వేమన పద్యం- చమత్కార చాతుర్యం-3
--------------------------------------------
అందరికీ నమస్కారం అండీ!
నాకున్న పరిమిత అవగాహనతో వేమన పద్యంపై ఉన్న ప్రీతితో కొన్ని పద్యాలపై నా వ్యక్తిగత స్పందనను తెలియజేయదలిచాను.
దీనికి గాను మీ నుండి లభించిన ఆదరణకు కృతజ్ఞుడను. ప్రస్తుతాంశం వేమన పద్యంలోని చమత్కార చాతుర్యం గురించి.....
--------------------------------------------
వేమన పద్యాలు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందినవి.ఆయన పద్యాలలోని చమత్కార చాతుర్యం, తేలికైన భాష, సామాజిక అంశాల ప్రస్తావన ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి.వేమన తన పద్యాల్లో ఛాందస భావాలకు అడ్డుకట్ట వేస్తూ,సామాజిక దురాచారాలను,మూర్ఖత్వాన్ని ఎండగట్టడంలో చమత్కారాన్ని, హాస్యాన్ని, నిశిత విమర్శను జతచేసి ప్రబోధించాడు.విషయాన్ని ఎంత సాధారణంగా చెప్పినప్పటికీ అందులో లోతైన తాత్వికతతో కూడిన ఎత్తుగడ,పఠితున్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకే వేమన పద్యం నానాటికీ వన్నె తగ్గని కాంచనంగా తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయింది.
ఈ క్రింది కొన్ని పద్యాలను....
-------------------------------------------
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచె ముండుటెల్ల కొదువ గాదు
కొండ యద్ద మందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ!
"మనకు అనుకూలించని చోట మనం గొప్పవారమని చెప్పుకోకూడదు.తగ్గి ఉండటం వల్ల మన గొప్పతనానికి వచ్చే లోటేమీ లేదు. ఎంత పెద్ద కొండయినా అద్దంలో చూస్తే చిన్నదిగానే కనిపిస్తుంది కదా" అని వేమన ఈ పద్యంలో ఎంతో సున్నితమైన చమత్కారంతో తెలియజేశాడు
--------------------------------------------
అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ
"తక్కువ విలువ గల కంచు వస్తువు మ్రోగునట్లు బంగారం మ్రోగదు కదా!
అలాగే నీచుడు ఎప్పుడూ మంచివానిలా మాట్లాడలేడని" ఈ పద్య అంతరార్థం
--------------------------------------------
ఆలి వంక వార లాత్మ బంధువు లైరి
తల్లి వంకవారు తగినపాటి
తండ్రి వంకవారు దాయాదు లైరయా
విశ్వదాభిరామ వినురవేమ!
కుటుంబ బంధాల పట్ల చూపించే వివక్షాపూరితమైన ఆప్యాయతలు ఎలా ఉంటాయనేది ఈ పద్యంలో ఎంత చమత్కారంగా వివరించబడిందో పరిశీలిస్తే...
"భార్య వైపు వారు ఆత్మీయులు అవుతారు,తల్లి వైపు వారు అంతంత మాత్రమే,తండ్రి వైపు వారు దాయాదులు (అంటే ఆస్తి కోసం పగబట్టేవారు)అవుతారు"
ఈ పరిస్థితిని చాలా కుటుంబాల్లో ప్రస్తుతం సహజంగా మనం చూస్తున్నదే గదా!
--------------------------------------------
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయ
విశ్వదాభిరామ వినురవేమ!
"చెప్పులో రాయి,చెవిలో జోరీగ
కంటిలో నలుసు, కాలికి ముల్లు, ఇంట్లో కలహాలు - ఇవి చిన్నవిగా కనిపించినా,ఆ క్షణంలో కలిగించే బాధ చెప్పడానికి అలివి కానివి"
అంటే మనుషుల రోజువారీ జీవితంలో, మేధావులైనా సామాన్యులైనా ఇలాంటి చిన్న చిన్న కష్టాలను అనుభవించక తప్పదని వేమన భవన
------------------------------------------
చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్క కుక్కయైనా బాధసేయు
బలిమిలేని వేళ పంతాలు చెల్లవు
విశ్వదాభిరామ వినురవేమ!
