Saturday, January 17, 2026

 రిటైర్మెంట్ (కథ) 
కృష్ణమూర్తి నిన్ననే రిటైరయ్యాడు. మర్నాడు పొద్దున్నే లేచి హడావిడిగా మంచం దిగుతుంటే గుర్తొచ్చింది. 
‘అంత దూకుడెందుకు మూర్తీ? లేచి ఏం పీకుతావట’ మనసు వెక్కిరిస్తుంటే ‘నిజమే, ఏం చెయ్యాలి? అసలు ఇకపై ఏం చేసేది?’ అనుకున్నాడు. ఇన్నేళ్ళూ ఉద్యోగంతో బిజీ. ఇప్పుడు పూర్తి ఖాళీ. మళ్లీ పక్కమీదికి చేరి హాయిగా నిద్రపోయి ఎప్పటికో లేచాడు. ఇంట్లో భార్య కనిపించలేదు. పిల్లల గదుల్లోకి చూశాడు. ఎవరూ లేరు. 
“ఇంత పొద్దున్నే బలాదూర్లకు పోయారా?” కోపమొచ్చింది.     
కిచన్లోకెళ్ళి స్వయంగా కాఫీ కలుపుకున్నాడు. హాల్లో కొస్తుంటే గేట్లోంచి వార్తాపత్రిక దూసుకొచ్చి పడింది. పేపరు తెరిచి తీరుబడిగా వార్తలు చదవడం రిలీఫ్ అనిపించింది. అరగంట పోయాక స్విగ్గీలో టిఫిన్ తెప్పించుకు తిన్నాడు. ఇక తర్వాతేమిటనుకున్నాడు. దినమంతా తనదే. ఇష్టమొచ్చింది చెయ్యొచ్చు. కానీ ఏం చెయ్యాలి? 
భార్యతో కబుర్లు చెపుదామంటే ఇంట్లో లేదు. పెళ్ళాం తనతో కాస్త టైము స్పెండ్ చెయ్యనందుకు చిరాకేసింది. కానీ ఎన్నో యేళ్లుగా తనెప్పుడైనా ఆమెతో ఓ పావుగంట సరదాగా గడిపాడా అనేది గుర్తుచేసుకోలేదు. 
టీవీ రిమోట్ తీసుకొని ఓమారు అన్ని ఛానల్స్ చుట్టేసి విసుగుతో ఆపేశాడు. రాక్ లోంచి పుస్తకం తీసి చదివే ప్రయత్నం చేశాడు. అదీ చేయలేక కొద్దిసేపటికే పక్కన పెట్టేశాడు. ఒకప్పుడు పుస్తకాల పురుగు. బుక్ పట్టుకుంటే తిండి ధ్యాస కూడా ఉండేది కాదు. అంతేకాదు, అప్పట్లో కొంచెం పేరున్న రచయిత కూడా. భవిష్యత్తులో గొప్ప రైటర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఉద్యోగంలో చేరాక క్రమంగా రచనకు దూరమై చివరికి దాని విషయమే మర్చిపోయాడు.
కృష్ణమూర్తికి హఠాత్తుగా తను ఒంటరైనట్టు అనిపించింది. భార్యాపిల్లలు ఎక్కడి కెళ్లారో తెలియదు. నిన్న సాయంత్రం ఆఫీసులో జరిగిన ఫేర్వెల్ గుర్తుచేసుకున్నాడు. సర్వీసులో చివరిరోజు. సహోద్యోగులు గొప్పగా వీడ్కోలు చెప్పారు. తన సమర్థతనూ, నిబద్ధతనూ ప్రశంసించారు. రిటైర్మెంట్ లైఫ్ హాయిగా, ప్రశాంతంగా గడపాలని విష్ చేశారు. 
అతనికి ఇక ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. బయటికొచ్చి రోడ్డెక్కాడు. చిన్నగా నడుస్తూ సెంటరు దాకా వెళ్ళాడు. 
అదే జనం.. అదే రద్దీ. మార్పులేదు. రోడ్డుకు ఇరువైపులా సహపంక్తి భోజనం చేస్తున్నట్టు వరుసగా తెరచివున్న దుకాణాలు. ముందుకు వెళుతుంటే లైబ్రరీ కనిపించింది. కాలేజీ రోజుల్నుంచి పుస్తకాలతో తన అనుబంధం గుర్తొచ్చింది. 
