Monday, July 6, 2026

భయ్యా! కర్ణాటక వాళ్ళేమో 'కాంతార', తమిళనాడు వాళ్ళేమో 'కరుప్పసామి' అని సినిమాల మీద సినిమాలు తీసేస్తున్నారు. మరి మనకి అలాంటి దేవతలు లేరా? మనకి అలాంటి కథలు లేవా? అంటే.. అయ్యో, లేకేం! బోలెడు ఉన్నాయి. మన ఆంధ్ర, తెలంగాణలో ఇలాంటి చాలా మంది దేవతలను మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు. ఇవాళ వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. రీల్ చివరి వరకు చూడండి. ఇందులో గ్రామ పొలిమేర దేవతల విశేషాలతో పాటు, వాళ్ళందరి పేర్లు వరుసలిస్తూ వచ్చే పాట ఏ సినిమాలో ఉందో రీల్ లాస్ట్‌లో చెప్పబోతున్నాను.

ఇంతకీ ఆ దేవతలు ఎవరంటే.. పోతురాజు, అలాగే అతని అక్కాచెల్లెళ్ళుగా చెప్పుకునే ఆదిపరాశక్తి అంశలు. మరి వాళ్ళందరి ప్రస్తావన మన వేదాలు, పురాణ ఇతిహాసాల్లో ఉంటాయా అండీ అంటే.. అన్నీ ఉండకపోవచ్చు. ఎందుకంటే, మనసులో తలుచుకునే పెద్ద పెద్ద కోరికల కోసం దేవతలకు మనం శాస్త్రాల ప్రకారం గుళ్ళు కట్టి పూజలు చేస్తాం. కానీ అంతకన్నా ముందే, మనిషిగా బ్రతకడానికి తిండి, బట్ట, ఆరోగ్యం, ధైర్యాన్ని ఇచ్చి కాపాడడానికి గ్రామ పొలిమేర దేవతలను మన పెద్దవాళ్ళు అనాదిగా పూజించడం మొదలుపెట్టారు.

గ్రామదేవతలు గ్రామం లోపల అవసరాలు, బాగోగులను చూసుకుంటే.. పొలిమేర దేవతలు గ్రామంలోకి వ్యాధులు, దుష్టశక్తులు రాకుండా కాపలా కాసేవారన్నమాట. ఈ దేవతల ఉదాహరణల్లో.. పోలేరమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, అంకాళమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, మహంకాళి, మైసమ్మ.. ఇలా మొత్తం చెప్పాలంటే నూటొక్క మంది అక్కాచెల్లెళ్ళుగా ఉంటూ మన తెలుగు రాష్ట్రాలను కాపాడుతూ ఉంటారని ప్రతీతి. అలాగే మహిషాసురుడి లాంటి రాక్షసులపై యుద్ధంలో అమ్మవార్లకు తోడుగా, సైన్యాధ్యక్షుడిగా నిలబడి సహాయపడ్డాడు మన పోతురాజు లేదా పోతప్ప అని కూడా చెప్తారు.

అసలు ఆ దేవతల తమ్ముడిని కాపలాగా భావించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటండీ అంటే.. జానపద సాంప్రదాయం ప్రకారం అక్కాచెల్లెళ్ళను కాపాడుకునే అన్నదమ్ముడిగా, అనుబంధానికి ఒక చిహ్నంగా నిలిచే పోతురాజు మన పెద్దలు మనకిచ్చిన వరం. అందుకే ఈ గ్రామ మరియు పొలిమేర దేవతల గుళ్ళల్లో కూడా ఈయనకొక ప్రత్యేక స్థానం ఉంటుంది. జాతర సమయంలో దుష్టశక్తులను పారద్రోలేందుకు ఈ పోతురాజు వేషం కడతారు. ఒక చేత్తో కొరడా, మరో చేత్తో నిప్పులు, కత్తి, గొడ్డలి లాంటివి పట్టుకుని, జుట్టు విరబోసుకుని, ఒళ్ళంతా పసుపు రాసుకుని, పెద్ద పెద్ద కళ్ళతో, వేపాకులు కట్టుకుని వీరంగం ఆడుతూ ఉంటారన్నమాట.

అయితే వీరికి సమర్పించే నైవేద్యాలు ఎందుకు మిగిలిన దేవతలతో పోలిస్తే వేరుగా ఉంటాయండీ అంటే.. ఇందాక మనం అనుకున్నదే, ఈ దేవతల మూలం మన జానపదం నుంచి అనాదిగా వస్తుంది కనుక, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు తమ కష్టాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అది చీర కావచ్చు, కల్లు కావచ్చు, కోడి, మేక లేదా వారు పండించిన ధాన్యాలు కావచ్చు. ఇందులో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క స్థానిక కథ ఉంటుంది.

80s, 90s లో ఈ దేవతల మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. 'పుష్ప' సినిమాలో కూడా తాతేకొండ గంగమ్మ తల్లి జాతర ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు రాబోతున్న 'ఎల్లమ్మ' అనే సినిమా కూడా ఒకరకంగా ఈ నేపథ్యం ఉండబోతుంది అనేది మనకి టీజర్ ద్వారా తెలుస్తుంది. అలాగే 2001లో వచ్చిన 'శ్రీ రాజా రాజేశ్వరి' అనే డబ్బింగ్ సినిమాలో ఎవరు రాశారో తెలియదు కానీ, "మది వెలిగే ఓం శక్తి" అనే పాటలో మొత్తం అమ్మవార్ల అందరి పేర్లు చెప్తూ ఒక అద్భుతమైన పాట ఉంటుంది వినండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనల్ని కాపాడే వారు చాలామంది ఉన్నారు. 


🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏

No comments:

Post a Comment