Wednesday, September 18, 2024

 *సండే స్టోరీ* 

‘గండం’ దశగుణం భవేత్
                                    
పదో తరగతి పిల్లలకి పరీక్షిత్తు కథ చెప్తున్నాడు నలభై ఏళ్ళ నాగరాజారావు. ఆ క్లాసులో పదిమంది ఆడపిల్లలు, ఇరవై మంది మగపిల్లలు ఉన్నారు. 

బదిలీ మీద నెల రోజుల క్రితం ఆ స్కూలు కి వచ్చిన అతడు, ఆ స్కూలు, అక్కడి వాతావరణం చూసి తెగ చికాకుపడి పోయాడు. “ఊరి వెలుపల పాడు కోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారు మూల” అన్నట్లుగా ఊరి నుంచి దూరం గా విసిరేసినట్లుగా ఉందా పాఠశాల. గడ్దితో కప్పబడిన పాకలోనే క్లాసులు, ఆ క్లాసుల్ని విడదీస్తూ మధ్యలో మట్టి గోడలు. ‘ఈ స్కూలేంటి? ఈ వాతావరణ మేంటి?’ అనుకున్నాడు. అయితే చుట్టు పక్కల నాలుగైదు పల్లెటూళ్లకు అదొక్కటే ప్రభుత్వోన్నత పాఠశాల. 

గవర్నమెంట్ ఉద్యోగం రాక ముందు అతడు ఒక ఐదేళ్ళు ఒక కార్పొరేట్ స్కూల్లో పని చేశాడు. అక్కడి రిచ్‌నెస్ చూసి, ఇక్కడికొస్తే ‘రాజుగారిని చూసిన కళ్ళతో...’ అన్నట్లనిపించింది. అతనికింకా ఆ కార్పొరేట్ మత్తు దిగలేదు. అందుకే విషయాన్ని మంత్రిగా ఉన్న తన మేన మామతో మొరపెట్టుకోవటంతో నెల రోజుల్లోనే పట్నానికి బదిలీ ఆర్డర్ కూడా వచ్చేసింది.                                                                        

అంతకు ముందు ఆ స్కూలుకి వచ్చిన రెండో రోజే హెడ్ మాస్టర్ అతన్ని పిలిచి “మాస్టారూ! ఈ రోజు పదో తరగతి తెలుగు మాస్టర్ సెలవు పెట్టారు. ఈ ఒక్క రోజుకి పదో తరగతి పిల్లలకి మీరు క్లాసు తీసుకోవాలి. ఏదో ఒక కథ చెప్పి వాళ్ళు గొడవ చెయ్యకుండా చూడండి” అని చెప్పటంతో, సరేనంటూ లేచాడు.
 
పదవ తరగతి గదిలోకి అడుగుపెట్టేసరికి అక్కడంతా గందరగోళంగా ఉంది. ఇతన్ని చూసి అందరూ సైలెంట్ అయిపోయారు. 

అటెండెన్స్ తీసుకుంటుండగా “లోపలికి రావచ్చా మాస్టారూ” అన్న కమ్మని కంఠం విని తలెత్తి చూశాడు. 

తలుపు దగ్గర ఒక మెరుపు తీగ లాంటి అమ్మాయి కనిపించేసరికి అతడి కళ్ళు పాము కళ్లలా విప్పారాయి. 

నాగస్వరానికి ముగ్ధురాలైన నాగుపాము లా అతడు తలూపటంతో ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. అతడి చూపులు పాములాగా జరజరా ఆమెనే అనుసరించాయి. 

ఆ అమ్మాయిని చూసిన అతడి మనసు గతి తప్పింది. కొద్దిసేపటికి ఆ అమ్మాయి పేరు ప్రణవి అని తెలిసింది. వాకబు చేస్తే ఆమె తల్లిదండ్రులు కూలి నాలి చేసుకు బ్రతికే బడుగు జీవులని తేలింది. కాలేజీ రోజుల్లో ఉన్న విచ్చలవిడి తత్వం అతన్నింకా వీడలేదు. అందుకే అతడి మనసు ఆ అమ్మాయి చుట్టూ తిరగ సాగింది.
 
ఎలాగో క్లాసు పూర్తయిందనిపించి బయటపడ్డాడు. ఆ రోజు రాత్రంతా ఆ అమ్మాయే అతని కలలో కదలాడింది. 
అతడి మనసు పదో తరగతి చుట్టూ పరిభ్రమించసాగింది. 