ఎంత కాలమైంది వెళ్ళక..? లోపలికి నడిచాడు. రీడింగ్ రూంలో అందరి చేతుల్లో ఏదో పత్రిక. ఒకప్పుడు లైబ్రరీలో కూర్చుని గంటలు గంటలు చదువుతూ గడిపేవాడు. ఇప్పుడు పది నిమిషాలు కూడా ఉండలేక బయటపడ్డాడు.
కోణార్క్ థియేటర్ రోడ్డులోకి తిరిగినప్పుడు రెండేళ్ల క్రితం రిటైరైన మేనేజర్ కనిపించాడు.
“నమస్కారం సర్” తనే ముందు విష్ చేశాడు. 
ఆయన ఇటుచూసి “హల్లో కృష్ణమూర్తి.. ఎలా ఉన్నావు? రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నావా?” అన్నాడు.
తను రిటైరైన సంగతి అప్పుడే ఈయన దాకా వచ్చిందా అనుకొని “అవును సర్, హ్యాపీ. కానీ రోజంతా ఖాళీ. బోర్ కొడుతోంది.”
“మొదట్లో అలాగే అనిపిస్తుంది. అయినా ఇంకేం చేస్తావయ్యా.. ప్రశాంతంగా బతికేయ్”
“అవును సర్.. అలాగే” అన్నాడు ఏమనాలో తెలియక. బై చెప్పి ఆయన వెళ్ళిపోయాడు.
ఒక గమ్యం అంటూ లేకుండా తిరిగి కృష్ణమూర్తి అలసిపోయాడు. దగ్గరివాళ్ళెవరినైనా కలవాలనుకున్నాడు. కానీ అతనికి మంచి దోస్తులుగానీ చుట్టాలుగానీ లేరు. ఎప్పుడూ ఎవరితోనూ కలిసిమెలిసి లేడు. ప్రత్యేక అభిరుచులంటూ కూడా లేవు. దేనిమీదా పెద్దగా ఆసక్తి లేదు. ఉపయోగకరం కాదనుకున్నదేదీ తనకి నచ్చదు. ఎప్పుడో కాస్సేపు పుస్తక పఠనం తప్ప ఆటాపాటా, ఎంటర్టేన్మెంటు వంటి వాటికి దూరంగా ఉన్నాడు. 
కమ్యూనిటీ హాలు వరకెళ్లి కాలనీ పెద్దల్ని కలిశాడు. వాళ్లతన్ని చూసి కర్టెసీగా పలకరించారు తప్ప ఎవర్లోనూ పెద్దగా ఇంటిమసీ కనిపించలేదు. అందరూ రిటైరీలే. కాస్సేపటికే వాళ్ళ మాటలు, ఆలోచనాధోరణి, అభిప్రాయాలు రుచించలేదు. అర్థంపర్థం లేని ఆధ్యాత్మిక భావాలు, మూఢ విశ్వాసాలు, ఇతరుపై అసూయద్వేషాలు, సిల్లీ పాలిటిక్స్, కుళ్లిన జోకులు, అవసరం లేకున్నా ఎక్కడో సెటిలైన తమ సంతానం గురించి గొప్పలు పోవడం. 
అక్కణ్ణుంచి బయటపడి మధ్యాహ్నం రెండు తర్వాత ఇల్లు చేరుకున్నాడు. భార్య అప్పుడే బయటకెళ్లడానికి రెడీ అవుతోంది. తనని చూడగానే “ఈరోజు కుక్ రాలేదు. వంటచేసి టేబులు మీద సర్దిపెట్టాను, వడ్డించుకొని తినండి” అంది ముక్తసరిగా.
పొద్దున తను లేచేసరికే బయటికి పోయింది. ఇప్పుడు మళ్ళీ తయారైంది. ముఖం చిట్లిస్తూ “ఎక్కడికి బయల్దేరావు?” అన్నాడు.
“కొత్తేముంది.. రోజూ వెళ్ళేచోటికే” అంటూ చెప్పుల్లో కాళ్లు పెట్టింది.
ఆమె జవాబులో నిర్లక్ష్యం కనిపించి నొచ్చుకున్నాడు “నీకు తెలుసా, నేను నిన్నే రిటైరయ్యాను” 
తెలుసన్నట్టు తలూపి, అయితే ఏంటన్నట్టు చూసింది. మరే రియాక్షనూ లేదు.
ఆమె గుమ్మం దాటుతుంటే “అసలెక్కడికి పోతున్నావు? ఎందుకీ హడావిడి?” అన్నాడు. అయినా ఆగకుండా వెళ్ళిపోయింది.
