Monday, May 18, 2026

 జటాయువు సోదరుడు సంపాతి నాకు సీతామాత లంక లో వనం లో చెట్టు కింద సీతామాత నాకు కనపడుతోంది అని చెప్పిన తరువాత కూడా హనుమంతుడు ముందు వనం లో వెదక కుండ లంకా నగరం లో ఎందుకు వెదికారు. సీత మాట కనపడ లేదని ఎందుకు బాధ పడ్డారు?


వనం అంటే ఏ వనం. ఒకటే వనం ఉంటుందా లంకలో. చాలా వనాలు కూడా చూసే ఉంటారు హనుమ. అశోకవనం కనిపించలేదు. ఇక్కడ ఏఏ వనాలు ఉన్నాయి అని ఎవరినీ అడిగే అవకాశం లేదు హనుమకు.

హనుమ లంకలో ప్రవేశించినది రాత్రి. మహర్షి అప్పుడు హనుమ చిన్న పిల్లి పిల్లలా ఉన్నారన్నారు.

చిన్నరూపంలో ( పిల్లి అంత వానరం ) హనుమ లంకలో ప్రవేశించి భవనాలని, రక్షణవ్యవస్థని, మనుషులనీ, అన్నివైపులా పరిస్థితులు ఎలా ఉన్నాయో అని నిశితంగా గమనిస్తున్నారు. ఆయుధాలు పట్టుకుని యోధులు తిరుగుతున్నారు.

కొందరు మంత్రవేత్తలు దర్భలు పట్టుకుని తిరుగుతున్నారుట. దేనికి?. ఎవరయినా శతృవులు కనబడకుండానో, సూక్ష్మరూపంలోనో లంకలో ప్రవేశిస్తే వీరి మంత్రశక్తికి దొరికిపోతారు.

అటువంటి రక్షణలో ఉన్న నగరంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. హనుమ కనుక అలా చేయగలిగారు.

రావణుడు సీతమ్మను అపహరించి తీసుకుని వచ్చాడు.‌ ఎక్కడో కట్టుదిట్టమైన భవనంలో బంధించి ఉంచుతాడు కాని ఉద్యానవనంలో ఎలా ఉంచుతాడు.‌ సంపాతికి ఆ సమయంలో అక్కడ కనిపించింది అంటే అన్ని వేళలా అక్కడే ఉంటారు సీతమ్మ అని కాదుగా. సంపాతి చెప్పిన విషయం సీతమ్మ లంకలోనే ఉందని గ్రహించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

అంతా వెతికి సీతమ్మ కనపడక పోయేసరికి హనుమ ఓ చక్కటి ఆలోచన చేస్తారు:

" ఉత్సాహంగా వెదుకుతాను. మళ్ళీ వెతుకుతాను. ఇక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ వెదుకుతాను. అప్పటికీ కనబడకపోతే తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండి పోతాను. నేను ఎప్పటికయినా వస్తానని ఆశతోనయినా అక్కడ అందరూ ప్రాణాలతో ఉంటారు " అనుకుంటారు.

ఇక్కడ హనుమ చివరిగా " తపస్సు " చేసుకుంటానన్నారు. భగవధ్యానం. అదే శరణాగతి, భగవంతుడిపై భారం వేసేయడం. అటుపై అన్నీ భగవంతుడే చూసుకుంటారు.

అదే జరిగింది. ఇలా అనుకుని వెనక్కి తిరగ్గానే " అశోకవనం " కనబడింది. సీతమ్మ జాడ తెలిసింది.

మన శక్తికి మించిన పని అయినా, ఎన్ని సార్లు ప్రయత్నించినా పని అవకపోయినా భగవంతుడికి వదిలేయాలి అందుకే. నిరాశ చెందడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు.

హనుమ " బుద్ధిమతాం వరిష్ఠం " - ఆలోచించడంలో హనుమ తరువాతే ఎవరయినా.

శుభమస్తు

No comments:

Post a Comment