ఇక అప్పట్నుంచి ఏ సబ్జెక్ట్ టీచర్ రాక పోయినా హెడ్ మాస్టర్ని అడిగి మరీ పదో తరగతి క్లాసులో పాఠాలు చెప్పటానికి వెళ్ళసాగాడు. అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక మిష మీద ప్రణవి భుజాల మీద చేతులు వేసి, తడుముతూ పలకరించ సాగాడు. అతని మనసులోని ఆలోచన లు గ్రహించలేని ఆ పల్లెటూరి అమ్మాయి ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. 
                                                 
ఆ రోజు అతనికి ఆ స్కూల్లో చివరి రోజు.  కోరి మరీ పదో తరగతికి వచ్చాడు. పరీక్షిత్తు కథ చెప్తున్నాడు. 

“పరీక్షిత్తు మహారాజు ఒంటి స్తంభం మేడ లో చుట్టూ పురోహితుల్ని కూర్చోబెట్టుకు ని మహాభారత పఠనం చేయిస్తున్నాడు. మునికుమారుని శాపం తప్పించుకోవటం అసాధ్యమని తెలిసినా, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తనని తక్షకుడు ఏ విధంగా చంపబోతున్నాడో ఆయనకు అంతుపట్ట కుండా ఉంది. కళ్ళు తెరచినా మూసినా పాములే కన్పించసాగాయి. ఏ చిన్న అలికిడి అయినా పాము జరజరా పాకిన శబ్దంలాగే అనిపించసాగింది. నిముషాలు భారంగా గడుస్తున్నాయి. అదిగో అంతలో ఏమైందంటే....” అని అతడు చెపుతుండ గా ‘థప్’ మంటూ పెద్ద శబ్దం వచ్చింది.  

అందరూ తల తిప్పి ఆ చప్పుడు వచ్చిన వైపు చూశారు. చూసినవాళ్ళు చూసినట్లే శిలాప్రతిమల్లా కదలకుండా అలాగే ఉండి పోయారు. వాళ్ళ వెన్నులోంచి జరజరా వణుకు మెదడు దాకా పాకి, నోట మాట పడిపోయినట్లుగా అయిపోయారు. మొదట అతడా శబ్దాన్ని పట్టించుకోక పోయినా అందరూ అటే చూడటంతో తనూ అటు చూశాడు. అక్కడ అప్పటి దాకా తాను వర్ణించిన తక్షకుడే వచ్చాడా అన్నట్లుగా క్లాస్‌రూం తలుపు దగ్గర నల్లగా నిగనిగలాడుతున్న ఆరడుగుల కృష్ణ సర్పం తోక మీద లేచి పడగ విప్పి ఆడుతోంది.  

అతడు ముందు తేరుకుని “ఎవరూ గొడవ చెయ్యకండి. అలా చేస్తే అది మరీ రెచ్చిపోతుంది. అందరూ బెంచీల పైకి కాళ్ళు పెట్టి కూర్చోండి” అన్నాడు.
 
పిల్లలందరూ అతడు చెప్పినట్లే చేశారు. తర్వాత అతడు ‘ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటపడాలి’ అనుకుంటూ, టేబుల్ అంచుల్ని రెండు చేతుల్తో పట్టుకుని లేవబోయాడు. 

అప్పుడు జరిగింది అనుకోని మరో సంఘటన... 

అప్పటి దాకా చూరులో వ్రేలాడుతున్న ఇంకొక మహా సర్ప రాజం పట్టు తప్పి దబ్బున వచ్చి అతని ముందున్న టేబుల్‌ పైన పడింది. ఎంత వేగంగానైతే పడిందో అంతకన్న వేగంగా చివాలున పడగవిప్పి నిలిచిందది. దాంతో అతడు కుర్చీకి అంటుకుపోయాడు. అతడి చేతులు టేబుల్ అంచుల మీద అలాగే స్థిరంగా ఉండిపోయాయి. సరిగ్గా అతని ముఖాని కి మూరెడు దూరంలో ఉందా సర్పం. మృత్యువులా తన ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న ఆ పాముని చూసి అతడి వెన్నుపాము భయంతో జలదరించింది. అది అతడిని కాటువేయటానికి ఉత్సాహపడుతున్నట్లుగా పడగను అటూ ఇటూ ఊపసాగింది. 

