Sunday, January 25, 2026

 [1/24, 07:08] +91 73825 46949: అమృత ధార..

ఓ అనంత పథికుడా...
ఈ సృష్టి ఒక మహా గోవు
దాని పొదుగు నిండా అమృత తుల్యమైన పాలు.
కానీ, ఆ అమృతం నీ దోసిట్లోకి రావాలంటే
నీ హృదయం ఆవు దూడలాంటి నిష్కల్మషమైన ప్రేమతో నిండాలి.
ఓర్పుతో ఆ పొదుగును తాకినప్పుడే
ప్రకృతి తన నిధిని నీకు ధారపోస్తుంది.
అవివేకంతో, తొందరపాటుతో
ఆ పొదుగును కత్తితో ఛేదించాలనుకుంటే...
నీకు దక్కేది రక్తపు ధారలే కానీ, జీవధారలు కావు.
హింసతో దేనినీ సాధించలేవు
విధ్వంసంతో ఏ శిఖరాన్నీ అధిరోహించలేవు.
విజయం అనేది ఆకాశం నుండి రాలే ఒక అద్భుతం కాదు
అది నీ ఆత్మ చేసే నిరంతర తపస్సు.
ఏ అడ్డదారులూ నిన్ను సత్యం వైపు నడిపించవు
ఏ కుతంత్రాలూ నిన్ను వెలుగులోకి తీసుకెళ్లవు.
చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణానికి
మేఘాలను దాటుకుంటూ వచ్చే వర్షబిందువుకు
ఎన్ని కష్టాలు? ఎంతటి శ్రమ?
ఓ సాధకుడా...
శ్రమ నీ చేతులకు చేసే అలంకారం కావాలి
చెమట చుక్క నీ నుదుట ధరించే తిలకం కావాలి.
కష్టపడటమే ఒక ఆరాధన అయినప్పుడు
విజయం నీ పాదాల చెంత చేరే ఒక పుష్పం అవుతుంది.
గుర్తుంచుకో...
త్యాగం లేని ఫలితం నిలవదు
శ్రమ లేని విజయం వెలగదు.
ప్రేమతో పిండుకో... పాలు పొంగుతాయి
కసితో కోయకు... రక్తం ఏరులై పారుతుంది.
జీవన సత్యం శ్రమలోనే ఉంది!
Bureddy blooms.
[1/24, 07:34] +91 73825 46949: విద్యా సంస్కృతి..
ఒక జ్ఞాన దీపిక..

లోకంలో ఎందరో మనుషులు...
కానీ అక్షరం ముక్క రానివాడిని
చిన్న పిల్లాడు కూడా
చులకనగా చూసే కాలమిది!

చదువు అంటే...
కేవలం పుస్తకాల్లోని పాఠం కాదు
జీవితాన్ని వెలిగించే
ఒక అపురూపమైన నిధి!

వయసు ఉన్నప్పుడే...
విద్యార్థి తన అడుగులను కుదురుగా వేయాలి.

కాలం... వరద వచ్చిన నది లాంటిది
ఒక్కసారి చేజారితే
తీరని నష్టమే మిగులుతుంది!

పదునైన నేలలో...
విత్తనం పడగానే మొలకెత్తినట్లు
లేత బుర్రల్లోనే చదువుల విత్తనాలు
సులభంగా నాటుకుంటాయి.

వయసు ముదిరిన కొద్దీ
అక్షరం అబ్బడం మహా కష్టం!

తెల్లని కాగితం లాంటిది...
పసిపిల్లల నిష్కల్మషమైన మనసు!

అక్కడ నేర్పే విద్యాబుద్ధులు
చెరగని ముద్రలై వారిని
చిరకాలం వర్ధిల్లేలా చేస్తాయి.

విద్యార్జన అంటే...
అదొక పవిత్రమైన యజ్ఞం!
సుఖాలను కోరుకుంటే విద్య రాదు
కష్టాలకు వెరవక, అంకితభావంతో
ఆద్యంతం శ్రద్ధగా సాగించే పోరాటమది!

తల్లిదండ్రులారా...
పిల్లలు తెలియక లక్ష్యం తప్పవచ్చు
కానీ ఓర్పుతో వారిని సరైన బాటలో నడిపించాలి.

అంతే కానీ...
మీ ఇష్టాలను వారిపై రుద్దకండి!

వారి అభిరుచులను గుర్తించి ప్రోత్సహించడమే
అసలైన ధర్మం... అదే వారి భవిష్యత్తుకు మార్గం!

జ్ఞానానికి మరణం లేదు...
చదువుకున్న వాడికి ఓటమి లేదు!

Bureddy blooms.
[1/24, 08:53] +91 73825 46949: మనసు నిప్పు..
ఒక ఆత్మ శోధన....

చూడటానికి...
రోడ్లు విశాలంగా సాగిపోతుంటాయి
కానీ... అదే మనిషి మనసు దగ్గరకు వచ్చేసరికి
సంకుచితత్వపు గోడల మధ్య నలిగిపోతుంటుంది!

సెగలతో.. పగలతో..
నిత్యం రగిలిపోయే ఆ జ్వాలలకు ఇంధనం ఎక్కడిది?
బయట ప్రపంచం వెన్నెలలా చల్లగా ఉన్నా
ఉదయ కిరణంలా వెచ్చగా పలకరిస్తున్నా
లోపల హృదయం మాత్రం ఎందుకు ఉడుకుతూ ఉంటుంది?

అక్కడ చూడు...
వర్షపు బొట్టు స్వచ్ఛంగా మురిపిస్తుంది
శీతగాలి హాయిగా గిలిగింతలు పెడుతుంది!
కానీ... మనిషి నోటి నుండి వచ్చే మాట మాత్రం
మకరందం కాక విషమై ఎందుకు చిమ్ముతోంది?

ప్రకృతికి రాగద్వేషాలు లేవు..
అది తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తుంది!
కానీ మనిషి...

ఉద్వేగాల ఊపిరిలో, అహంకారపు పొగలో
తాను ఊపిరాడక.. ఎదుటివారికి ఊపిరి నివ్వక
ఎందుకు ఉక్కిరిబిక్కిరవుతున్నాడ?

అక్షరాలు నేర్చుకున్నాం..
కానీ సంస్కారాన్ని విస్మరించాం!
ప్రకృతి పాఠాలను చదువుతున్నాం..
కానీ మనసు పుటలను తిరగేయడం మర్చిపోయాం!

మనిషి మనిషిగా మిగిలేది..
తన లోపల రగిలే పగను ఆర్పినప్పుడే!
మాటను మౌనంతో.. మౌనాన్ని మకరందంతో
నింపిన రోజే.. మనిషి నిజమైన మనీషి అవుతాడు!

Bureddy blooms.

No comments:

Post a Comment