Monday, May 18, 2026

 *మేనమామ*

"ఏవండీ మా మేనమామ పోయాడుట. ఫోన్ చేసి చెప్పారు అంటూ చెప్పింది సుమతి భర్త మోహన్ ఆఫీస్ నుండి రాగానే. అలాగా! అయ్యో పాపం అన్నాడు. అంతే ఆ తర్వాత ఏ మాట లేదు. ఆ తర్వాత భర్త చెప్పబోయే మాట గురించి ఎదురు చూసింది సుమతి. భర్త నుంచి ఎటువంటి సమాధానం రాక పోవడంతో చివరికి ధైర్యం చేసి "ఏవండీ మాకు ఉన్న ఒక్క మేనమామ వాళ్ల కుటుంబాన్ని అత్తయ్యని చూసి రావాలండి అని అడిగింది భర్తని సుమతి. 

నాకు ఆఫీసులో బోలెడు పనులు ఉన్నాయి. సెలవు దొరకడం కష్టం. అయినా ముంబై నుంచి ఆ పల్లెటూరు వెళ్లాలంటే ఎంత కష్టం. రిజర్వేషన్లు దొరకవు. ఫ్లైట్ కి వెళ్లాలంటే చాలా ఖర్చు. పైగా చలికాలం. మరి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు భార్యవైపు. అయినా మనం వెళ్లేసరికి ఆయన శవాన్ని ఇంకెవరిని చూస్తాం. ఏదో వెళ్లేవని పేరు కానీ ! ఇద్దరు పిల్లల్ని తీసుకుని నువ్వు ఒకదానివి వెళ్లడం చాలా కష్టం అని చెప్పి వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. 

సుమతికి ఒక్కసారి దుఃఖం పొంగుకు వచ్చింది. ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది. 
సుమతి అమ్మమ్మగారి ఊరు తూర్పుగోదావరి జిల్లాలో పల్లిపాలెం గ్రామం. సుమతి అమ్మమ్మ పేరు సీతమ్మ తాతయ్య పేరు చలపతిరావు. చలపతిరావు గారికి  నలుగురు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు. మగ పిల్లవాడు అచ్యుత రామయ్య  అందరికంటే పెద్దవాడు.

నలుగురు ఆడపిల్లలకి ఒక్కొక్కరికి ఇద్దరు  ఆడపిల్లలు. అందరూ ఆడపిల్లలే కావడంవల్ల మేనకోడళ్ళకి ఒక అన్నగారిగా కూడా ఉండేవాడు అచ్యుతరామయ్య. 

అందరికంటే పెద్దవాడు కావడం వల్ల అక్కచెల్లళ్ళు అందర్నీ గారాబంగా చూసుకునేవాడు  అచ్యుతరామయ్య. అక్కల పిల్లలందరినీ చిన్నప్పటినుంచి ఎత్తుకుని పాడించి ఆట నేర్పి పాట నేర్పి వాళ్ల అక్కలు పుట్టింటికి వచ్చినప్పుడు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు సుమతి మేనమామ అచ్యుతరామయ్య.   చిన్న పనికి పెద్ద పనికి వాళ్ళ అక్కచెల్లెళ్లకి సహాయపడుతుండేవాడు. చాలా అభిమానం అచ్యుతరామయ్యకి

అక్కాచెల్లెళ్ల పిల్లలతో పాటు అందరూ కలిసి భోజనాలు చేయడం పిల్లలకు కథలు చెప్పడం, కబుర్లు చెప్పడం, సైకిల్  నేర్పడం పల్లెటూరు కావడం వాళ్ళకి చెరువుల్లో ఈత కొట్టడం, నేర్పడం పొలం గట్లమీద తిప్పడం పక్క ఊరికి సినిమాకి తీసుకెళ్లడం ఇలా పిల్లలందరూ సెలవులకు వచ్చినప్పుడు వాళ్లతో పాటే ఎంత పెద్దవాడైనప్పటికీ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.

 పిల్లలు అంటే చాలా సరదా అందుకే మేనకోడళ్ళతో చాలా సరదాగా ఉండేవాడు. తన ఇద్దరు పిల్లలతో పాటు ప్రతి పండక్కి పిల్లలందరికీ సమానంగా బట్టలు కొనేవాడు. మేనకోడలు పెళ్లిళ్లు సంబంధాలు తనే చూసి దగ్గరుండి అన్ని పనులు యధావిధిగా చేసి పెళ్లి వారిని సంతృప్తిపరిచి వెళ్లేవాడు. మేనకోడళ్ళని బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి మండపం దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు అచ్యుతరామయ్య కళ్ళల్లో కన్నీళ్లు కనిపించేవి అందరికి. అప్పగింతల సమయంలో అసలు పెళ్లి మండపంలో  కనిపించేవాడు కాదు. అంత ప్రేమ మేనకోడళ్ళు అంటే . 