అసలే తిక్కగా ఉన్న కృష్ణమూర్తి ఇగో బాగా హర్టయింది. 
‘ఇంట్లో ఏం జరుగుతోంది? ఎవరేం చేస్తున్నారు? ఎక్కడికెళుతున్నారు?’ అర్థంకాక గింజుకున్నాడు. ఆకలవుతుంటే వెళ్ళి వడ్డించుకొని తిన్నాడు. తర్వాత ఏం చెయ్యాలని మళ్ళీ మొదటి కొచ్చాడు. 
సాయంత్రం ఆరున్నరకు భార్య వస్తూనే వంటగదిలో దూరింది. పావుగంటలో వేడిగా కాఫీ ఇచ్చింది. ఒక నవ్వులేదు, మాటలేదు. మొక్కుబడిగా చేస్తున్నట్టు. అప్పటికే ఎన్నో గంటలుగా ముళ్లమీద కాలం గడిపిన అతనిక సహించలేక నిలదీశాడు. 
“పొద్దుగూకింది. నువ్వేమో బయట తిరిగి ఇప్పుడొచ్చావు. పిల్లలు ఏ బలాదూర్లు పోయారో ఉదయం నుంచి కనిపించలేదు. అసలేం చేస్తున్నారు మీరంతా?”
“ఎవరూ బలాదూర్లు పోలేదు. అంతా పనులమీదే వెళ్లారు. మీకు తెలియపోతే నేనేం చెయ్యను?”
“ఏమిటా పనులు? ఏం పొడిచేస్తున్నారు మీరంతా?”
“నేను బొటిక్ సెంటర్ నడుపుతున్నా. నేను వెళ్ళింది అక్కడికే. పిల్లలేమో వాళ్ళ ఆఫీసులకు పోయారు. ఇందులో కొత్తేముంది?”
“ఏనాడూ గడపదాటని నువ్వు బొటిక్ నడుపుతున్నావా? ఈ సంగతి నాకెప్పుడూ చెప్పలేదే?”
“చెప్పడానికి ఇంట్లో ఎప్పుడు సరిగా ఉన్నారు? మీకు వినే తిరికేది?”
“పిల్లలు ఆఫీసులకు వెళ్లడమేంటి? అసలు వాళ్ళేం చేస్తున్నారు?”
“అబ్బాయి సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాడు. అమ్మాయి ఉద్యోగం చేస్తుంది”
“ఈ విషయాలేవీ నాకు తెలియవే?” కోపగించాడు.
“తెలుసుకునేందుకైనా వినేందుకైనా మీకు తీరుబడి, పట్టింపు ఉండాలిగా”
భార్య మాటల్లో వెటకారానికి మండుకొచ్చింది.“సరే.. వాళ్ళెప్పుడొస్తారు ఇంటికి..?” అన్నాడు. 
“ఖచ్చితమైన టైమంటూ లేదు, ఎప్పుడైనా రావచ్చు”
“ఇదికూడా తెలియపోతే ఎట్లా? నీకసలు బుద్ధుందా? తల్లివి ఆమాత్రం బాధ్యత లేదూ?”
“ఇందులో బాధ్యతేముంది? అయినా బాధ్యత గురించి మీరేనా అడిగేది? ఈ ప్రశ్న మిమ్మల్ని వేసుకోండి”
కృష్ణమూర్తి బిత్తరపోయాడు. భార్య ధోరణి హద్దు మీరినట్టు భావించాడు. తను కసురుకున్నా, కోపంతో ఎన్ని మాటలన్నా మౌనంగా భరించే ఆమె ఇప్పుడిలా లాజిక్కులు మాట్లాడ్డం నచ్చలేదు.
“నామీదే వెటకారమా? నాకు బాధ్యత లేదా? లేకుండానే ఇన్నాళ్ళూ ఇల్లు నడిచిందా? భారమంతా నువ్వే మోసినట్టు చెప్తున్నావు” 
“నేనలా అనలేదు. తండ్రిగా ఇంతకాలం మీకు పిల్లల బాధ్యత కొంచెం కూడా తెలియదు. ఇప్పుడేందుకీ ఆరాలు?”
భార్య తనకు ఎదురుతిరిగినట్టు ఫీలయ్యాడు. ఆవేశంగా ఏదో అనబోయి ఆగి మరేం మాట్లాడక గదిలోకి వెళ్ళిపోయాడు.
