Thursday, November 13, 2025

 9️⃣6️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.* 
  (నాలుగవ అధ్యాయము)

*10. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః!* 
*బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాఃll*

ఎవరైతే రాగము, భయము, కోపము విడిచిపెడతాడో, ఎవరైతే తన చిత్తమును నా యందు లగ్నం చేస్తాడో, నన్ను ఆశ్రయిస్తాడో, అటువంటి వారు జ్ఞానము అనే తపస్సు చేత పవిత్రులౌతారు. తుదకు నన్నే పొండుతారు.

ఈ శ్లోకంలో జ్ఞానయోగ విశిష్టతను గురించి తెలియజేసాడు కృష్ణుడు. జ్ఞానము అనేది ఒక తపస్సు. జ్ఞానము ఆర్జించడం ఒక తపస్సులాగా చేయాలి. శరీరానికి మురికి అంటుకుంటే నీటితో శుభ్రం చేస్తాము. అలాగే మనసుకు మురికి అంటుకుంటే దానిని జ్ఞానము అనే తపస్సు చేసి శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మనస్సు, శరీరము పవిత్రము అవుతాయి. మరి ఈ జ్ఞానము అనే తపస్సు చేయడానికి ముందు ఏం చేయాలి అంటే మమకారము, కోరికలు, భయము, కోపము విడిచిపెట్టాలి. ఇది మొదటి లక్షణము. ఇవి ఉంటే మనసు నిర్మలంగా ఉండదు. చంచలంగా ఉంటుంది. అందుకని ముందు వీటిని వదలాలి. తరువాత మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచాలి. పరమాత్మనే ఆశ్రయించాలి. ఈ మూడు లక్షణాలు ఉంటే జ్ఞానము అనే తపస్సు సిద్ధిస్తుంది. ఇది కేవలం కృష్ణుని మాటలు కాదు. ఇంతకు ముందు ఎంతో మంది ఈ జ్ఞానతపస్సును ఆచరించి పరమాత్మలో లీనం అయ్యారు అని చెబుతున్నాడు పరమాత్మ.

ఈ శ్లోకంలో మన్మయా, మామ్ ఉపాశ్రితాః అనే పదాలు వాడారు. మన్మయా అంటే నీ మనసు నా యందు లగ్నం చెయ్యి. మామ్ ఉపాశ్రితాః అంటే నన్నే ఆశ్రయించు. ఈ రెండు పనులు చేయాలంటే ముందు రాగము, భయము, కోపము వదిలిపెట్టాలి. అవి వదిలిపెడితేనే గానీ, మనసు పరిశుద్ధం కాదు. మనసు పరిశుద్ధం కావాలంటే బయట ఉన్న కోరికలను, ఇష్టాయిష్టాలను, భయాన్ని, కోపాన్ని వదిలి పరమాత్మను ఆశ్రయించాలి. అప్పుడు మనసు నిర్మలం అయి పరమాత్మ యందు లగ్నం అవుతుంది. ఇదంతా జరగాలంటే జ్ఞానం కావాలి. పరమాత్మను గురించి పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలి. దానికి శాస్త్రములు అధ్యయనం చేయాలి. గురువుల వద్ద ఉపదేశం పొందాలి. గురుముఖతా శాస్త్రములను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవాలి. ఈ జ్ఞానమును ఒక తపస్సు లాగా ఆర్జించాలి. అంతే కానీ ఏదో ఆషామాషీగా నేర్చుకోవడం కాదు. శాస్త్రములను ఏకాగ్రతతో, శ్రద్ధతో చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆచరణలో పెట్టాలి. ఈ విధంగా జ్ఞాన తపస్సును చేసిన వారు తమ మనస్సును పరమాత్మ యందు నిలపగలరు. ఇదంతా కష్టం ఎవరి వల్లాకాదు అని అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే, అటువంటి వారు పూర్వము చాలా మంది ఉన్నారు. వారంతా పైన చెప్పబడిన విధంగా ఆచరించి నన్ను చేరుకున్నారు. నాలో ఐక్యం అయ్యారు. అని పరమాత్మ బోధించాడు.

