ఈ విశ్వంలో ఎవరూ ఇంకొకరికంటే గొప్ప వారు కాదు. గొప్ప దనం అనేది సామజిక పరంగా ఆలోచించినపుడే వర్తిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
గతంలో సామాన్యుడి జీవితం చాలా సరళంగా, సాదాసీదాగా గడిచిపోయేది. సెల్ ఫోన్లు లేకపోయినా, మనిషి సుఖంగా జీవించాడు. ఇంటర్నెట్ లేక పోయినప్పుడు కూడా ఆనందమైన జీవితం అనుభవించాడు. అన్నీ సౌకర్యాలు వుండికూడా నేడు మనం సుఖంగా జీవించలేక పోతున్నాం. కారణం ఒకప్పుడు సరళంగా ఉండే జీవితం ఇప్పుడు సంక్లిష్టం గా మారిపోయింది. సుఖానికి నిర్వచనం పూర్తిగా తారుమారై పోయింది. ఒకప్పుడు సుఖంగా ఉండటమంటే మనం బాగా ఉండటం. ఈ కాలంలో సుఖంగా ఉండటమంటే పక్క వారికంటే బాగా ఉండటం.
నేటి సంక్లిష్ట ప్రపంచంలో మనిషి రకరకాల మానవ సంబంధాలు. ఆర్ధిక వ్యవహారాలు, సాంఘిక సమస్యలు, ఉద్యోగ వ్యాపారాల మధ్య నలిగిపోతున్నాడు. పోటీ ప్రపంచంలో నిలదొక్కు కోవడానికి పడ రాని పాట్లు పడుతున్నాడు. తనను తను గుర్తించడం కంటే తన చుట్టూ ఉండే ప్రపంచం చేత గుర్తించ బడటానికే ఎక్కువ విలువ ఇస్తున్నాడు. తనను ఎవరూ గుర్తించక పొతే ఏకాకిగా ఫీలవుతున్నాడు. తనను తాను గుర్తించడానికంటే, ఎదుటి వారి గుర్తింపు పొండటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. పది మంది మెచ్చుకుంటే సంతోషంతో పొంగి పోతాడు. ఒక్కడు విమర్శించినా కుంగిపోతాడు.
గుర్తింపు పొందాలనే ఆలోచన మనుషుల మధ్య పోటీకి మరియు పోలికకు దారి తీస్తుంది. ఆటల్లో పోటీ, పాటల్లో పోటీ, కట్టే బట్టల్లో పోటీ, ఉండే ఇంటిలో పోటీ, పిల్లల్లో పోటీ, ఆస్తుల్లో పోటీ, అంతస్తుల్లో పోటీ, అన్నింటిలో పోటీ.
పోటీ మంచిదే కదా అని కొందరు వాదించవచ్చు. పోటీ ఉంటేనే కదా మనిషి ఎదగ గలిగేది అని కొందరు అనుకోవచ్చు.
ఎవరయినా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. ఎదుటి వారికంటే ఎక్కువ ఎదగాలి అనుకోవడం మంచిది కాదు. డబ్బులు సంపాదించాలి అనుకోవడంలో తప్పు లేదు. పక్క వారికంటే పది రెట్లు సంపాదించాలనుకోవడం
సమంజసం కాదు. గొప్ప వాడ్ని కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకరికంటే గొప్పగా ఉండాలనుకుంటేనే ప్రస్తుతం నీలో ఉన్న గొప్పతనం తగ్గిపోతుంది.
పోటీ మనస్తత్వంతో కూడిన ఎదుగుదలలో, కక్షా కార్పణ్యాలు అంతర్లీనంగా ఉంటాయి. పోలిక కారణంగా పొందిన గొప్పదనంలో ఈర్ష్యా ద్వేషాలు గోప్యంగా ఉంటాయి. పందెం వాతావరణంలో పొందినదేదైనా, అది అహానికి ఆజ్యం పోస్తుంది. గర్వానికి కారణ భూతమవుతుంది.
కక్షా కార్పణ్యం, ఈర్ష్యా ద్వేషం, అహం గర్వంతో కూడిన ఎదుగుదల మనిషికి మానసిక సంతోషాన్ని ఇస్తుందేమో కానీ, ఆత్మ సంతృప్తిని, ఆత్మానందాన్ని ఇవ్వలేదు.
పోలికతో గొప్ప వాళ్లయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. బిల్ గేట్స్ ఎవరికన్నా గొప్ప వ్యాపారవేత్త కావాలని అనుకోలేదు. అమితాబ్ బచ్చన్ ఎవరికన్నా గొప్ప యాక్టర్ కావాలి అనుకోలేదు. పత్రీజీ, బుద్ధుడు కంటే గొప్ప ఆధ్యాత్మికవేత్తని అయిపోవాలని అనా పాన సతి ధ్యానాన్ని అందరికీ చెప్ప లేదు.
ఈ విశ్వంలో ఎవరూ ఇంకొకరికంటే గొప్ప వారు కాదు. గొప్ప దనం అనేది సామజిక పరంగా ఆలోచించినపుడే వర్తిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే అందరు ఆత్మ స్వరూ పులే. కాబట్టి అందరూ గొప్పవారే. ఎవరి ప్రత్యేకత వారిది.. ఒకరిలాగా ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. ఉండలేరు. ప్రతి వారి ఉనికికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి వారు, వాళ్లలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి, అహర్నిశలు
అందుకు శ్రమించి, ఎక్కిన ప్రతి మెట్టును ఆనందిస్తూ, పోలికతో కాకుండా ఓపికతో ఎదగగలిగితే, పోటీ లేని అభివృద్ధిని సాధించవచ్చు. అనుకున్న గమ్యాన్ని చేరవచ్చు. ఆత్మ సంతృప్తిని, ఆత్మానందాన్ని అనుభవంలోకి తేవచ్చు.
నీలో ప్రత్యేకతను నీవు తెలుసుకోవడానికి ఉపయోగ పడే సాధన ‘ధ్యానం’.
ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment