలచావో నిర్ధారణ చేసుకొని, ఆ రూపంలో మొదట చూచే తీవ్ర ప్రయత్నం చేసి , ఆ తర్వాత అన్నీ నీవే అని *అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః*— అని తెలుసుకో గలవు..
ఒక భక్తుడు — భగవంతుడు వచ్చి రాముడుగా కనిపిస్తే — "అయ్యా ! నాకు ఆ కృష్ణుడు గానే కనిపించు. ఆ రూపమే నాకు ప్రియము " అని ప్రాధేయపడ్తాడు.
సత్సహవాసంతో సచ్చిదానందస్వరూప దర్శనం ఔతుంది.
No comments:
Post a Comment