ఇక్కడ మీరు చూస్తున్న ఈ రచ్చబండ, దానిపై ఉన్న ఈ గుర్తు సాధారణమైనవి కావు. స్వయంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఇక్కడే కూర్చుని, ఊరంతా ఆశ్చర్యంతో చూస్తుండగా పోలేరమ్మ తల్లిని పిలిచి "నిప్పు తీసుకురా" అని ఆజ్ఞాపించగా, ఆ తల్లి నిప్పు తీసుకొచ్చి స్వామివారి దివ్య మహిమను లోకానికి చాటిన పరమ పవిత్రమైన చారిత్రక ప్రదేశం ఇది. ఆనాటి ఆ అద్భుత సంఘటనను ఒక దివ్య జ్ఞాపకంగా తలచుకుంటూ మనం ఎంతో భక్తితో మురిసిపోతుంటాం.
కానీ నాటి చరిత్రకు, నేటి పరిస్థితులకు ఎంత తేడా వచ్చిందో గమనిస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆనాడు బ్రహ్మంగారు కేవలం నిప్పు తెమ్మని చెబితే ఆ తల్లి తీసుకొచ్చి భక్తిని చాటింది. కానీ నేడు భక్తుల ముసుగులో, మఠం అండతో కొందరు వ్యక్తులు ఏకంగా పోలేరమ్మ గుడిలోకి చొరబడి భక్తులు కానుకగా వేసిన హుండీ సొమ్మునే బహిరంగంగా కాజేస్తున్నారు. సాక్ష్యాలతో సహా వీడియోల్లో అడ్డంగా దొరికిపోయినా, ఏమాత్రం భయం లేకుండా యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. నాటి చరిత్రలో స్వామివారి మహిమ వెలిగితే, నేడు ఆ తల్లి సొమ్మునే పచ్చిగా దోచేస్తున్నా వారిని ప్రశ్నించలేని ఒక విచిత్రమైన, దౌర్భాగ్యపు పరిస్థితి నడుస్తోంది. అసలు ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన కేవలం నాలుగు నెలలకే పక్కా ప్రణాళికతో మొదటి దొంగతనం జరిగింది. ఆ రోజు రాత్రే అక్కడ ఉండే ఫిట్ పర్సన్ హైదరాబాద్ వెళ్లడం, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గుడి తాళాలను తన దగ్గరే పెట్టుకుని, మరికొందరితో కలిసి మద్యం తాగి ఎంజాయ్ చేయడం, అదే రాత్రి హుండీని పగలగొట్టి భక్తులు సమర్పించిన బంగారు, ధనాన్ని దోచేయడం చకచకా జరిగిపోయాయి. ఈ దారుణం వెనుక ఎవరున్నారనేది ఊళ్లో ప్రతి ఒక్కరికీ తెలిసిన పచ్చి నిజం. కానీ ఇంత జరిగినా పోలీసుల వద్ద కనీసం కేసే నమోదు కాకపోవడం, ఏ ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం చూస్తుంటే వ్యవస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయో అర్థమవుతుంది. మనం గండికోట రహస్యం గురించి ఎన్నో కథలు వింటూ ఉంటాం కానీ, అంతకంటే చీకటి రహస్యాలు ఈ బ్రహ్మంగారి మఠం చాటున దాగున్నాయి. మహిమలు వెలిసిన చోట ఇంతటి మాయలు, దోపిడీలు జరుగుతుంటే ఇంకా ఎంతకాలం చూస్తూ మౌనంగా ఉండిపోవాలి? భక్తి చాటున జరుగుతున్న ఈ అక్రమాలను ప్రశ్నించే బాధ్యత మనపై లేదా?
No comments:
Post a Comment