Wednesday, May 20, 2026

 చలం జయంతి సందర్బంగా...
చలం సాహిత్యంపై నా స్పందన 
--------------------------------------------
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో రచయితలు ఉద్భవించారు. ఉద్భవిస్తూనే ఉంటారు. వీరిలో ఇంచుమించు అందరూ కేవలం రచయితలు మాత్రమే. మానవ శ్రేయస్సే ధ్యేయంగా రచనలు చేపట్టి మనిషి ఆలోచనా విధానాన్ని "వాస్తవ జీవితం వైపుగా"  మరలే విధంగా ప్రభావితం చేయగల రచయతలు కొందరే ఉంటారు.ఆ కొందరిలో చలం ఒక్కడు

చలం ఏ సంకెళ్ళకు, ఏ సంశయాలకు తలొగ్గకుండా తాను ఏమీ ఆలోచించాడో,ఏది నమ్మాడో,ఏది అనుసరించాడో, ఏది ఆచరించాడో అదే వ్రాశాడు. తాను, తనలో ఉన్న రచయిత వేరు కాదు. ఏదైనా తాను ఒక్కడే.తెలుగు సాహిత్యంలో ఇలాంటి వైఖరి ఉన్న రచయిత తాను జీవించి ఉన్న కాలం వరకూ తానొక్కడేనేమో!

కీట్స్, షెల్లి,హార్డి వంటి ఆంగ్ల రచయితలు ప్రభావం,కృష్ణశాస్త్రి,నండూరి,శ్రీశ్రీ, చింతా దీక్షితులు  వంటి తెలుగు కవుల సాహిత్య సాన్నిహిత్యం,అతి ముఖ్యంగా 'రవీంద్రుని' ప్రభావం చలం పై అధికంగా ఉండడం వల్ల మరొక్కరికి సాధ్యం కాని ఓ ప్రత్యేక శైలి సాధించగలిగాడు.

భావస్పోరకత, ధ్వని,వ్యంగ్యము,పద చిత్రణ, శబ్ద స్ఫురణ చలం వచన రచనలోని ప్రధాన విషయాలు.ఈ ప్రత్యేకతల వల్లనే విశ్వనాథ సత్యనారాయణ వంటి సంప్రదాయ కవులు సహితం,చలం  వచన కవిత్వానికి ప్రభావితం కాగలిగారు.అందుకే సమిష్టిగా కొన్ని వేల మంది చేయలేని పనిని,చలం ఒక్కడే తన రాతల ద్వారా సమాజ జీవన విధానంలో,ఆలోచన వైఖరిలో మార్పును సాధించగలిగాడు 

చలం రచయితా ? సంస్కర్తా ? ప్రవక్తా? దార్శనికుడా ? అన్వేషకుడా ? సౌందర్యోపాసకుడా ? భావుకుడా ? తాత్వికుడా ? వీటిలో ఏ ఒక్కటో ప్రత్యేకంగా కాదు. వీటన్నిటి సమాహారమే చలం. దీనికై తన రచనలే సాక్ష్యం!

ఆయన సౌందర్యం గురించి చెప్పినా, శృంగారం గురించి చెప్పినా, స్త్రీ పురుష సంబంధాల గురించి చెప్పినా, వివాహ వ్యవస్థ గురించి చెప్పినా, బిడ్డల గురించి చెప్పినా,వాటిని ముందు తాను అనుభవంలోకి తీసుకొని ఆ అనుభవసారాన్ని పిండి వడగట్టి అక్షరరూపంలో అందించాడు.

1973 వ సంవత్సరంలో బలాంత్రపు రజనీకాంతరావుకి "ఆకాశవాణి విజయవాడ' కోసం ఇచ్చిన ఇంటర్వూలో(అరుణా'చలం'లో ఉన్నప్పుడే, అక్కడే) చలం ఇలా అంటాడు
"మొదటి పుస్తకం దగ్గర నుంచి ఈనాటివరకూ,నేను వూరకే వ్రాయాలని రాసిన పుస్తకం ఒక్కటీ లేదు. ఒక్క కథా లేదు. అవి నన్ను చీల్చుకుని నా రక్తంలోంచి వచ్చిన సత్యాలు" అంటాడు

ఇదే ఇంటర్యూలో మరో సందర్భంలో ....
"నా పుస్తకాల్లో తిట్టింది బయటవున్న మనుష్యులను కాదు. నన్ను నేనే".
 "నాలో ఏఏ మచ్చలున్నాయో వాటిని నేను గట్టిగా తిట్టుకోడంతోనే,నేను వ్రాసిన పుస్తకాలన్నీ బయలుదేరాయి.అవి మిమ్మల్ని అనుకుని నాపై మీరు చాలా కోప్పడ్డారు. మిమ్మల్ని కాదు - నన్ను నేను తిట్టుకున్న" అనే విషయాన్ని గ్రహించిన తర్వాత ఆయన్ని అర్థం చేసుకోవడంలో మన తెలుగు సమాజమే పొరబడిందేమో అని నాకు అనిపిస్తుంది.
ఆయన "ఆత్మకథ"చదివిన తర్వాత అంతర్గతంగా నాకు అదే భావన కలిగింది.

 ఏదేమైనా ఆయన సాహిత్యంలోని  తీవ్రత,ఆ లోతు,ఆ పదును,ఆ అక్షరాల్లో వ్యక్తంమయ్యే భావ సాంద్రత,మన ఆలోచనా సరళికి పదును పెట్టి, మన మానసిక పరివర్తనలో గొప్ప మార్పును తీసుకువచ్చి,మనల్ని ఓ కొత్త మార్గం వైపు నడిచేలా చేయగలిగిందనేది వాస్తవం.

చలం వ్రాసిన నవల, నాటకం, కథ, కవిత,అనువాదం, మ్యూజింగ్స్, లేఖలు, స్వీయ చరిత్ర లేక తన అనుభవాలు,అనుభూతులు,అభిప్రాయాలు ఇలా ఏదైనా కావచ్చు ,తన సాహిత్యాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసుకుని ఆకలింపు చేసుకున్న వారికి మాత్రమే తాను పూర్తిగా అర్థమవుతాడు.
చలం సాహిత్యం ఓ నిగూఢమైన చల్లనిచల్లకుండలాంటిది!
అది అనుభూతిమయం కావాలనుకుంటే 'చలాన్ని' చదువాలి !
🙏🙏🙏🙏🙏
ధన్యవాదములతో 
------------------------------------------
 మోకా మాధవరావు 
 తెలుగు విభాగము
 కడియాల రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ప్లస్), కాటూరు.

No comments:

Post a Comment