Monday, May 18, 2026

 రాముడు పరశురాముడు ఇద్దరూ విష్ణువు అవతారాలే కదా

మరి పరశురాముడు ఓడిపోవడం ఏమిటి ?

శ్రీరామచంద్రుడు పరిపూర్ణావతారం

పరశురాముడు అనబడే భార్గవరాముడు అంశావతారం

వారికి యుద్ధం జరగలేదు

విష్ణుచాపం అందించడంలోనే ఆయన ఎవరో గ్రహించాడు భార్గవుడు

ఇద్దరూ ఎదురు పడడం ఓ అంతుబట్టని దైవలీల

పరమాత్మ ఒక ఉపాధికి పరిమిత మౌతాడు అని నాలాంటి పరిమితమైన ఉపాధి కల వాడి ఆలోచన పరిభ్రమిస్తూ ఉంటుంది

ఆమాటకొస్తే శివుడికి కేశవుడికీ అభేదం మరి విడివిడిగా చూడటం లేదా వారి వేరువేరుగా చూడవద్దు అని సంధ్యావందనంలో చెప్పుకుంటూనే మళ్ళీ మాయలో పడిపోవడం నాలాంటి అల్పులు చేసే పని

రమణులు ఓ కోతితో సంభాషించారు ఓ ఆవుతో సంభాషించారు ఎలా

ఆయనేమన్నా ముప్పైరోజుల్లో కోతిభాష లాంటి పుస్తకాలు చదివారా లేక శిక్షణ తీసుకున్నారా (అలా ఎవరైనా ఇవ్వగలరా )

మరి ఎలా సాధ్యం

విశ్వవ్యాప్తమైన పరమాత్మ తో అనుసంధానమైన వారు అన్ని జీవులలోని ఆత్మ తోనూ అనుసంధానం కాగలరు

భార్గవుడూ శ్రీరాముడు ఎదురుపడడం గురించి తికమకపడే నేను

వరాహస్వామి వేంకటేశ్వరుడూ ఎదురుపడడం ఒప్పందం చేసుకోవడం ఎలా అర్థం చేసుకోగలను

ఇంతే కాదు నా దృష్టి సంకుచితమైనపుడు వాల్మీకి రామాయణంలో గూఢంగా ధ్వని రూపంలో నిండి నిబిడీకృతమైన శ్రీరామతత్వాన్ని ఎలా అర్థం చేసుకోగలను

ఒకే పరబ్రహ్మ యొక్క రెండు రూపాలైన రాముడు హనుమలను వేరు వేరుగా ఎందుకు చూస్తున్నాను

ఇక్కడ బాబాగారన్న మాటలు గుర్తుకొస్తాయి

ఆయనని ఎవరో అడిగారు

మీరు దేవుడా

అవును బంగారూ అన్నారాయన

ఎలా

ఆయన నవ్వి నువ్వూ దేవుడివే ...నువ్వు గుర్తించలేదు నేను గుర్తించాను అంతే బంగారూ అన్నారు

గంగాయమునా ప్రవాహంలా శ్రీరాముడు హనుమ రామాయణంలో కనబడితే

వారిరువురూ ఒకరే అన్న స్ఫురణ అంతర్లీనమైన కనపడని సరస్వతీ ప్రవాహం

అది త్రివేణీ సంగమం

అందులో మునక వేయడం ఆఎరుక తెచ్చుకోవడం

లేకపోతే నాలాగ మాయలో కొట్టుమిట్టాడుతూ

అఙ్ఞానం లో మళ్ళీ మళ్ళీ పుట్టి చావడమే

అంతవరకూ రాముడు తప్పితే ఇంకేమీ లేదు అన్న విషయం అర్ధం కాదు రాముడు దేవుడా మానవుడా ఆర్యుడా ద్రావిడుడా అనే పిచ్చి సందేహాలలో శ్లేష్మంలో పడిన ఈగలాగ జన్మ పరంపరలో కొట్టుకోవడమే

రామా నాకు అర్థం కావా దయయుంచి

డా .సూర్యనారాయణ వెన్నేటి

No comments:

Post a Comment