                                      ***
రిటైర్మెంట్ తర్వాత ఏం చెయ్యాలో కృష్ణమూర్తి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. దీనిపై భార్యతో యేనాడూ చర్చించలేదు. ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వాలని, పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా గడపాలని ఊహాల్లోకి కూడా రాలేదు. ఎప్పుడూ తన పద్ధతిలో నడుచుకోవడమే తప్ప ఎవర్ని గురించి పట్టించుకోలేదు. తను గీసుకున్న వృత్తంలో గడిపేశాడు.
ఊరుకు వందల మైళ్ళ దూరంలో ఉద్యోగం. దాదాపు వారంలో ఆరురోజులు అక్కడే. వీకెండ్ ఇంటికి రావడం. అప్పుడప్పుడు అదీలేదు. మనసుకు తట్టకో, తీరికలేకనో ఫోన్ చేసి ఇంట్లోవాళ్ళతో ముచ్చటించాలన్న ధ్యాస కూడా ఉండేది కాదు. క్రమేపీ ఇల్లు చిన్న మజిలీ అవుతూ వచ్చింది. ఇంటి యాజమానిగా బాధ్యతల్ని వొదిలేశాడు. ఇల్లు ఎట్లా నడుస్తోంది చూడలేదు. బరువు భార్య మీదికి నెట్టేశాడు. అట్లా ఉద్యోగ జీవితమంతా తనను తాను వేరుచేసుకొని గడిపాడు.  
ఇంట్లోనే కాదు, బయటా అంతే. స్నేహితులు, చుట్టాలకు తనెప్పుడూ అందుబాటులో లేడు. రిలేషన్స్ నిలుపుకోలేక అందరికి దూరమయ్యాడు. ఉద్యోగ పర్వంలో విశ్రాంతిగాని, వినోదంగాని లేకుండా గడిపాడు. యువకుడినిగా కొలువు ప్రారంభించి రిటైర్మెంట్ వరకు సమయాన్ని సర్వీసుకే ధారపోశాడు. చేసింది పెద్ద ఉద్యోగమ. అయితే అతడేమీ అంతరిక్షంలో చెయ్యలేదు. ఎడాపెడా డబ్బు సంపాదించాడా అంటే  లేదు. అవకాశాలున్నా చేతకాలేదు. చాకిరి తప్ప చొరవలేకపొయింది. కెరీర్లో ఎగరాలనే తాపత్రయం. ఒక చట్రంలో ఉంటూ ఎంతచేసినా ఏఅద్భుతాలు జరగవని, గొడ్డుచాకిరితో గోల్స్ నెరవేరవని గ్రహించలేదు. 
పెళ్ళయిన తొలినాళ్లలో భార్య నిలదీసింది తనతో కొంచెం టైము కూడా గడపడం లేదని. కృష్ణమూర్తి పట్టించుకోలేదు. పైగా చిరాకుపడ్డాడు. “నాకేం వేరే పనిలేదా?” అన్నాడు. పిల్లలు పుట్టాక కూడా మార్పులేదు. భార్య క్రమంగా అతని పరిధిలోంచి బయటపడింది. భర్త దైనందిన జీవితంలోకి తొంగిచూడటం మానేసి ఇంటి సంరక్షణ తలకెత్తుకుంది. దృష్టి పిల్లల మీదికి మళ్లించింది. ఏ సమస్య వచ్చినా అన్నీ తానై చూసుకుంది. వాళ్ళ బాగోగులు, అవసరాలు, చదువులు, ఆరోగ్య సమస్యలు అన్నిటిని ఆమెనే పర్యవేక్షించింది. అండగా నిలబడింది. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్స్ మొదలు కాలేజీ ఫీజుల వరకూ అన్నీ ఆమెనే. అలాగని భర్తను నిర్లక్ష్యం చేయలేదు. ఇద్దరి నడుమ దగ్గరితనం లేనందున గొడవలూ రాలేదు. ఆమె తను కోరుకున్న విధంగా పిల్లల సంరక్షణ చేసింది. డబ్బుకు మరీ ఇబ్బంది ఉండేదికాదు. అవసరాలకు అడిగితే కొంత కృష్ణమూర్తి ఇచ్చేవాడు. ఫ్యాషన్ డిజైనింగులో తనకున్న ప్రావీణ్యంతో ఆమె సొంతంగా బొటిక్ ప్రారంభించింది. ఆమె పట్టుదల, కష్టం ఫలించి అది బాగా డెవలప్ అయింది. పిల్లలు చదువుకొని స్థిరపడ్డారు. చిత్రమేమిటంటే ఇంటి యజమాని అయిన కృష్ణమూర్తికి ఇవేవీ అవగాహనలో లేవు. తన డ్యూటీ, మీటింగులు, క్యాంపులు, కాన్ఫరెన్సులు, ఫోన్లలో బిజీ. తప్పనిసరైతే భార్యతో రెండు మాటలు. పిల్లలతో గడిపిన, దగ్గరికి తీసిన సందర్భాలు లేవు. 
