కోపానికి,ఆవేశానికి గల తేడా?
నాకు కోపం చాలా ఎక్కువ అందుకని ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చే అర్హత నాకు ఉందని అనుకుంటున్నాను. కోపానికి, ఆవేశానికి తేడా తెలియటం కోసం రెండు ఉదాహరణలు చెప్తాను నా సొంత అనుభవాలు:
మొదటి అనుభవం: కోపం
నేను ఏ పని చేసినా పూర్తిగా కాన్సంట్రేషన్ దాని మీద ఉంచి చేస్తాను, అది చదువుకోవటం ఐనా, తినటమైన, గిన్నెలు కడగటమైనా. ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎవరైనా అనవసరంగా కదిలిస్తే చిరాకు పడతాను (కానీ చూపించను). ఒకసారి మా అత్త, వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చారు. నేను చదువుకుంటున్నాను. పలకరించి వెళ్ళిపోయాను నా గదిలోకి. "ఊరి నుంచి వచ్చాము, నాతో టైం spend చేయి", అని వచ్చిన దగ్గర నుంచి ఒకటే నస మా బావ. చాలా సేపు చెప్పాను, "నాకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చదువుకోవాలి" అని. మా బావ వినకుండా నా పుస్తకం లాక్కున్నాడు. సాచి చెంప మీద కొట్టాను. కొట్టడంతో పాటు, నా పుస్తకం వెనక్కి తీసుకుని గట్టిగా చేయి కొరికాను, రక్తం వచ్చే లాగా. (చిన్న పిల్లని అనుకుంటారేమో, అప్పుడు నా వయసు 21, డిగ్రీ ఫైనల్ year, మా బావ వయసు 29). ఇది కోపం, నా సమయం వృధా చేస్తున్నాడని.
రెండో అనుభవం: ఆవేశం
ఒకసారి నేను, మా చెల్లి కూరగాయలు తీసుకు రావటానికి మెహ్దిపట్నం రైతు బజార్ కి వెళ్ళాము. హైదరాబాద్లో దేనికైనా కొరత ఉందేమో కానీ, చిత్తకార్తె సన్నాసులకి మాత్రం ఏ కొరత లేదు. ఒక శుంఠ నాకు తగిలాడంట, మా చెల్లి వాడిని తిట్టింది (మా చెల్లి శాంత మూర్తి). అలాంటిది ఎందుకు తిడుతుంది అని అడిగాను, మా చెల్లి సగం మింగేసి "తగిలాడు" అని మాత్రం చెప్పింది. ఆ వెధవ మా చెల్లిని తగిలాడు అని అనుకుని, నాకు ఆవేశం పొంగి వాణ్ణి చెంప మీద రెండు సార్లు కొట్టి, చేతిలో ఉన్న హ్యాండ్ బాగ్ తో నాలుగు బాదాను. ఈ లోపల అందరూ పోగయ్యరు, వాళ్ళకి విషయం చెప్పి, ఆ రైతు బజార్ లో ఆఫీస్ లో కంప్లైంట్ చేసి వచ్చాను, కూరగాయలు తీసుకోవటం మర్చిపోయి.
ఇది ఆవేశం!
రెండూ గొప్ప సద్గుణాలు అయితే మాత్రం కాదు. BP త్వరగా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి శాంతంగా ఉండటం మేలు (మళ్ళీ నా స్వానుభవంతో ఉచిత సలహా).
No comments:
Post a Comment