శిష్య ప్రశ్న-గురు సమాధానం
నేను ఈ మధ్య నా ఆధ్యాత్మిక గురువైన, స్వామీ బోధానంద సరస్వతిని,ఒక ప్రశ్న వేశాను .
“మీరు జీవితాన్ని మొత్తం ఆధ్యాత్మికతకు అంకితం చేసి, కొన్ని వేల మందికి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసాదాన్ని అందించారు కదా?. అందులో ఎంత మంది ఆధ్యాత్మిక లక్ష్యమయిన ఆత్మ సాక్షాత్కారం పొందారు?” అని.
అప్పుడు స్వామీజీ ఇచ్చిన సమాధానం నా ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గం సుగమం చేసింది. గురువు చెప్పిన సమాధానాన్ని, వారు చెప్పింది చెప్పినట్లుగా ఇక్కడ వివరించాను.
“సూర్యుడు పుట్టినప్పటి నుంచి మండుతూ ఉన్నాడు. ప్రపంచంలోని ప్రతివ్యక్తికి వెలుగును ప్రసాదిస్తూ ఉన్నాడు. సూర్యుడు మండే సమయాన్ని తగ్గించి, ఆ సమయాన్ని, నా వెలుగుని ఎంత మంది ఉపయోగించు కుంటున్నారో చూచే పనికి ఉపయోగిస్తే సూర్యుని పని, లాభ నష్టాల లెక్కలు వేయడానికే సరిపోతుంది. లెక్క తక్కువైతే దుఃఖం. లెక్క ఎక్కువైతే సంతోషం. ఈ సుఖ దుక్కాల అడకత్తెరలో సూర్యుడు పోక చెక్కగా మారుతాడు. పోక చెక్కగా మారిన సూర్యుడు ముందులాగా వెలగలేడు. ప్రపంచానికి ఇదివరకటి లాగా వెలుగు ఇవ్వ లేడు. సూర్యునిలో వెలుగు తగ్గి పోతుంది. సూర్యునిలో అహం పెరిగి పోతుంది. వెలిగే సహజమయిన సూర్య గుణం సహజత్వాన్ని కోల్పోతుంది
అదే విధంగా నా లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం. పది మందికి బోధించడం వలన నాకు ఆత్మతత్వం బాగా అర్ధమవుతుంది. బోధించింది పాటించే ప్రయత్నం చేయడం వలన నాలో కాయ (శరీర) శుద్ధి జరుగుతుంది. చెప్పింది చేస్తూ నిరంతరం అదే ఆలోచించడం వలన మనో శుద్ధి సాధ్యమవుతుంది. నాలో మనో వాక్కాయ కర్మలు ఏకమైనపుడు ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. నేను దేని కోసం సన్యాసం తీసికున్నానో ఆ కార్యం నెరవేరుతుంది.
ఆలా కాకుండా నేను చెప్పేది ఎంత మంది శ్రద్దగా వింటున్నారా, ఎంతమంది వాటిని పాటిస్తున్నారా, ఎంతమంది ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నారా అని ఆలోచించడం మొదలు పెడితే నా సాధన ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడ’ అనే సామెతను నిజం చేస్తుంది.
కాబట్టి గురువుగా బోధించడం, బోధించింది ఆచరించడం, ఆచరణలో అందరిని ప్రేమిస్తూ, సామాన్య జీవితం గడుపుతూ అసమాన్యంగా ఆలోచిస్తూ ఆత్మ సాక్షాత్కర లక్ష్యాన్ని చేరుకోవడం నా కర్తవ్యం.
నా మార్గాన్ని నీవు ఆచరిస్తావని, నీకు ప్రస్థాన త్రయాన్ని బోధించాను. భగవద్గీత తత్వాన్ని నీలో అంతర్లీనం చేయడానికి, నీతో భగవద్గీతను తెలుగులో వ్రాయించి పది మందికి బోధింప చేశాను. నీలో ఉన్న ఆధ్యాత్మిక తృష్ణను గమనించి, షష్ఠి పూర్తి సమయంలో వానప్రస్థాన్ని ప్రసాదించి, బోధించింది ఆచరించమని సూచిస్తూ ‘ఆచార్య’ అనే అదనపు బాధ్యతను నీకు అప్పగించాను.
నీ పేరు వ్రాసుకున్న ప్రతి సారి ‘ఆచార్య’ అనే పదాన్ని తప్పక వ్రాయమని సలహా ఇచ్చాను. అందుకు కారణo, ‘ఆచార్య’ అనే పదం, నీ బాధ్యతను నీకు నిత్యం గుర్తుచేయాలి అని. నిన్ను తల వెంట్రుకలను త్యాగం చేయమన్నాను. అందుకు కారణం, అద్దం ముందు నిన్ను నీవు చూసుకున్నపుడల్లా వెంట్రుకలు లేని నీ తల నీ ముందు ఉన్న ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నీకు గుర్తు చేసి, దగ్గర చేయాలి అని.
సూర్యుడు, విశ్వానికి వెలుగు అందించినట్లు, నీలో జ్ఞానాన్ని వెలిగించి నిన్ను ప్రపంచానికి అందించాను. అంతటితో నీ గురువుగా నా బాధ్యత నెరవేర్చాను. నీవు నా మార్గాన్ని అనుసరిస్తే సంతోష పడతాను అనుసరించక పోయినా బాధ పడను.“.
ఇదీ నా ప్రశ్నకు నా గురువు ఇచ్చిన సమాధానం.
నా గురువు సమాధానం నా బాధ్యతను మళ్ళీ
గుర్తు చేసింది. అయిదేళ్ల క్రితం ఇండియా వెళ్లి ఆధ్యాత్మిక ప్రచారం చెయ్యమని ఇచ్చిన సలహా ఇన్నాళ్లకు సాధ్య పడింది. ఈ అయిదేళ్లలో పత్రీజీ ప్రభోధిత ఆనా పాన ధ్యానం నా ఆధ్యాత్మిక ప్రయాణానికి సహాయ పడింది. పూర్తి రిటైర్మెంట్ తీసుకుని నా గురువు అడుగు జాడల్లో నడవడానికి మనసు సిద్ధ పడింది. ‘ఆచార్య’ గా ఎక్కువ కాలం గడపడానికి నేడే ఇండియా చేరాను.
ఆచార్య డా అనిల్ ప్రసాద్
11/6/26
No comments:
Post a Comment