కృష్ణమూర్తికి ఖాళీ సమయం యాతనకు గురిచేస్తోంది. ఏంచెయ్యాలో, దేంట్లో ఎంగేజ్ కావాలో తెలియట్లేదు. ఇంట్లో ఏ మార్పులేదు. ఆంటీముట్టనట్టు భార్య.. అపరిచితుల్లా పిల్లలు ఉంటున్నారు. అందరి మధ్యనే ఒంటరితనం, వెలితి, అసహనం పిచ్చిలేస్తుంది. 
రాత్రి ఎనిమిదిన్నరకి ఇల్లు చేరిన కుమార్తెను నిలబెట్టి కేకలేశాడు. “ఎందుకింత ఆలస్యం? ఇప్పుడు టైమెంతో తెలుసా?”
అద్భుతమేదో జరిగినట్టు ఆమె తండ్రిని ఎగాదిగా చూసి అంది. “అదేమిటి.. కొత్తగా అడుగుతున్నారు. నాకిది మామూలే” 
కూతురు జవాబులోనూ కృష్ణమూర్తికి నిర్లక్ష్యమే కనిపించింది. 
“ఆడపిల్లవి, ఇంత రాత్రిదాకా బయట తిరగటం మామూలేంటి? బుద్ధుండే మాట్లాడుతున్నావా?”
“నేనేం బయట తిరగడం లేదు, ఆఫీసు నుంచి వస్తున్నా”
“అసలిప్పటిదాకా ఏం చేస్తున్నావు?”
“మా కంపెనీ ఇక్కడికి చాలా దూరం. ట్రాఫికులో రెండు గంటలు పడుతుంది. ఐనా ఇవన్నీ మీకెందుకు? ఎప్పుడూ లేనిది కొత్తగా ఆరాలేమిటి? ఇంత కన్సర్న్ ఎందుకు?”
కూతురు ఎదురుచెప్పటం నచ్చలేదు. అంత పొగరేమిటని అనుకున్నాడు. 
“ఇంటికి పెద్దవాణ్ని, తండ్రిని, నాకుగాక ఇంకెవరికి ఉంటుంది కన్సర్న్?” అన్నాడు కోపంగా.
“ఇంతకాలానికి మీరింట్లో ఉండటం, పిల్లల గురించి పట్టించుకోవడం ఆశ్చర్యమే. అయినా మీరేం వర్రీ కాకండి. మా  బాగోగులు చూసేందుకు అమ్మ ఉంది”
ఆమె సమాధానం కృషమూర్తి మైండ్ బ్లాక్ చేసింది. కుతకుతలాడి పోతూ భార్యకు ఫిర్యాదు చేశాడు.
“ఏమండీ... ఏనాడూ ఇంట్లో ఏదీ పట్టించుకోని మీకిప్పుడెందుకు ఆరాటం? వాళ్ళేం చిన్నపిల్లలు కారుకదా”
తననే ఎత్తిపొడిచినట్టున్న ఆమె ధోరణి అవమానంగా, తనను అద్దం ముందు నిలబెట్టినట్టు అనిపించింది. 
“నీకసలు బుద్ధి ఉందా? పెళ్ళికాని ఆడపిల్ల ఇంతరాత్రి దాకా బయటుంటే మందలించక వెనకేసుకొస్తావా? అసలు దానికి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరమేంటి? పెళ్లిచేసుకొని అత్తవారింటికి పోయేది”
“ఎవరు చేస్తారండీ పెళ్లి? కూతుర్ని అత్తారింటికి పంపే బాధ్యత ఎవరిది? తండ్రిగా మీకీ విషయం గుర్తుందా? ఎప్పుడన్నా ఇంట్లో కుదురుగా ఉండి ఏదైనా పట్టించుకున్నారా? నెలకు ఇంత డబ్బు మా ముఖాన కొడితే సరిపోతుందా? పిల్లలేం చేస్తున్నారు? వాళ్ళ చదువులేమిటి? ఇల్లెట్లా నడుస్తోంది? పెళ్ళాం అనేది ఉందా? అసలు మనింట్లో ఏనాడైనా ఒక పండగో.. ఫంక్షనో జరుపుకున్నామా? మనకు సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయా? సరదాలు, సంతోషాలేవైనా తీర్చుకోవడం జరిగిందా? మన నలుగురం కలిసి కనీసం భోజనమైనా చేశామా? గుర్తుచేసుకొని చెప్పండి” 
ప్రవాహంలా ముంచెత్తిన భార్య ఎదురుదాడికి కృష్ణమూర్తి తలొంచుకున్నాడు, బడులుచెప్పలేదు. కొడుకు చేసే వ్యాపారంలో ఏదైనా  సాయం చేద్దామని చూశాడు. ఈ మాటే కొడుకుతో చెప్పాడు.