పులి మీద పుట్రలా జరిగిన ఈ సంఘటన తో పిల్లలు బేంబేలెత్తిపోయారు. క్లాసులో అమ్మాయి లంతా తన్నుకొస్తున్న ఏడుపు ను బలవంతాన ఆపుకుంటున్నారు. అయినా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. మగ పిల్లల్లో కొందరు ధైర్యం చేసి ఏమైనా చేద్దామనుకున్నా, ఆ అలికిడికి మాస్టారు గారి ఎదురుగా ఉన్న పాము ఆయన్ని కాటేస్తుందేమోనని భయపడి కదలకుండా ఉండిపోయారు. ఎవ్వరూ బయటికి పోవటానికి వీలులేకుండా కాపలా కాస్తున్నట్లుగా తలుపు దగ్గర అడ్డంగా కనబడుతోంది మొదటిగా వచ్చిన కాలనాగు. 

నాగరాజారావు పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. ఎదురుగా గోధుమవర్ణంలో ధగ ధగా మెరిసిపోతున్న సర్పం పడగలో పరిసరాలు ప్రతిబింబిస్తున్నాయి. ‘అది తన ముందు పడటం ఒక్క క్షణం ఆలస్యమయ్యుంటే తాను ఆ కుర్చీలోంచి లేచి అవతలికి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఇప్పుడీ కుర్చీలోంచి తాను బందీ అయిపోయాడు. తను ఏమాత్రం కదిలినా అది నిర్దాక్షిణ్యంగా కాటువేసేట్లుంది. కానీ తను ఎంతసేపు ఇలా కదలకుండా కుర్చీ లో కూర్చోగలడు? ఈ ఒక్క రోజు గడిస్తే తనకీ ఇక ఈ స్కూల్‌ నుంచి విముక్తి అనుకున్నాడు... కానీ ఈ రోజే తనకీ లోకం లోంచి విముక్తి అయ్యేట్లుంది. ఏమిటీ వింత పరీక్ష తనకి?

అతడి నోటితో బాటు మెదడు కూడా ఎండిపోసాగింది. శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బైటకి రాసాగింది. వెన్ను భాగమంతా ఎప్పుడో తడిసి ముద్దై పోయింది. టేబుల్‌ మీద పెట్టిన చేతులు ఆన్చిన చోటంతా చెమ్మగా తయారైంది. కళ్ళార్పటానికి కూడా భయపడిపోయాడు. దాంతో కళ్ళవెంబడి ధారాపాతంగా నీళ్ళు కారసాగాయి. గొంతు మరీ ఎండిపోయి నాలుక పిడచ కట్టుకుపోసాగింది. 

కొద్దిగా కుడిపక్కకి తిరిగితే ఒక కూజా. దాని పైన ఒక గ్లాసు ఉన్నాయి. బయటికి పోతే కావాల్సినన్ని నీళ్ళు. కానీ ‘వాటర్ వాటర్ ఎవ్రీ వేర్... నాటే డ్రాప్ టు డ్రింక్’ అన్నట్లుందతని పరిస్థితి.

తలలోంచి బయల్దేరిన స్వేదబిందువొకటి నెమ్మదిగా నుదురుమీదుగా కిందికి దిగసాగింది. ఆ పైన అది తిరిగి రెండు కనుబొమల మధ్యగుండా తన ప్రయాణా న్ని కొనసాగించింది. అప్రయత్నంగా ఆ బిందువును తుడవటానికి అతడి కుడి చెయ్యి కదలబోయింది. ఆ కొద్దిపాటి ప్రకంపనలనే చురుగ్గా పసిగట్టిన ఆ సర్పం చటుక్కున పడగ తిప్పి ఆ చేయి వైపు చూసింది.

అతడి గుండెలు దడదడలాడాయి. ఏ మాత్రం చెయ్యి పైకి లేచినా ఈ పాటికి తాను గిలగిలా తన్నుకుంటూఉండేవాడు. ముక్కు పై భాగానికి చేరిందా బిందువు. అది అతడికి స్పష్టంగా భూగోళంలా కనిపించసాగింది. అది కులాసాగా, తీరికగా ముక్కు మీది గుండా కిందికి దిగసాగింది. దాన్ని చేత్తో తీసేయాలన్న కండూతిని అతడు బలవంతాన ఆపుకున్నాడు. అక్కడ కొంచెంసేపు వ్రేలాడిందా బిందువు. అది జారి పడిపోతే బాగుండునన్న అతడి ఆశ తీరలేదు. 

చావుకన్నా, చావు కబళించబోతుందన్న భయం ఎంత దుర్భరమైందో అతనికిప్పు డు అర్ధమవసాగింది. ఎదురుగా ఉన్న ఆ పాము తనని వెక్కిరిస్తున్నట్లుగా మాటి మాటికి తన నాలుకని బయటికి తెచ్చి ఆడించసాగింది. అది పాముకి చెలగాటం అతడికి ప్రాణసంకటంగా పరిణమించింది.

