*🧘♂️శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం🧘♀️*
*గడ్డపార (గునపం) యొక్క ముఖ్య ఉపయోగం దానితో నేలను త్రవ్వి మొక్కలు నాటుకోగలగటం. ఆ మొక్కలకు కాసిన పండ్లుగాని, కూరగాయలుగాని మన ఆకలిని తీరుస్తాయి. అంతేకాని ఆ గునపాన్ని మింగేస్తే మన ఆకలి తీరదు కదా.*
*అలాగే మన సంసార బంధానికి కారణమైన మనస్సును, ఇంద్రియాలను ధ్యానం వైపు మరల్చుకోవాలి కానీ సంసారాన్ని వదలివేస్తానంటే అది మనను మళ్ళీ అంతకంటే తీవ్రంగా కమ్ముకుంటుంది.*
*స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగే చిలకలను తెచ్చి బండికి కట్టి లాగమంటే అవి లొంగకపోగా బండిని కూడా ఆకాశంలోకి ఎగరేసుకు పోవటానికి ప్రయత్నిస్తాయి. అలాగే ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించుకుంటే అవి సమయం కోసం పొంచి ఉండి మనను ఘోరంగా దెబ్బ తీస్తాయి.*
*మండే అగ్నిని తెచ్చి మసి గుడ్డలో మూటకట్టి ఇంట్లో పెట్టుకుందామంటే అది దాగి ఉండకపోగా ఇల్లంతా తగలబెట్టేస్తుంది. అలాగే మమకారాన్ని బలవంతంగా దాచి ఉంచుదామంటే అది మనలనే బానిసగా చేసుకుని ఆశలలో పడవేస్తుంది.*
*అలాగే విష సర్పాన్ని తెచ్చి దిండుకింద పెట్టుకొని అణగి ఉండమంటే అది మననే కాటు వేస్తుంది. అందువల్ల ఈ సంసారాన్ని నిగ్రహించాలంటే మనవల్ల కాదు. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం.*
*ఇంద్రియాలు, మనస్సు స్ప్రింగ్ వంటివి. బలవంతంగా అణచి పెట్టాలని చూస్తే అదను చూసి అంతకంటే బలంగా ఎదురు తిరుగుతాయి. ఈ మనస్సు, శరీరము మనకు శత్రువులు కావు. పరమార్థ సాధనకు ఎంతో ఉపయోగపడే సాధనాలు.*
*అశాశ్వతమైన క్షణిక సుఖాల కోసం పరుగులు పెట్టే వీటికి శాశ్వతమైన పరమాత్మ వస్తువునందు మెల్లమెల్లగా ఆసక్తిని కలిగించాలి. ఒకసారి రుచి మరిగిన తరువాత వాటంతట అవే సంసారాన్ని వదిలివేస్తాయి.*.
No comments:
Post a Comment