కానీ తండ్రిని నిర్మొహమాటంగా దూరం పెడుతూ “ఈ వయసులో మీకెందుకులెండి శ్రమ” అన్నాడు.
ఆ మాటలో తనపట్ల గౌరవం కంటే వెటకారం ఎక్కువ ధ్వనించింది. అయినా తమాయించుకొని తన నైపుణ్యం, అనుభవం  వ్యాపారంలో ఉపయోగపడతాయని కన్విన్స్ చేయబోయాడు.
“అవసరం లేదు.. నా వ్యాపారం నేను చూసుకోగలను. ఎవరి జోక్యమూ వొద్దు” కుండబద్ధలు కొట్టాడు.
“నేను నీతండ్రిని. పోనీ బిజినెస్ ఒక్కటే కాదు, నీ వ్యక్తిగత సమస్యలేవైనా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు”
“హఠాత్తుగా ఇంత కన్సర్న్ ఎందుకు? నాకేం సమస్యల్లేవు. ఏదైనా ఉంటే అమ్మతో షేర్ చేసుకుంటా”
కొడుకు అంత నిక్కచ్చిగా మాట్లాడుతాడని కృష్ణమూర్తి ఊహించలేదు. బాధ కలిగింది. 
భార్య ముందీ ప్రస్తావన తెచ్చి“వాళ్ళకా పొగరేమిటి? అంత గొప్పోళ్లయి పోయారా? నా జోక్యం వద్దంటారా?” అన్నాడు. 
ఆమె విని ఊరుకుంది. సమాధానం చెప్పలేదు.
“మాట్లాడవేం? వాళ్ళకు తండ్రి అవసరమే లేదా? అంతా అమ్మనేనా? ఇదంతా నీ శిక్షణే కదా”
“అదేంలేదు, పిల్లలు పెద్దోళ్లయ్యారు. వాళ్ళకన్నీ తెలుసు. మిమ్మల్నేమీ ధిక్కరించలేదు. మీపట్ల కోపమూ లేదు. వాళ్ళకు తండ్రి  అవసరమైనప్పుడు మీరెప్పుడైనా తోడున్నారా? ఆసరాగా నిలిచారా? కాస్తంత టైమైనా ఇచ్చారా?”
“ఏంటి నువు మాట్లాడేది..? ఏం తక్కువ చేశాను? అన్నీ సమకూర్చాను కదా”
“అన్నీ అంటే అవసరాలకు డబ్బులు ఇవ్వడమేనా? ఒక తండ్రిగా, ఇంటిపెద్దగా బాధ్యత అంతేనా? మనుషులతో పనిలేదా?”
                                         ***
మనశ్శాంతి లేక తల్లడిల్లుతున్నాడు కృష్ణమూర్తి. గడచిన జీవితాన్ని రివైండ్ చేసుకుంటే ఉద్యోగానికి వెలుపల తనెప్పుడూ జీవించలేదని అర్థమైంది. కుటుంబంతో గడపలేకపోయాడు. బంధుమిత్రుల్లో ఉనికినే కోల్పోయాడు.  
ఇంట్లో అందరితో కలిసి ఎప్పుడు భోంచేశాడో జ్ఞాపకం లేదు. కలిసి పండగ చేసుకున్నదీ, సరదాగా బయటికెళ్ళి గడిపిన సందర్భం ఒక్కటైనా లేదు. తన పెళ్లిరోజో, పిల్లల పుట్టినరోజులో కృష్ణమూర్తి ఊహక్కూడా అందనివి. 
ఎప్పుడూ కెరీర్ గురించే. పైకిపోవాలని శ్రమించాడు తప్ప తనవాళ్ళకి దూరమయ్యేది గ్రహించలేదు. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది..  తనకే ఆనందాల్లేవు. ఆత్మీయతల్లేవు. అనుభూతులు అసలు లేవు. మూడు దశాబ్దాల కొలువుతో సాధించిందీ లేదు. 