అతనికికి అప్పటిదాకా తాను చెప్పిన కథ స్ఫురణకి వచ్చింది. ‘పాముకాటు తప్పదని తెలిసీ, ఒంటి స్థంభం మేడ కట్టుకున్న పరీక్షిత్తుకూ, పాము కాటును తప్పించుకోలేక దాని ఎదురుగా ఆ ఒంటి స్థంభంలా బిగుసుకుపోయిన తనకూ పెద్ద తేడా కనిపించలేదు. తన ప్రాణం పోతుందని తెలిసి భారతం చెప్పించుకు న్నాడు పరీక్షిత్తు. తాను ఇప్పుడు భారతం చెపుతుండగా తనని ఇలా మృత్యువు కబళించబోతోందా? తనకి రక్షణ ఎవరు? ఎప్పుడూ తన గురించి తాను ఆలోచించుకోవటమేగానీ, పక్కవాడికి సాయం చెయ్యటమే తానెరగడు’.   

 “ఠప్’ మంటూ ముక్కున వ్రేలాడుతున్న స్వేదబిందువు జారి పడటంతో ‘హమ్మయ్య’ అనుకున్నాడు. గొంతు పూర్తిగా ఎండిపోయింది. ఇంకో పది నిమిషాలిలా ఉంటే దాహంతో తన ప్రాణం పోవటం ఖాయం. క్లాసు టైం అయిపోవటానికింకా పావుగంట కావాలి. అంటే పదిహేను నిమిషాలు... తొమ్మిది వందల సెకన్లు...

 పామునే చూస్తున్నాడతడు. అతడి కళ్ళు కదిలినప్పుడల్లా అది విచిత్రంగా అతడి వైపు చూస్తుంది. అది అలా చూడగానే అతడు స్తంభించిపోతాడు. దాంతో అది మళ్ళీ యధాలాపంగా మారిపోతుంది. 

అతడి రిస్ట్ వాచ్‌లోని సెకన్ల ముల్లు కదులుతున్న శబ్దం అతడి చెవుల్లో చెవిలో జోరీగలా వినిపించసాగింది. పాము పడగ పక్క నుంచి అతడు బిక్క చచ్చిపోయిన పిల్లల మీదికి తన దృష్టిని సారించాడు. మొదటిసారిగా అతడి హృదయంలో జాలి కలిగింది. వాళ్ళే కాదు ఆ స్థానంలో ఎవరున్నా ఏమీ చేయలేని పరిస్థితి. 

ఆ స్కూలు పాక వేసి ఎన్నో ఏళ్ళు దాటింది. తిరిగి కప్పు వేయించటానికి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఊరి పెద్దలు ఎప్పుడో కైంకర్యం చేసేశారు. ఇన్‌స్పెక్షన్ జరిగినప్పుడల్లా అధికారుల చేతులు తడిపి పబ్బం గడుపుకోవటం ఆ ఊరి పెద్దలకు అలవాటైపోయింది. పైకప్పు అక్కడక్కడా లేచిపోయి పెద్ద పెద్ద కన్నాలేర్పడ్డాయి. వర్షం పడితే సెలవు. ఎండాకాలం క్లాసురూముల్లోకన్నా బయట చెట్లకిందే ఎక్కువగా క్లాసులు నడుస్తుంటాయి. 

ఇలాంటి స్కూళ్ళు ఎన్నున్నాయో దేశంలో. అపాయాలకు ఆలవాలమైన ఇలాంటి స్కూళ్ళలో ఎంతమంది దిన దినగండంగా రోజులు వెళ్ళబుచ్చుతు న్నారో తెలీదు. 

ఆలోచనల్లో ఉన్న అతడి ముఖంలో అనుకోకుండా ఒక మార్పు కన్పించింది. ఊపిరితిత్తుల్లోంచి వస్తున్న గాలి శ్వాస నాళంలో మడత పడటంతో సంభవించిన మార్పు అది. దాంతో అతడు బిర్రబిగుసు కుపోయాడు. తన్నుకొస్తున్న ‘తుమ్ము’ ను అతి బలవంతంగా లోపల్లోపలే అణగ దొక్కసాగాడు. ఆపుకున్నకొద్దీ అది విజృంభించసాగింది. ‘దీన్ని ఆప..లే…క....పో.....తే......’  

