Saturday, September 14, 2024

*****ఆనందానికి అర్థం చెప్పిన భిక్షగాడు* by శ్రీమతి సుధామూర్తి, చైర్మన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్

 *ఆనందానికి అర్థం చెప్పిన భిక్షగాడు*

శ్రీమతి సుధామూర్తి, చైర్మన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్

మనలో చాలామంది జీవితంలో ఎన్ని ఉన్నా, ఇంకా ఏదో వెలితిని వెతుక్కుంటూ విచారపడుతూనే ఉంటారు. ఆనందించాల్సిన ప్రతి క్షణాన్నీ, లేనిపోని ఆలోచనలతో నిరర్థకం చేసుకుంటూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే - నా మిత్రురాలు మీనా! ఆమెది పెద్ద ఉద్యోగం, మంచి జీతం. కానీ ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలా విచారంగా ఉంటుంది. ఆమెను కలిసినప్పుడల్లా ఆమె ఉదాసీనత, నిరాశ, నిర్వేదాలు మనకూ వ్యాపిస్తాయి. పైగా మీనా ఏ ఒక్కరి గురించీ నాలుగు మంచిమాటలు మాట్లాడదు. వ్యక్తులతో సత్సంబంధాలనే కాదు, చివరకు మంచి వాతావరణాన్ని కూడా ఆహ్లాదంగా అనుభూతి చెందలేదు. ప్రతి దానికీ మీనాలో అసహనం, అసంతృప్తి! ఆమెను పలకరించాలంటేనే మాకు ఓ రకమైన నిరాసక్తత. అలాంటి మీనాకు ఉద్యోగరీత్యా బెంగుళూరు నుంచి ముంబయికి బదిలీ అయింది. దాంతో చాలా ఏళ్ళుగా ఆమెను కలవడమే కుదరలేదు.

ఇటీవల ఏదో పని మీద నేను ముంబయి వెళ్ళాల్సి వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళగానే కుండపోత వర్షం! వెంట గొడుగు కూడా లేదు. వీధి పక్కన నిలబడ్డాను. హఠాత్తుగా అక్కడ మీనా కనిపించింది. వర్షంలో అయినా సరే, ముందక్కడి నుంచి పారిపోవాలనిపించింది. అయితే తప్పించుకునే వీలు లేకుండా పోయింది. మీనా అప్పటికే నన్ను చూసేసింది. గబగబా వచ్చి ఎంతో ఆప్యాయంగా, హుషారుగా నా చేయి పట్టుకుంది. పాత స్నేహాన్ని గుర్తుచేసింది. పాతమిత్రులం, జ్ఞాపకాలు అమూల్యం, అపురూపం అంటూ ఇంటికి రమ్మని బలవంతపెట్టింది. నమ్మలేకపోయాను! నిజంగా నిరంతరం ఉదాసీనంగా కనిపించే మీనాయేనా! అని నన్ను నేనే నమ్మలేకపోయాను.

ఆస్వాదించుకుంటూ, సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్కి తీసు కెళ్ళింది. తీరిగ్గా టీ తాగుతూ, నా మనస్సులోని సందేహాన్ని అడిగేశాను. 'మీనా! ఏంటి నీలో ఇంత మార్పు? నువ్వు ఆనాటి మీనావేనా? ఏంటి ఇంత మార్పు? నిన్ను మార్చిన ఆ మాంత్రికుడెవరు?' అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేశాను. 'మాంత్రికుడు లేడు, మహిమలు లేవు సుధా! ఒక భిక్షగాడు, నా బ్రతుకును మార్చేశాడు' అంటూ నవ్వింది. నేను తెల్లబోయి చూసేసరికి, "అవును యాచకుడే! అతనో ముసలతను. అయిదేళ్ళ మనవరాలితో మా ఇంటి ముందే ఉండేవాడు. నేను నిరంతరం నిరాశావాదినని నీకు తెలుసు కదా! ఎవర్నీ నమ్మేదాన్ని కాదు. అందుకే ఎప్పుడూ ఏ సహాయమూ చేయకపోయేదాన్ని, కానీ రోజూ మిగిలిపోయిన అన్నం ఉంటే ఇచ్చేదాన్ని. ఎప్పుడూ పలకరించలేదు.

అలా ఉండగా ఒకరోజు భోరున వర్షం. నా పడకగది కిటికీలో నుంచి చూస్తూ, వర్షం నా నెత్తిన పడకపోయినా దానిని అకారణంగా తిట్టుకోసాగాను. ఆ భిక్షగాడికి, మనవరాలికి రోజూ పెట్టే అన్నం కూడా పెట్టలేకపోయాను. వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటారనుకున్నాను. అయితే కిటికీలోంచి కనిపించిన దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. బిచ్చగాడు, అతని మనవరాలు ఎగిరెగిరి ఆడుకుంటున్నారు. వాళ్ళు తామేదో స్వర్గంలో ఉన్నామనుకుంటున్నట్లు తుళ్ళింతలతో గడుపు తున్నారు. ఆకలిని మరచిపోయి, ఆ వానని ఆస్వాదిస్తూ పరమా నందంలో మునిగిపోయారు. జీవితం పట్ల వారి అనురక్తిని చూసి నాకు ఈర్ష్య కలిగింది. ఆలోచింపచేసింది. నాకు అనేక సౌకర్యాలున్నాయి. వారికొక్కటీ లేదు. అయితే అన్నిటి కన్నా ముఖ్యమైనది నాకు లేనిది వారికుంది. ఏది ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవించడమెలాగో వారికి తెలుసు. నిజంగా సిగ్గుపడ్డాను.

నాకు ఉన్నవాటి, లేనివాటి జాబితా రాయడం ప్రారంభించాను. చాలామంది ఊహించను కూడా లేని సౌకర్యాలు నాకున్నాయని గ్రహించాను. ఆ యాచకుణ్ణి ఆదర్శంగా తీసుకొని జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చుకోవాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను” అంది మీనా ఆర్ద్రతతో!

చాలా సేపు నేను అలా సంభ్రమంతో కూర్చుండిపోయాను. మీనా జ్ఞానోదయానికి ఓ భిక్షగాడు కారణమయ్యాడని తెలిసి. ముచ్చటపడిపోయాను. ఆ అనుభవమయ్యాక రెండేళ్ళలో ఆమె పూర్తిగా మారిపోయిందట. ఇప్పుడు తను దేనికీ బాధపడడం లేదు. అసంతృప్తి అన్న మాటే లేదు. ప్రతి చిన్న విషయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి వ్యక్తిలో మీనా సంతోషాన్నే చూస్తోంది. 'మరి మీ గురువుకు ఏదైనా గురుదక్షిణ ఇచ్చావా?' అని అడిగాను, 'లేదు! దురదృష్టవశాత్తూ, నేను పూర్తిగా మారేసరికి అతను చనిపోయాడు. అయితే అతనిపై గౌరవసూచకంగా అతని మనవరాలిని బోర్డింగ్ స్కూలులో చేర్పించి చదివిస్తున్నా' అంది

మీనాలో ఇలాంటి ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదు. పైగా మీనా చెమ్మగిల్లిన కళ్ళతో!             

No comments:

Post a Comment