ఒక్కోరోజు గడుపుతుంటే కృష్ణమూర్తిని డిప్రెషన్ ఆవహిస్తోంది. 
భార్యతో సహా ఇంట్లో అంతా బిజీగా ఉన్నారు. తనను వాళ్ళలో కలుపుకోవడం లేదన్న ఫీలింగ్ బాధపెడుతోంది. బయట కూడా ఎవరూ పట్టించుకోరు. తనకన్నా ముందు రిటైరైన కొందరు మిత్రులిప్పుడు వివిధ వ్యాపకాల్లో ఉన్నారు. కుటుంబాలతో, గ్రాండ్ చిల్డ్రన్ తో హాయిగా గడుపుతున్నారు. చూట్టాలతో కలుస్తున్నారు. పర్యటనలకు వెళుతున్నారు. కొందరు ఆధ్యాత్మిక చింతనలో, కొందరు సోషల్ వర్కులో, ఇంకొందరు రాజకీయాలూ వ్యాపారాల్లో మునిగారు.  
కృష్ణమూర్తికి ఇవేవీ అనుభవంలో లేనివి. ఆటల్లో ప్రవేశం లేదు. సినిమాలు చూసే అలవాటు లేదు. పరిచయస్థులు, బంధువులతో చొరవగా కలిసిపోవడం రాదు. వివిధ ప్రాంతాలు తిరిగినా కంపెనీ పనులపై, డ్యూటీలో భాగంగా తప్ప సరదా కోసం కాదు.  
ప్రస్తుతం టైము గడవక నిమిషాలు లెక్కిస్తున్నాడు. ఇదేం జబ్బు కాదు డాక్టరుకు చూపించుకోడానికి. కంఠం మీది కొచ్చిన సమస్య కాదు సాయమడిగేందుకు. తన పరిస్థితి ఎక్కడా చెప్పుకోవడం అతనికి ఇష్టంలేదు. ఏమనుకుంటారో.. చిన్నచూపు చూస్తారన్న సందేహం.
అతనికి భార్య మీద అసూయ కలిగింది. ఇంటి పట్టునుండే సీదాసాదా గృహిణి, ఇప్పుడేమో తన కిష్టమైన వ్యాపకంతో హ్యాపీగా ఉంది. పిల్లలు ప్రయోజకులయ్యారు. తానెప్పుడూ వాళ్ళను పట్టించుకోలేదు. ఇప్పుడేమో వాళ్ళూ దూరం పెడుతున్నారు. 
ఓరోజు రాత్రి కుటుంబ సభ్యులతో కూర్చొని డిన్నర్ చేస్తుంటే అతనికి కొత్తగా అనిపించింది. 
కొడుకు మౌనంగా తింటున్నాడు. భార్యా కూతురూ భోంచేస్తూ మధ్యమధ్య చిన్నగా ముచ్చట్లాడుతున్నారు. కృష్ణమూర్తి గొంతు సవరించుకున్నాడు. “మీరు ముగ్గురూ నేను చెప్పేది కొంచెం వినాలి” అన్నాడు. అలా అని చెప్పడం మొదలుపెట్టాడు.
రిటైర్మెంట్ తరువాత కొన్నిరోజులుగా తను పొందిన అనుభవాలు, వ్యాపకమేదీ లేక ఖాళీగా ఉంటూ పడిన మానసిక సంఘర్షణ, కాలం ఎంత యాంత్రికంగా, దుర్భరంగా గడుస్తున్నదీ తన ఇగోని పక్కనపెట్టి వివరించాడు.
“నా పరిస్థితి అర్థం చేసుకొని మీరేదైనా సలహా ఇవ్వండి. మనసులో మాట నిస్సంకోచంగా చెప్పండి. నేనేమీ అనుకోను” నిజాయితీగా అభ్యర్థించి ముగ్గురి వంక ఆత్రంగా చూశాడు. ఈ పరిస్థితిలో వాళ్ళు తనను నిందిస్తారని, ఎగతాళి చేస్తారని భయపడ్డాడు. కానీ అట్లా జరగలేదు. కృష్ణమూర్తి చెప్పింది ముగ్గురూ సానుకూలంగా విన్నారు. 