“హాచ్‌చ్‌చ్‌చ్‌చ్చ్...” 

ఆ గది అదిరిపోయేలా పెద్ద.తుమ్ము తన్నుకొచ్చేసింది. అలా తుమ్మేటప్పుడు అతడి తల, కాటు వేయటానికి వెనక్కి వాలి ముందుకు వచ్చే పాములా ముందుకు విసురుగా వచ్చింది. 

అంతే... 

అంతకన్నా వేగంగా కదిలిన ఆ పాము అతడి నుదురు పైన ‘ఛక్’ మంటూ కాటు వేసింది. కుర్చీలోంచి అమాంతంగా వెనక్కి పడిపోయి గిలగిలా తన్నుకోసాగాడతడు. నోట్లోంచి తెల్లని నురుగు... అతని శవం చుట్టూ స్కూలు టీచర్లు, పిల్లలు......

“బుస్‌స్‌స్‌స్” మని శబ్దం వినిపించటంతో ఉలిక్కిపడ్డాడతడు. 

ఎదురుగా పాము... పాము ఎదురుగా తను... అంటే తనింకా తుమ్మలేదన్న మాట. తుమ్మి ఉంటే అన్న ఆలోచనతో ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పొడిచింది. 

అప్పటికి ఐదు నిమిషాలు గడిచింది. ఇంకా పది నిమిషాలు దాటితే బెల్ అవుతుంది. అప్పుడు ఇంకో టీచర్ క్లాస్‌లోకి వస్తాడు. తమ పరిస్థితిని చూస్తాడు. అప్పుడు బయటి నుంచి ఏదైనా సాయం అందే అవకాశం ఉంటుంది. అంతవరకూ తనకీ శిలా సదృశ స్థితి తప్పదు. 

ఇలా అనుకుంటుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది. తలుపు దగ్గరున్న కృష్ణ సర్పం నెమ్మదిగా కదిలి, అతడి టేబుల్ వైపు రాసాగింది. టేబుల్ కింద అతడి కాళ్ళు నేల మీద ఉన్నాయి. ఆ పాముని చూడగానే చటుక్కున కాళ్ళు పైకి లాక్కోవాలన్న ఆలోచనని కూడా బలవంతాన అణచిపెట్టుకున్నాడు. 

అతనికి మొదటిసారిగా తన తల్లి నిత్యం పూజించే పరమేశ్వరుడు గుర్తుకొచ్చాడు. “హా ఈశ్వరా! నీ మెడలో ఉండాల్సిన ఈ ఆభరణాలని ఇలా మా పైకి విసిరి మమ్మల్ని వేధించటం నీకు తగునా? ఇవి లేని నీ మెడ బోసిపోలేదా? వీటిని తీసికెళ్ళు స్వామీ” అనుకున్నాడు.

మెల్లిగా పాకుతూ వచ్చిన కృష్ణ సర్పం అతడి పాదాలను అలవోకగా స్పృశించింది. కొద్దిసేపు తన కాళ్ళలో స్పర్శ జ్ఞానం చచ్చిపోతే బాగుండునని అనిపించిందతనికి. 

దాదాపు అరగంటసేపు అలా కదలకుండా కూర్చోవటంతో అతడి వెన్ను నొప్పిపుట్ట సాగింది. చేతుల్లో చేవ చచ్చిపోయింది. నాలుక పిడుచకట్టుకుపోయింది. కళ్ళు బయటికి వెళ్ళుకొచ్చేస్తున్నాయి. ప్రేతకళ అతడి ముఖంలో తాండవించసాగింది. కుడిపాదం మీద ఎక్కిన ఆ పాము ఎడమ కాలు మీదుగా జారి మెల్లిగా మళ్ళీ తిరిగి తలుపు వైపుగా పోసాగింది. 

ఇంతలో ఏదో రిజిస్టర్ పట్టుకుని ఆ స్కూల్ అటెండర్ కూని రాగం తీస్తూ ఆ క్లాసులోకి ప్రవేశించబోయి తలుపు దగ్గరే ఆగిపోయాడు. 

ముందుగా అతనికి నాగరాజారావు ఎదురుగా ఉన్న గోదుమవన్నె సర్పం కనిపించింది. అంతలోనే తన వైపుగా వస్తున్న నల్ల త్రాచుని చూడగానే అతని నోట మాట రాలేదు. కెవ్వున అరిచినా ఆ శబ్దం పైకి కూడా రాలేదు. ఒక్క అంగలో అక్కడ్నుంచి బయట పడ్డాడతడు. అతని వెనకే నల్లత్రాచు తలుపు దాటి క్లాసు బయటకు వెళ్ళిపోయింది.

