భృగు మహర్శి,దుర్వాస మహర్శి,గాంధారి వంటి కొందరు దేవతలకే శాపాలు పెట్టి నరు గదా ? వారికి ఆ శక్తి ఎక్కడిది ? ఎవరయినా ఎవరికయినా శాపాలు పెట్టవచ్చా ?
తపోధనులైన వారి వాక్కు ఫలిస్తుంది.
దానికి ఎదుటివారి దోషం( ధర్మవిరుద్ధ ప్రవర్తన) కారణం ఔతుంది.
ఐతే మహనీయులు ఆ శాపవాక్కులకు వశపడరు..
ఉదాహరణకు—
గణపతి ముని రమణ మహర్షితో మీ జాతకం ప్రకారం మీకిపుడు ఇక్కడి నుంచి బయలుదేరి పోవడం జరగాలి— అంటాడు. ఈ ముని అవితథవాక్కు. పెద్ద జ్యోతిష్కుడు గూడా. దానికి మహర్షి *నాకది పట్టదులేండి * అంటాడు. ఆయన అరుణాచలం దాటి ఎక్కడికీ ఎపుడూ పోలేదు.
భృగు మహర్షి విష్ణువును శపించాడు.
రాక్షసులకు ఆశ్రయమిచ్చి వాళ్లను వధించడానికి విష్ణువు వచ్చినపుడు అడ్డుపడింది భృగుపత్ని. వధించక తప్పలేదు. భార్య ఎడబాటు సహించలేక నీవూ భార్యావియోగబాధ అనుభవిస్తావు అని శపిస్తాడు భృగు మహర్షి.
విష్ణువు ఈ శాపం తనకు తగలకుండా చేసుకోగలడు —అని తెలిసి "నా మాట సత్యం అయ్యేటు చెయ్యి" —అని విష్ణువును ఉద్దేశించే మళ్ళీ తపస్సు చేసి, ' సరే' అనిపించుకొన్నాడు.
తన వాక్కు సత్యం కానివాడు సత్యలోకం ( బ్రహ్మలోకం ) చేరలేడు.. అని.
( శ్రీ రాముడు దశరథుని వాక్కు —(కైకకు ఇచ్చిన వరం ) కొడుకుగా తండ్రికి మారుగా నెరవేర్చాడు. దశరథుడే ఆ పని చేసినట్టయింది. [ఆత్మా వై పుత్ర నామాసి ])
లౌకిక ప్రక్రియనే (ధర్మశాస్త్ర విహిత పద్ధతినే) భగవంతుడైనా అనుసరిస్తూనే లోకం నడుపుతాడు.
శాపం అందరికీ తగలదు. గాంధారి పుత్రశోకంతో ఆగ్రహించి శపించినపుడు కృష్ణుడు ఒక మందహాసం చేసి
" అత్తా ! నీ కొడుకులను అదుపులో పెట్టుకోవడం చేతగాక ఇతరులపై నింద వేస్తావా? మా వంశానికి ఎపుడో ఋషిశాపం ఉండనే ఉంది. అనవసరంగా నోరు పారేసుకున్నావే. నీ తపస్సు వ్యర్థం చేసుకొన్నావు" అంటాడు.
అవతార ప్రయోజనం అయిపోయి అంతర్ధానం కావలసిన సమయం వచ్చింది గాబట్టి ఆ శాపాలకు విరుగుడు చేసుకొనే ప్రయత్నమే చేసుకోలేదు.
శ్రీ రాముడూ దుర్వాస మహర్షి రాకను లక్ష్మణుడి బంధం చివరి రోజుల్లో తప్పించుకోడానికి కారణం చేశాడు. అవతార ప్రయోజనం అయిపోయింది గాబట్టి.
దైవకార్యం పన్నాగం ప్రకారం జరగడానికి ఈ శాపాలూ , వరాలూ మూలకారణాలు అనిపిస్తుంది గానీ అంతకంటే అతీతమైనది అంతర్లీనంగా ఉంటుంది.
భవిష్యత్తుకు పునాది అయ్యే వచనాలు వారి ప్రమేయం పంతం లేకుండానే ఏర్పడుతూ ఉంటాయి.
వారి నోట భవిష్యద్వాక్కు భగవంతుడు వెలువరించి అది కారణమేమో అనిపిస్తాడు .
శ్రీ రాముడు అవతరించడానికి ఎంతోకాలం ముందే అహల్యకు గౌతమ మహర్షి శాపం— అపుడే రామపాదరజస్సంగ ప్రస్తావన వచ్చింది.
