Monday, May 18, 2026

 జ్ఞాననిధి హనుమ

కార్యసాధకుడికి పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి ఓర్పు, నేర్పు సమపాళ్లలో జతకలవాలి. సహనం ఎంత ముఖ్యమో సమయస్ఫూర్తి కూడా అంతే అవసరమన్నది గ్రహించాలి. హనుమంతుడిలో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. సీతాన్వేషణకు ముందు రాముడు ఆంజనేయుడిలో గమనించిన విషయం కూడా ఇదే.

శాస్త్రరీత్యా హనుమ శబ్దానికి వాక్యకోవిదుడు, జ్ఞాని అనే విశేషార్థాలు ఉన్నాయి. హనుమ ఓ జ్ఞాననిధి. ఆయన వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు. వివేకం, ప్రతిభ, సమ యస్ఫూర్తి, సంయమనం మొదలైనవి హనుమలో పరిపూర్ణంగా ఉన్నాయి. అయితే జ్ఞానం కలిగి ఉంటే సరిపోదు. దాన్ని తగినవిధంగా సమయానికి వినియోగించడమన్నది ముఖ్యం. బుద్ధిబలాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎక్కడ పరాక్రమం ప్రదర్శించాలో, ఆలోచించి ఎక్కడ అడుగు ముందుకు వేయాలో హనుమకు బాగా తెలుసు. ఆయన మాటతీరు సుస్పష్టం. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వీనుల విందుగా మాట్లాడేవాడు. ఇంకా ఇంకా వినాలనిపించేలా ఉండేదట ఆ మాట. అతిగానో, మరీ క్లుప్తం గానో చెప్పకుండా విషయం అర్థమయ్యేలా వివ రించడం ఆయనలోని ప్రత్యేకత. వినయశీలురే విజయానికి చిరునామాగా నిలుస్తారు. హను మలో ఈ గుణం పరిపూర్ణంగా ఉంది.

అడవిలో కాషాయాంబరధారులై వస్తున్న రామలక్ష్మణులను చూసి శత్రువులుగా భావిం చాడు సుగ్రీవుడు. హనుమంతుడు ధైర్యంగా వారికి ఎదురెళ్లి కలిసి మాట్లాడి వెంట పెట్టుకు నివచ్చి సుగ్రీవుడితో స్నేహం కలిపించాడు. ఎదు టివారికి ఒక విషయం చెప్పేటప్పుడు ఎంతవ రకు అవసరమో అంతవరకే చెబుతాడు హనుమ. మాటలు అసందర్భంగా దొర్లనివ్వడు. ప్రధానంగా ఇది గమనించే శ్రీరామచంద్రుడు ఆయనను దూతగా నిర్ణయించుకున్నాడు. రాజహృదయం, ధర్మనీతి, కార్యసిద్ధి మెదలైనవి దృష్టిలో పెట్టుకోగలిగిన మేధావి మాత్రమే దూత కాగలడు. అశోకవనంలో సీతమ్మను గుర్తించి, ఆమెకు రాముడి ప్రేమను ప్రకటించి ఓదార్చాడు. రావణుడి సమక్షంలో శ్రీరాముడి వీరత్వాన్ని విడమరిచి చెప్పి అతడి గుండెల్లో ప్రకంపనలు సృష్టించి అధైర్య పరచాడు. పాలకుడు అధర్మపరుడైతే అతడికి, అతడి రాజ్యానికి అరిష్టం. స్త్రీని శోకింపచేస్తే మహాజ్వాలగా లేచి భస్మం చేస్తుంది. పర స్త్రీని చెరపట్టినవాడు ఎంతటి పరాక్రమవంతు డైనా పతనం తప్పదు. ఎంతటి భక్తిపరుడైనా దైవం సహకరించదు- అంటూ నర్మగర్భంగా హెచ్చరించాడు. సీతమ్మ తల్లితో 'అమ్మా! వానరసేనలో నాకంటే అధికులు, నాతో సమా నమైనవారు చాలామంది ఉన్నారు. నాకంటే అల్పుడు ఒక్కడు కూడా లేడు' అంటూ తనను తాను తగ్గించుకుని సీతమ్మకు ధైర్యం చెప్పాడు. ఏ కార్యమైనా సాధించగలననే ధైర్యం హనుమలో అణువణువునా నిండి ఉంది. నిజంగానే అంతటి సమర్థుడు కూడా.

'హనుమంతుడు ఉంటే అందరూ బతికి ఉన్నట్టే. ఆయనలేకుంటే ఎవరూ లేనట్టే నని' ఓ సందర్భంగా జాంబవంతుడన్న మాటల్లో ఎంతో పరమార్థం ఉంది. శ్రీరామ కార్యాన్ని అంకిత భావంతో సాధించి శ్రీమద్రామాయణ కావ్యంలోని సుందరకాండలో దేదీప్యంగా వెలుగుతున్నాడు హనుమంతుడు. జ్ఞాననిధి హనుమ నిత్యపూజనీయుడు.

యం.సి.శివశంకరశాస్త్రి

No comments:

Post a Comment