ఇంతలో బయట నుంచి ఏవో అరుపులు వినిపించసాగాయి. ‘అంటే కొద్దిసేపట్లో తనకు ఏదో సాయం అందబోతుందన్న మాట’ అనుకున్నాడు. విషయం తెలిసి స్కూలంతా గగ్గోలుగా అయింది. పిల్లలు అందరూ ఈ క్లాస్ రూంకి కొద్దిగా దూరం లో గుమిగూడసాగారు. 

ఆ కోలాహలానికి గోధుమ వన్నె సర్పం తపోభంగమైన మునిలా కదిలింది. దాంతో బయట నుంచి తనకు సహాయం అందకపోగా అపాయమే ఎక్కువగా జరుగుతుందేమోనని అతడు భయపడి పోయాడు. ఈ సమస్య నుంచి బయట పడే మార్గం ఏ మాత్రం కనుచూపుమేరలో కనిపించలేదు.

అప్పుడు లేచిందా అమ్మాయి... పదో తరగతి చదువుతున్న ప్రణవి...  

మెల్లిగా లేచి నాగరాజారావు వైపు నడిచింది.  టేబుల్ మీద ఉన్న పామునే చూస్తూ, చేతిని లయగా ఆడిస్తూ నాగరాజారావు ముందున్న టేబుల్‌కు పక్కకి వచ్చి నిలబడింది. ఆ అమ్మాయి చూపులు ఆ పాము మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. పాము కూడా తల తిప్పి ఆ అమ్మాయిని చూసింది. అప్పుడు నాగ రాజారావు తన కుర్చీలోంచి లేచే ధైర్యం చెయ్యబోయాడు. టేబుల్‌ పై నున్న అతడి చేతులు రెండూ బిగుసుకోవటంతో కలిగిన కొద్ది మార్పుకే ఎదురుగా ఉన్న పాము ఒకసారి అతని వైపు తిరిగింది. 

ఇంతలో అక్కడి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, బెంచి మీద ఉన్న పిల్లల్లో ఒక అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఉన్నట్లుండి ‘దబ్బు’మంటూ శబ్దం రావటంతో టేబుల్ పైనున్న సర్పం ‘స్‌స్‌స్‌’ మంటూ అటు తిరిగింది ఒక్క క్షణం సేపు.

అంతే... ఆ ఒక్క లిప్త కాలాన్నీ చక్కగా సద్వినియోగం చేసుకుంది ప్రణవి. గబుక్కున తన కుడి చేతితో ఆ పాము మెడ పట్టేసుకుంది. అదే సమయంలో ఎడమ చేత్తో నాగరాజారావు కూర్చున్న కుర్చీని గట్టిగా వెనక్కు నెట్టేసింది. 

దాంతో అతడు కుర్చీతో సహా వెనక్కి విరుచుకు పడిపోయాడు.
 
పామునలాగే పట్టుకున్న ప్రణవి, వెంటనే ఒక్క ఉదుటున క్లాసు బైటికి పరిగెత్తింది.
                                                 
అతనికి స్పృహ వచ్చి మెల్లిగా కదిలాడు. 

“మీరేం భయపడకండి మాస్టారూ పాములు వెళ్లిపోయాయి” అన్న మాటలు వినబడటంతో కళ్ళు తెరిచి చూశాడు. 

తన తలను తన ఒళ్ళో పెట్టుకుని విసనకర్రతో విసురుతున్న ప్రణవి కనిపించింది. అతడా అమ్మాయి వైపు బేలగా చూశాడు. ఆ ఆమ్మాయి చిరునవ్వు నవ్వింది.  

ఆ నవ్వు చూస్తే అతడికి తన చిన్నతనం లో అమ్మవారు పోసినప్పుడు, తన తలను ఒళ్ళో పెట్టుకుని, విసనకర్రతో విసురుతూ, తన కళ్ళలోకే చూస్తూ నవ్విన తన తల్లి గుర్తుకొచ్చింది. 

ఆరోజు నుండి నాగరాజారావు ఆడవారి పట్ల తన ప్రవర్తనని పూర్తిగా సన్మార్గంలో 
పెట్టుకున్నాడు.

(వార్త ఆదివారం అనుబంధం 16.10.2022 సంచికలో ప్రచురితమైన కథ)
                                         *సమాప్తం*

No comments:

Post a Comment