Wednesday, May 20, 2026

 *శ్రీశైల రగడ*

*శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని*
*పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి*
*కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా*
*ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము*
*ధారుణి లోపల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుట మైనది*
*బ్రహ్మ నిర్మల బ్రహిశృంగంబులు నిర్మలమగు మాణిక్య కూటములు*
*కోటలు కొమ్మలు గోపురంబులు తెఱపిలేని బహు దేవాలయములు*
*పుణ్య స్థలంబులు పుణ్య వనంబులు వాటమైన పూదోటలు మిక్కిలి*
*మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు*
*క్షేమ కరంబగు చింతామణులు అమృత గుండంబులు*
*కడు నైష్ఠికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడెటి రాజులు*
*సంతత లింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు*
*గణగణ మ్రోగెటి ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖ నాదములు*
*వీర శైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరు ధూపములు*
*జపములు చేసెటి జంగమోత్తములు తపములు చేసెటి తాపసోత్తములు*
*ప్రమథులు భక్తులు శైవ గణంబులు గట్టిగ ఇది భూకైలాసమ్మని*
*తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు*
*చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని*
*పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి*
*గురు మంత్రంబును జపమును చేసితి అకళంకుడనై ఆశ జయిస్తిని*
*శివ పంచాక్షరి మనసున నిలిపితి శివ తత్త్వము పరిశీలన చేసితి*
*పంచేంద్రియంబులు పదిలము చేసితి పంచ ముద్రలభ్యాసము చేసితి*
*అంతర్ముఖుడనైతిని, నాదబ్రహ్మ నాదము వింటిని లోపల తుమ్మెద నాదము వింటిని*
*వెలుగులకెల్లా వెలుగై వెలిగెడు ఆ లోపల దీపము కంటిని*
*ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిధానము కంటిని*
*కంటికి ఇంపగు పండు వెన్నెల విరిసిన షట్కమలంబులు పిండాండములో బ్రహ్మాండము కంటిని*
*అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్న రాజహంసను పట్టితి*
*చాల వేయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేళి సలిపితిని*
*మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మ్రొక్కి వేడితిని*
*నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి*
*మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు పిళ్ళారయ్యకు ప్రియముగ మ్రొక్కితి*
*ద్వార పాలకుల దర్శన మాయను ద్వార మందు రతనాల గద్దెపై*
*చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందర లింగం*
*నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్య లింగం*
*రాజితమైన విరాజిత లింగం పూజనీయమగు పురాణ లింగం*
*లింగము గనుగొని లింగ దేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని*
*లింగమందు మది లీనము చేసితి జీవన్ముక్తడనైతిని*
*అంకమంది భ్రమరాంబిక ఉండగా మల్లికార్జునిని కోరి పూజించితి*
*దీపము పెట్టితి దివ్య దేహునకు ధూపము వేసితి ధూర్జటి కప్పుడు*
*తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి*
*సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు జయ జయ జయ జయ జంగమరాయ*
*ఆదిదేవుడవు ఆత్మ శరణ్య దయ తప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్తనిధాన*
*ఎన్ని జన్మములు ఎత్తిన వాడను నిన్ను తలంపక నీచుడనైతిని*
*ఎన్నడు ఏ విధమెరుగని వాడను దుష్ట మానసుడ గౌరీ రమణ*
*తామస గుణములు తగులాటంబులు నియమము తప్పిన నీచవర్తనుడ*
*నిత్య దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును*
*చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి*
*సంసారంబను సంకెళ్ళల్లో హింస పెట్టమిక ఏలుము తండ్రి*
*ముల్లోకంబులు ముంచెడి గంగను సలలితముగా జడ ధరియిస్తివి*
*గొప్ప చేసి నిను కొలిచిన బంటును తప్పక చంద్రుని తల ధరియిస్తివి*
*విన్నుని చేత కన్ను పూజగొని సన్నుతి కెక్కిన చక్ర మిచ్చితివి*
*ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి*
*మూడు లోకముల ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలము నీవే*
*దాతవు నీవే,భ్రాతవు నీవే,తల్లివి నీవే,తండ్రివి నీవే,బ్రహ్మము నీవే,సర్వము నీవే*
*పాల ముంచుమిక నీట ముంచు మీ పాల బడితనో ఫాలలోచన అనుచు ప్రణతుల నిడుచు*
*ఇది చదివిన వారికి*

🌸 *ఫలశృతి:*

*కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలము*
*గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన్న ఫలము*
*ఆకలితో నున్న అన్నార్తులకును కమ్మనీ భోజనంబిచ్చిన ఫలము*
*భీతితో నున్నట్టి కడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము*
*అంత కన్నా ఫలము అధిక మయ్యుండు*

No comments:

Post a Comment