*శివపురాణం* -21 వ భాగం:(C)
భస్మధారణము అనేది మనుష్యుని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషము. మనకి వాసనలు కొని జన్మల నుండి తరుముకు వస్తాయి. విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. పాపక్షయం అంటే ఇదే. శాస్త్ర ప్రకారం ‘భ’ భస్మ ధారణము పాపములను తీయగలదు. మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుడిని చేరకుండా భోగముల వైపుకి తిప్పెస్తున్నాయి. అధర్మబద్ధమయిన భోగముల కోసం వెంపర్లాడుతుంటారు. అలా వెంపర్లాడకుండా చెయ్యగల్గినది ‘సమ’ భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు ‘భస్మ’. భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం దరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను పట్టి జాగ్రత్తగా కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం. భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉన్నది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మీయందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది.
శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసేముందు పంచ బ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఏ చెట్టునుండి ఎన్ని పువ్వులను కోయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధారా శివలింగం మీదనుండి క్రిందపడగానే ఈయన పాదములన్నీ హరిస్తాయి. శివలింగం మీదినుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమయిన తేజస్సు ఉద్భవించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాపవిమోచనం అయిపొయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి భస్మం అంత గొప్పది.
ఇంతటితో శివపురాణం -21 వ భాగం సమాప్తమైనది...
|| ఓం నమః శివాయ ||
No comments:
Post a Comment