మేనకోడళ్ళ ఇంటిలో తోరణం కడితే చాలు వెంటనే వచ్చి అన్ని పనులు చక్కపెట్టి వెళ్లేవాడు. అలాంటి మేనమామ తల్లి తర్వాత తండ్రి అంతటివాడు. 

టీచర్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోయి ఆ ఊర్లోనే ఉంటూ అప్పచెల్లెళ్లని, బావ గార్లని, మేనకోడళ్ళని వాళ్ల భర్తల్ని పిల్లల్ని తన పిల్లల్ని అందర్నీ సంక్రాంతి పండక్కి మొన్నటి మొన్నటి వరకు ఆ ఊరికి పిలుస్తూనే ఉండేవాడు. తాతయ్య అమ్మమ్మ వారసత్వం నిలబెట్టింది మా మేనమామ ఒక్కడే. ఆ ఊరుతో అనుబంధం మాకు ఈనాటి వరకు కొనసాగింది అంటే మా మేనమామ ఆ ఊర్లో ఉండడం వల్ల. మేనకోడళ్ల వరకు సరే వాళ్ల భర్తలను కూడా సొంత పిల్లల్లా చూసే మా మేనమామ ఏమిటో లేరని సరికి మనసంతా అదోలా ఉంది. 

ఒక్కసారిగా భర్త మోహన్ మీద కోపం వచ్చింది. ఇలాంటి సమయంలో కూడా డబ్బు ఖర్చు గురించి చూసుకున్నాడు. సెలవు లేదని ఏవేవో సాకులు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మారుతారు. బంధుత్వాలకు విలువ ఎప్పుడు ఇస్తారు. అందులో రక్తసంబంధీకులు. మనం ఎవరింటికైనా వెళ్లకపోతే వాళ్లు కూడా మన ఇంటికి ఎందుకు వస్తారు. కష్టంలోనూ సుఖoలోను  అయినవాళ్లను పలకరించకపోతే బంధుత్వం ఎలా  కొనసాగుతుంది.అన్నింటినీ డబ్బుతో ముడి పెట్టలేం. డబ్బున్న లేకపోయినా  కొంతమంది      ఇటువంటి సమయంలో వెంటనే వస్తారు
అది వాళ్ళ సంస్కారం. 

అందులో పెళ్ళాం తరుపు బంధువులు అంటే ఎందుకో అంతగా ఇష్టం చూపరు. ఆడపిల్లను కదా ఏం చేయగలను. ఒకపక్క మనసులో పీకుతున్న  మౌనంగా ఉండి పోవడం తప్పితే భర్తను ఎదిరించి ఏం చేయగలను అని బాధపడుతూ నిద్రలోకి జారిపోయింది సుమతి. 

తెల్లవారి లేచేటప్పటికీ  మోహన్ తల్లితో  కాబోలు మాట్లాడుతున్నాడు. లేదమ్మా నాకు సెలవు లేదు అయినా బోల్డంత దూరం బోళ్లంత ఖర్చు అంటు ఏవేవో చెప్పుకుంటూ వస్తున్నాడు మోహన్. 

లేదమ్మా ఇద్దరి పిల్లల తోటి సుమతిని ఒంటరిగా పంపించలేను అనేసరికి అవతల నుంచి అత్తగారి మాటలు స్పీకర్లో వినపడ్డాయి. తప్పురా! మన కోడలి బంధువులు మనకి బంధువులే. అయినా సొంత మేనమామ మనం సుమతిని పంపించకపోతే మన గౌరవం ఏమి నిలబడుతుంది ? అయినా అమ్మాయి కూడా బాధపడుతుంది. కాబట్టి నువ్వు వెంటనే సిక్ లీవ్ పెట్టి తీసుకుని వెళ్ళు ఇంకేమి ఆలోచించకు అని ఫోన్ పెట్టేసింది అవతల నుంచి సుమతి అత్తగారు.

కాసేపటికి మోహన్ బయటికి వచ్చి బట్టలు సర్దు. మనం పల్లిపాలెం వెడదాం అనేసరికి మేనమామ పోయిన మాట మర్చిపోయి ఒక్కసారి ఆనందం వచ్చింది సుమతికి. 
ఒక తరానికి ఒక తరానికి ఆలోచన విధానంలో ఎంత మార్పు. ఆ తరం బంధువులకి బంధుత్వాలకి అనుబంధాలకి ఆప్యాయతలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ తరం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది పరిస్థితి. ఆ తరం దాటిపోతే ఈ బంధుత్వాలు ఇలాగే ఉంటాయేమో అనుకుంది సుమతి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.

No comments:

Post a Comment