శ్రీ నాథుడు ఈ తత్వం నిరూపించే ఒక కల్పన(?) చేశాడు. దుర్వాస మహర్షి తుంబురుణ్ణి కేవలం ఒక చిన్న కారణం నెపంతో— పో భూమిలో పుట్టు— అని శపిస్తాడు
దుర్వాసుడు నేల మీద తన ఆశ్రమంలో లేడి పిల్లలకు అరచేతిలో పోసుకొని నివ్వరి తినిపిస్తున్నాడు. భార్యతో గగనవిహారం చేస్తూ ఒక చిటిక వేశాడు తుంబురుడు . లేడి భయపడి ఎగిరి పరుగులు తీసింది. మహర్షికి కోపం వచ్చింది నా పని జరగనీకుండా చేశాడు అని.
అతడు పాదాక్రాంతుడైనాడు.
అయ్యో. ఇంతమాట అనేశానా? ఐనా నా మాట జరగవలసిందే (*న మే వచనం అన్యథా భవితుమర్హతి* అంటాడీయనే శాకుంతలంలో).
కంచిలో పుట్టి త్వరలోనే విముక్తి పొందుతావులే.. దిగులుపడకు అని ఓదార్చి పంపుతాడు .
చిరుతొండనంబిగా పుట్టాడు తుంబురుడు.
అంటే — ఆయన ప్రమేయం లేకుండానే చిరుతొండనంబి జన్మకు కారణంగా ఋషి నోట మాట వెలువడింది.
వాక్కు వాళ్ల ప్రమేయం అంతగా లేకుండానే భవిష్యత్తుకు అనువుగా వెలువడుతుంది .
భగవంతుడు ఆ సన్నివేశం అలా కల్పించి ఆ సంఘటన జరిపిస్తాడు.
అన్నమయ్య స్వామిని " ఎందుకయ్యా దుష్టులనుగా సృష్టించడం— వాళ్లను నిర్మూలించడానికి నీవు మళ్ళీ పనిపెట్టుకోవడం? —అని అడుగుతాడు .
ఇది నీకొక ఆట. అందుకే ఇలా రెండు పక్షాలుగా చేసి రెండు వైపుల ఆటా నీవే ఆడుకొంటూ వినోదిస్తున్నావులే —అని కారణం ఊహించుకొంటాడు.
అప్పటిదాకా రాముడంటే అంత వాత్సల్యమున్న కైకమ్మ మంధర మాట వినగానే ఒక్క క్షణంలో ఎందుకు మారిపోయింది? ఆమెకు ఆ సమయంలో ఆ బుద్ధి ఆ మొండితనం ఏర్పడబట్టే రావణవధ అనే ప్రయోజనం నెరవేరింది.
సాంబుడికి ఆడవేషం వేసి ఋషులను అవమానించడం, వాళ్ళు శపించడం ..కృష్ణుడూ ఆ శాపం స్వీకరించడమూ ఇదంతా అవతారపరిసమాప్తికి ఒక దారి చేసుకోవడమే. అందుకే ప్రతిగా ఎవరూ ఆ ఋషులను క్షమాపణ కోరుకోకపోవడమూ, పాలకులూ ఏ శాంతులూ చేయ తలపెట్టకపోవడమున్నూ.
శ్రావణుని మరణం చూచిన ఆ తండ్రి మాట *నా లాగే పుత్రశోకంతో పోతావు*— అనేది దశరథుడికి అప్పుడు మోదం కలిగించేది అయింది..
ఆయన భవిష్యత్తు తెలిసే అన్నాడు అని చెప్పలేము. కానీ మాట— తపోబలం కూడిన మాట తప్పక జరిగి తీరుతుంది అని దశరథుడు విశ్వసించాడు.
అందుకే ఈ రోజుకూ అంటూ ఉంటారు— వాళ్లను ఏమీ అనవద్దు . పోనీ. కోపంతో ఏదో ఒక మాట అంటే మళ్ళీ మనమే పడవలసివస్తుంది.. అని.
దేవతలు అవతరించడానికీ, అంతర్ధానం కావడానికీ ఋషుల వాక్కులు నిమిత్తమాత్ర కారణం ఔతూ ఉంటాయి.
తపస్సున్న వాక్కు దుష్టశిక్షణకు పర్యవసిస్తూ ఉంటుంది.
No comments:
Post a Comment