శ్రీ రమణ మహర్షి బోధనలు:127
ప్ర: స్వామీ! భగవంతుడ్ని ప్రేమించటం మంచిదే కదా? అయితే, ప్రేమ మారాన్సే ఎందుకనుసరించరాదు?
జ: అట్లా అనుసరించకూడదని ఎవరన్నారు? కాని, నువ్వు ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అందులో ద్వయీ భావముంది కదా - ప్రేమించే వాడూ, ప్రేమింపబడే - భగవంతుడనబడేవాడూను. వ్యక్తి భగవంతుని నుండి వేరు కాదు. అంటే, ప్రేమంటే తనపట్ల (ఆత్మపట్ల) తనకే ప్రేమ అన్నమాట!
ప్ర: ప్రేమ మార్గం ద్వారా భగవంతుడిని ఆరాధించవచ్చా? ఆ కారణం చేతనే అడుగుతున్నాను.
నేననేది అదే, ప్రేమే భగవంతుని స్వరూపం. "నేను దీనిని ప్రేమించను, దానిని ప్రేమించను” అంటూ అన్నింటినీ తిరస్కరిస్తే, మిగిలేదల్లా స్వరూపమే - అదే ఆత్మ యొక్క నిజరూపం. అదే శుద్ధానందం. కావాలంటే ఆనందమనిగాని, ఈశ్వరుడని గాని, ఆత్మ అని గాని ఏమో అనవచ్చు. అదే భక్తి, అదే సాక్షాత్కారం, అదే సర్వమూను. అన్నింటినీ తిరస్కరిస్తే మిగిలేది ఆత్మే. అదే అసలైన ప్రేమ. ఆ ప్రేమ యొక్క రహస్యం తెలిసిన వానికి ప్రపంచమంతా ప్రేమమయంగా ఉన్నట్టు తెలుస్తుంది.
“చైతన్యపు ఎరుక” అనే అనుభవమే భక్తి యొక్క స్థితి - భక్తి అంటే వాడిపోని స్వచ్ఛమైన ప్రేమ - ఎందువల్లనంటే ఆత్మ జ్ఞానం ప్రేమ స్వరూపంగా పెల్లుబుకుతుంది. ఆత్మే పరిపూర్ణమైన శుద్ధానందంగా ప్రకాశమవుతుంది. ఆత్మ యొక్క నిజతత్త్వం ప్రేమ. ప్రేమ గురించి సత్యం తెలిసినప్పుడే జీవితమనే చిక్కుముడి విడుతుంది. ప్రేమ యొక్క శిఖరాన్ని అధిరోహిస్తే, విముక్తి లభిస్తుంది. అదే అన్ని మతాల సారాంశమూను. ఆత్మానుభూతే ప్రేమ అంటే దాని అర్థం, ప్రేమనే చూడటం, వినటం, అనుభవించటం, రుచి చూడటం, వాసన చూడటం. అదే పరమానందం. 🕉️❤️🕉️
No comments:
Post a Comment