”మనసు మరియు మోక్షం’-- గురు శిష్యుల సంభాషణ
శిష్యుడు: గురువు గారు, మోక్షం పొందాలంటే ఏం చేయాలి?
నా ’మనస్సు’తో ఎంతో ప్రయత్నం చేస్తున్నాను.
ధ్యానం, జపం, వేదాంతం చదువుతున్నాను...
కానీ ఇంకా ’శాంతి’ లేదు.
గురువు: ’మనస్సు’తోనే మోక్షం కోరుకుంటున్నావా?
శిష్యుడు: అవును గురువు గారు.
గురువు: అదే పొరపాటు. ’మనస్సు’ను ఆధారం చేసుకొని విముక్తి కోరడం అంటే, ’బంధనాన్ని’ సృష్టించిన ’ఆయుధం’తోనే బంధనం నుండి విడుదల కావాలని ప్రయత్నించడం లాంటిది.
శిష్యుడు: అయితే ’మనస్సు’ ద్వారా మోక్షం సాధ్యం కాదా గురువు?
గురువు: కాదు. మనస్సే నిన్ను ’బంధనం’లో పడేసింది.
అది నిన్ను "నేను శరీరం, నేను మనస్సు" అని నమ్మించి, సుఖ-దుఃఖాల లోకంలో తిప్పుతోంది. ఇప్పుడు అదే మనస్సుతో విముక్తి ఎలా కలుగుతుంది?
శిష్యుడు: అయితే ఏం చేయాలి గురువు?
గురువు: మనస్సును దాటి వెళ్లు. పూర్తిగా అతిక్రమించు.
శిష్యుడు: ఎలా గురువు? దయచేసి చెప్పండి.
గురువు: సరళంగా అడుగు. "నేను ఎవరు?"
ఒక ఆలోచన వచ్చినప్పుడు, "ఈ ఆలోచన ఎవరి? ఇది నాదా?" అని వెనక్కి తిరిగి చూడు. ఆలోచన యొక్క మూలం వరకు వెళ్లు. అక్కడ మనస్సు ఆగిపోతుంది. శాశ్వతమైన నిశ్శబ్దం, ఆత్మ స్వరూపం మిగులుతుంది.
శిష్యుడు: కానీ గురువు, 'మనస్సు’ చాలా బలంగా ఉంటుంది. అది నన్ను వెనక్కి లాగేస్తుంది.
గురువు: అది సహజం. మనస్సు అలవాటు చేసుకుంది. కానీ నువ్వు నిరంతరం "నేను ఎవరు?" అని విచారణ చేస్తూ ఉంటే, మనస్సు తనంతట తాను బలహీనమవుతుంది. చివరికి అది ’ఆత్మ’లో కలిసిపోతుంది.
శిష్యుడు: ఇది చాలా ’కష్టం’ అనిపిస్తుంది గురువు...
గురువు: (మెల్లగా నవ్వుతూ) ’కష్టం’ అనుకునేది కూడా మనస్సే. నువ్వు ఆత్మవు. ఆత్మకు ఎలాంటి కష్టం ఉండదు. ఉండేది ఒక్కటే.. శాంతి, పూర్ణత్వం.
No comments:
Post a Comment