జీతమా? జీవితమా?
ఒకప్పుడు మనిషి విలువను అతడి వ్యక్తిత్వంతో కొలిచేవారు, ఇప్పుడు ప్యాకేజీతో కొలుస్తున్నారు. జీవిత భాగస్వామి ఎంపిక సమయంలో వినిపించాల్సిన 'మంచి అబ్బాయి', 'మంచి అమ్మాయి' అనే మాటల్ని 'మంచి ప్యాకేజీ' అనే మాట ఆక్రమిస్తోంది. ఇది మనం జీవితాన్ని అర్థం చేసుకునే దృక్పథంలో వచ్చిన మార్పు. జీవిత భాగస్వామి ఎంపిక అనేది వ్యక్తిత్వాలు, విలువలు, అభిరుచుల ఆధారంగా జరగాల్సిన ప్రక్రియ. కానీ ప్రస్తుతం అది ప్యాకేజీలు, స్థిరాస్తుల ఆధారంగా జరిగే వ్యవహారంగా మారిపోతోంది. ఆర్థిక స్థిరత్వం అవసరమే. కానీ అదే వ్యక్తి విలువను నిర్ణయించే ప్రమాణంగా మారిపోతే, మనం అపసవ్య దిశలో ప్రయాణిస్తున్నట్టే.
వివాహం రెండు బ్యాంకు ఖాతాల కలయిక కాదు, రెండు హృదయాల కూడిక. జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలబడే ఇద్దరు వ్యక్తుల సంయుక్త ప్రయాణం. జీతం మనకు సౌకర్యాలను అందించగలదు, కానీ జీవితానికి ఆర్ధాన్ని ఇవ్వలేదు. డబ్బు ఇంటిని నిర్మించగలదు, కానీ కుటుంబాన్ని నిర్మించలేదు. అధిక ఆదాయం భౌతిక భద్రతను కల్పించగలదు, కానీ భావోద్వేగ భద్రతను కల్పించలేదు. సంపద విజయానికి గుర్తుగా నిలవగలదు, కానీ సంతృప్తికి ప్రమాణం కాలేదు. జీవన బంధమైన వివాహంలో జీతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యక్తి స్వభావం, సంస్కారం, బాధ్యత, కుటుంబ విలువలు, పరస్పర గౌరవం వంటి అంశాలు మరుగునపడిపోతున్నాయి. నేటి యువతలో చాలామంది తమ విద్యను, ఉద్యోగాన్ని, ప్రతిభను వ్యక్తిత్వ వికాసానికి సాధనాలుగా కాకుండా, అధిక జీతాన్ని సాధించే మార్గాలుగా మాత్రమే చూస్తున్నారు. విలువలను పక్కన పెట్టి కేవలం సంపాదన చుట్టూనే జీవితాన్ని నిర్మించుకోవడం ప్రమాదకరమైన ధోరణి.
అధిక జీతం పొందుతున్నవాళ్లంతా సంతోషంగా ఉంటారని చెప్పలేం. అలాగే సాధారణ ఆదాయం ఉన్న వ్యక్తి అసంతృప్తితో జీవిస్తున్నాడనీ చెప్పలేం. సంతోషాన్ని నిర్ణయించేది సంపాదన కాదు, సంతృప్తి, ప్రేమ, పరస్పర అవగాహన, గౌరవం, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే మనస్తత్వం వంటి అంశాలే వైవాహిక జీవితాన్ని ఆనందంగా నిలబెడతాయి. వివాహానంతరం ఉద్యోగంలో మార్పులు రావచ్చు, ఆర్థిక పరిస్థితులు మారొచ్చు, ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటి సమయంలో జీవిత భాగస్వామి వ్యక్తిత్వమే జీవితాన్ని నిలబెడుతుంది. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు జీతాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మంచి నడవడిక బాధ్యత, సంస్కారం, కుటుంబ విలువలు ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకునేలా తల్లిదండ్రులు పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి.
భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం అనేవీ జీవితాంతం నిలిచే నిజమైన సంపదలు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యనీ జీతం పరిష్కరించలేకపోవచ్చు. కానీ దంపతుల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసం ఎన్నో సమస్యలను అధిగమించే శక్తినిస్తాయి. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచే మనసుంటే, సమస్య చిన్నదవుతుంది, ప్రయాణం తేలికవుతుంది. నేటి యువత వివాహబంధాన్ని జీతంతో కాకుండా జీవితంతో ముడిపెట్టి చూడటం నేర్చుకోవాలి.
No comments:
Post a Comment