"ఎంతటి బలవంతుడైనా, సింహం లాంటి పరాక్రమవంతుడైనా సరే.. బలహీనపడినప్పుడు,అల్పుడు కూడా అతడిని ఇబ్బంది పెట్టగలదు. మనకు బలము లేని సమయంలో పంతాలకు, గర్వానికి పోకూడదు"
అంటే సందర్భానుకూలంగా మనం ఇతరుల పట్ల వ్యవరించాలి అని..
--------------------------------------------
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిప్పి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమా!
మేడిపండు బయటకు చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాన్ని తెరిచి చూస్తే లోపల పురుగులు ఉంటాయి"
అలాగే, పిరికివాడు బయటకు గంభీరంగా ఉన్నట్టు నటించినా లోలోపల భయంతో కృంగిపోతూనే ఉంటాడు. దీనిని బట్టి మనిషి,ఏ పరిస్థితులైన తట్టుకోగలిగే మనోధైర్యంతో ఉండాలనే కదా అర్థం
--------------------------------------------
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ!
"మంచి మనసుతో చేసే పని ఎంత చిన్నదైనా,దాని ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది.అలానే చిన్న మర్రి విత్తనం ఎంత పెద్ద వృక్షంగా మారుతుందో గదా"
ఈ రోజుల్లో ఎదుటివారికి ఏమీ చేయకున్నా ఎంతో చేస్తామని, కొంచెం చేసినా చాలా చేశామని ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్నారు కొందరు. అలా కాకుండా చేసే మేలు చిన్నదైనా విస్పక్షపాతంగా,నిస్వార్ధంగా చేయాలనేది వేమన సూచన
--------------------------------------------
"ఇంటి యాలి విడిచి ఇల జార కాంతల
వెంట దిరుగు వాడు వెఱ్ఱివాడు
పంట చేను విడిచి పరిగ లేరినయట్లు
విశ్వ దాభిరామ వినురవేమ!
అంటే "తన స్వంత భార్యని వదిలిపెట్టి, ఇతర స్త్రీల వెంట తిరిగేవాడు మూర్ఖుడు.
అది ఎలా ఉంటుందంటే!
పండిన పంట పొలాన్ని వదిలేసి, కింద పడిన పరిగెలను (పంట మిగిలిన కంకులను) ఏరుకోవడంతో సమానం"
వేమన ఈ విషయాన్ని చమత్కాయుతంగా చెప్పినప్పటికీ
ఇందులో గొప్ప తత్విక ధోరణి కూడా ఉంది.
సొంతదానిని కాదని పరాయి దానికోసం పాకులాడేవారు, చేతిలో ఉన్న అదృష్టాన్ని వదిలేసి అనవసరమైన వాటి కోసం వెతుకులాడితే చాలా నష్టపోతారని, అంతేకాక వివాహ వ్యవస్థకు, కుటుంబ విలువలకు కట్టుబడి, అనవసర ఉద్వేగాలకు లోనుకాకుండా,క్రమశిక్షణయుతమైన జీవన వైఖరిని అలవాటు చేసుకోవాలని చాలా సునిచితంగా హెచ్చరించాడు.
-------------------------------------------
ఆడువారి గన్న నర్థంబు పొడగన్న
సారమైన రుచుల చవులు గన్న
నయ్యగాండ్ల కైన నాశలు పుట్టవా?
విశ్వదాభిరామ వినుర వేమ!
ఇంత చిన్న విడిది గల అటవెలదిలో,వేమన ఎంత భావస్ఫోరకమైన సందేశం ఇచ్చాడో చూడండి.
"స్త్రీలను చూసినప్పుడు, సంపద (డబ్బు) కంటికి కనిపించినప్పుడు, మరియు మంచి రుచికరమైన పదార్థాలు లభించినప్పుడు ఇంద్రియ నిగ్రహం లేని మనుషులతో పాటు,ఇహలోక సంబంధమైన సుఖాలను త్యజించిన సాధువుల మనస్సులో కూడా కోరికలు పుడతాయి"
అంటే లౌకికమైన ఆశలను జయించడం అంత సులభం కాదని, అలానే స్త్రీ ఏ విధంగానైనా పురుషుడ్ని ప్రభావితం చేయగలదని ఈ పద్యంలోని ఆంతర్యం.
--------------------------------------------
నక్క వినయములను నైగారములు పల్కి
కుడువకెల్లధనము కూడబెట్టు
కుక్కబోను వాత కూడు చల్లిన రీతి
విశ్వదాభిరామ వినుర వేమ!