దీనిని మనం కొంచెం వివరంగా తెలుసుకుందాము. అసలు పరమాత్మను గురించి తెలుసుకోవడం ఎలా? అని ప్రశ్న వేసుకుంటే దానికి రెండు మార్గాలు గోచరిస్తాయి. ఒకటి సగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. కొంత మంది మొదటిది ఆచరించి తరువాత రెండవ దానికి వెళతారు. అంటే సగుణోపాసనతో మొదలు పెట్టి, క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మళ్లుతారు. మరి కొంతమంది నేరుగా రెండవ దానికి వెళతారు. సగుణోపాసన చేసిన వారు, నేను ఈశ్వరుని గురించి తెలుసుకున్నాను అని ఎవరన్నా అంటే వారు ఈశ్వరుని గురించి కొంచెమే తెలుసుకున్నారనీ, పూర్తిగా తెలుసుకోలేదనీ అర్థం. సగుణోపాసన అంటే ఏకరూపంగా పరమాత్మను అర్జించడం. రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, దుర్గ, పార్వతి, శివలింగము, వినాయకుడు, కుమారస్వామి మొదలగు దేవతామూర్తులను అర్చన మూర్తిగా ఇంటిలో పెట్టుకొని, వారికి ఆవాహన అర్చన మొదలగు షోడశ ఉపచారములను చేస్తూ పూజించడం. పరమాత్మను ఒక రూపంలో పూజించడం. ఆయన సర్వస్వం అనుకొని పూజించడం. ఈ అర్చన మూర్తులను పూజించడం పరమాత్మ సాక్షాత్కారానికి ఒక మెట్టు మాత్రమే కానీ ఇదే ముఖ్యం కాదు. కాని ఈ రోజుల్లో చాలా మంది ఇక్కడే ఆగిపోతున్నారు. అర్చన మూర్తులకు చేసే అలంకారాలమీదా, ఉత్సవాలమీదా, ఆ విగ్రహాల విశిష్టత మీదా, మహిమల మీదా దృష్టిపెడుతున్నారు. వాటి వెనుక ఉన్న పరమాత్మ తత్వము గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. దీని గురించి శాస్త్రములు స్పష్టంగానే చెబుతున్నాయి. కానీ మన తాత్కాలిక ప్రయోజనాలకు, మన కోరికలు తీరడం కోసం ఇదే ముఖ్యం అనుకొని ఇక్కడే ఆగిపోతున్నాము. శాస్త్రము ముందు సగుణోపాసనతో మొదలు పెట్టి, తరువాత నిర్గుణోపాసన వైపు వెళ్లమని చెబుతుంటే, మనం సగుణోపాసనతోనే ఆగిపోతున్నాము. ఇదంతా శాస్త్రములను సరిగా అవగాహన చేసుకోకపోవడం వలన కలిగే అపోహ తప్ప వేరుకాదు.

సగుణోపాసనలోనే తరువాతి ఘట్టం - మన ఇంట్లో మన పూజాగృహంలో ఉన్న చిన్ని విగ్రహం, అర్చన మూర్తి, ఎవరో కాదు అంతటా నిండి ఉన్న పరమాత్మ స్వరూపము అని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఒక్కడే, వేరు వేరు రూపాలు కాదు. మన సౌకర్యాన్ని బట్టి మనం వేరు వేరు రూపాలలో అర్చనమూర్తులుగా పూజిస్తున్నాము అనే జ్ఞానం రావాలి. ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అనే భావన రావాలి. ఈ భావన రావడానికి తొలిమెట్టు సగుణోపాసన. పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే భావన మనలో కలగడానికి ముందు సగుణోపాసన ప్రతివాడికి అవసరమే. మానవుడు కూడా ఏడాది వయసు నుండి ఐదేళ్లదాకా తల్లి వేలుపట్టుకొని నడుస్తుంటాడు. వేలు వదిలిపెట్టడు. ఎందుకంటే అది ఆ వయసులో అవసరం. కాని పాతికేళ్లు వచ్చిన తరువాత కూడా తల్లి వేలుపట్టుకొని నడవాలని అనుకోడు. ఎందుకంటే ఒక వయసు దాకా తల్లి రక్షణ అవసరం. తరువాత స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్లగలడు. అలాగే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడానికి సగుణోపాసన అవసరం కాని అదే పరమార్థం కాదు. జీవితాంతం సగుణోపాసన చేస్తుంటే మనకు వయసు వచ్చినా మనలో చిన్నపిల్లవాడి మనస్తత్వము, మరొకరి మీద ఆధారపడే తత్వము పోనట్టే కదా! కాబట్టి ప్రతివాడూ ఈ స్థితి నుండి బయట పడి, విశ్వచైతన్యస్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, అవ్యయుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అయిన పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆత్మతత్వము తెలుసుకుంటాడు. తనకు పరమాత్మకు భేదం లేదు అని తెలుసుకుంటాడు. తానే పరమాత్మ అనే స్థితికి వస్తాడు. ముందు తనలో ఉన్న గుణములను అన్నీ పోగొట్టుకొని నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మలో ఐక్యం కావడం. అదే సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మళ్లడం, ఇదే శాస్త్రము మనకు బోధించింది. కాని మనం శాస్త్రములను సరిగా అర్థం చేసుకోకుండా, మనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉన్నాము.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P229

No comments:

Post a Comment