కొంతమంది వడ్డీ వ్యాపారాలు కష్టజీవులకు అప్పుల రూపంలో డబ్బులిచ్చి, తగిన వ్యవధిలో వారు తిరిగి చెల్లించకుంటే, వారిని ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడుతూ, వారిపై దౌర్జన్యం చేస్తూ, రక్తాన్ని పిండుకు తిని పాపాన్ని మూటకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ పద్యాన్ని ఎంత అర్థవంతంగా చెప్పాడో వేమన...
"నక్క తన జిత్తులతో వినయాన్ని నటిస్తూ ఇతరులను మోసం చేసినట్లుగా, కొంతమంది లోభులైన వడ్డీ వ్యాపారులు తీయని మాటలు చెప్తూ ఇతరుల సొమ్మును కుదవబెట్టించుకుని ధనాన్ని పోగు చేస్తారు.అలా కూడబెట్టిన ధనం చివరికి వారికి దక్కదు.అది ఏ విధంగా అంటే, కుక్కను పట్టుకోవడానికి బోనులో ఆహారం చల్లినట్లుగా ఉంటుంది.అంటే ఆ ధనం చివరకు ఇతరుల పాలవుతుంది లేదా వారి నాశనానికే కారణమవుతుంది"
--------------------------------------------
అల్ప సుఖము లెల్ల నాశించి మనుజుండు
బహుళ దుఃఖములను బాధపడును
పర సుఖంబు నొంది బ్రతుకంగ నేరడు
విశ్వదాభిరామ వినురవేమ!!
"మనిషి క్షణికమైన, చిన్న చిన్న సుఖాల కోసం ఆశపడి, చివరికి అనేక రకాల పెద్ద దుఃఖాలలో చిక్కుకుని బాధపడుతుంటాడు. ఆత్మానందం లేదా శాశ్వతమైన పరమానందాన్ని పొంది ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతున్నాడు" అని ఈ పద్యం యొక్క అర్థం.
ఎంత గొప్పవారైనా చిన్న బలహీత లకు లొంగిపోయి, స్వయంకృతాపరాధం వల్ల అనేక కష్టాలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. తద్వారా అప్పటివరకు వారు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ పోగొట్టడమే కాకుండా ఆ ఊబిలో నుండి బయటపడలేరు.అది చాలా ప్రమాదకరమైన వైఖరి అని పై పద్యంలో వేమన సున్నితంగా హెచ్చరించాడు.
--------------------------------------------
ఎవ్వరి గుణములును యేమన'న్న మానవు
చక్క జేయరాదు కుక్క తోక
గడుసురాలు మగని గంప బెట్ట'మ్మురా
విశ్వదాభిరామ వినురవేమ!!
"ఒక వ్యక్తి యొక్క సహజ గుణాలను లేదా స్వభావాన్ని ఎవరూ మార్చలేరు. అది ఎలాగంటే,ఎంత ప్రయత్నించినా కుక్క తోకను ఎవరూ చక్కగా నిటారుగా చేయలేరు.గయ్యాళి భార్య తన భర్తను సైతం లెక్కచేయక, అతడిని అవమానపరిచేలా ప్రవర్తిస్తుంది"
సహజంగా ఇలాంటి స్వభావం గల వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాము. ఇలాంటి వైఖరి వల్ల కుటుంబాల్లో అనేక కలహాలు సంభవించడాన్ని కూడా వింటూనే ఉంటాము.
మరో మాటలో సంక్షిప్తంగా చెప్పాలంటే,కాలానుగుణంగానో,పరిస్థితులను బట్టో ఏ మనిషైనా తన వైఖరిని మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ కొందరు దీనికి మినహాయింపు. ఎప్పటికీ వారి నైజాన్ని మార్చుకోరు తద్వారా వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు.మరొకరిని అలా ఉండనివ్వరనే అర్థంలో చెప్పడం జరిగింది.
--------------------------
చివరిగా....
అసలు "వేమన ఏ పద్యంలోనైనా చమత్కారం లేనిది ఎక్కడ?"
వాటిలో కొన్నింటిని మీకు పరిచయం చేయాలనేదే ఈ ప్రయత్నం
ధన్యవాదములు
🙏🙏🙏🙏🙏🙏
-------------------------------------
మోకా మాధవరావు
(తెలుగు ఉపాధ్యాయుడు)
జానపద సాహిత్య పరిశోధక విద్యార్థి
No comments:
Post a Comment