ముందుగా కొడుకు నోరు విప్పాడు: “ఇదేం పెద్ద ప్రాబ్లెం కాదు డాడీ..! మీకు నచ్చిన ఏ యాక్టివిటీనైనా ఎంచుకొని అందులో ఎంగేజ్ అయిపోండి. ఖర్చు గురించి ఆలోచించకండి. మీ సంతోషానికి ప్రయారిటీ ఇవ్వండి. దానికోసమే వెతుక్కొండి. ఏ విషయంలోనూ టెన్షన్ పడొద్దు. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందరితో వేరుగా ఉండకుండా కలివిడిగా కలిసిపోవడం అలవర్చుకోండి. ముఖ్యంగా అమ్మతోనూ, మాతోనూ ప్రేమనీ.. ఆత్మీయతనీ పంచుకోండి, స్నేహంగా మెలగండి” అన్నాడు.
కుమార్తె మాట్లాడుతూ “యూ ఆల్వేజ్ బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ డాడీ..! అన్నిటికంటే ముందు మీరు మన ఫ్యామిలీ మెంబరుగా ఉండటం అలవాటు చేసుకోండి. ఇంతకాలం తెలియని ఆరాటంలో బతికేశారు. ఇప్పుడైనా అందరితో కలిసి ఉంటూ సంతోషంగా గడపండి. అమ్మతో కలిసి ఎటైనా తిరిగిరండి. పర్యటనలు చేయండి. చూట్టపక్కాలను కలవండి. ఇంకా మీరు గతంలో చేద్దామనుకొని మానేసిన ఏవైనా అభిరుచుల్ని ఇప్పుడు వెలికితీసి మొదలుపెట్టండి. వాటిని ఫుల్ ఫిల్ చేసుకోండి” చెప్పింది.
“నువ్వేమీ చెప్పవా... నీ సలహా ఏంటి?” భార్యని అడిగాడు.
“మీకు నేనేం చెప్పగలనండీ? ఆలోచిస్తే ఏం చెయ్యాలో, దేన్ని ఎంచుకోవాలో మీకే అవగాహనొస్తుంది. మగవాళ్లకి తమ ఆసక్తులను, అభిరుచులను సుసంపన్నం చేసుకునేందుకు ఆఫ్టర్ రిటైర్మెంట్ సరైన సమయమని చెపుతుంటారు. ఇప్పుడు మీకా అవకాశం వచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత ఎవరైనా తమ అభిరుచి మేరకు ఆనందంగా జీవించాలంటే అందుకు డబ్బే ప్రధానం కాదు. ఉద్యోగ కాలమంతా బిజీగా గడిపిన చాలామందికి రిటైర్మెంట్ తర్వాత తక్షణం అమలుచేసే ప్రణాళిక అంటూ ఉండకపోవచ్చు. అందువల్ల ఈకారణంతో కొద్దిరోజులు గుర్తింపు సంక్షోభాన్ని అనుభవిస్తారు. ఒకవిధమైన ఒంటరితనం, విసుగు, ఉద్ధేశరాహిత్యం వల్ల మనోవ్యాకులత ఏర్పడతాయి. అయితే ఒక్కటి మాత్రం మరవొద్దు. పదవీ విరమణ అంటే అదో ముగింపు కాదు, సరికొత్త ప్రారంభం. జీవితంలో సెకెండ్ ఇన్నింగ్ లాంటిది. నాకు తెలిసి మన పెళ్ళయిన కొంతకాలం వరకూ మీరు సాహిత్యంలో ఉన్నారు. రచనలు చేసేవారు. రచయితగా పాపులర్ అవుతున్న టైములో ఉద్యోగంలో మునిగిపోయి రచనా వ్యాసంగాన్ని వదిలేశారు. ఇంకేం ఆలోచించక రైటింగ్ మొదలుపెట్టండి. అపారమైన జీవితానుభవం, ఎన్నో జ్ఞాపకాలు మీకున్నాయి. ఇప్పుడు మరింత పరిపక్వతతో రచనలు చేయగలరు. 
ఈ వ్యాపకం వల్ల మీకు ఆనందమూ, సంతృప్తి దొరుకుతయి. ఇది వద్దనుకుంటే ఇందాక పిల్లలు చెప్పినట్టు ఇంకేదైనా యాక్టివిటీ ఎంచుకోండి. అన్నిటికంటే ముఖ్యం... మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఒక నిర్ధిష్టమైన జీవనశైలిపై శ్రద్ధ పెట్టండి. పొద్దునే వాకింగ్ వెళుతుండండి. గేమ్స్ ఆడండి. ఏదైనా ఎన్జీవోలో చేరి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగం పంచుకోండి. లేదా మీకు మంచి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఉంది గనుక స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పండి. ఇట్లా మీరు అనుకోవాలేగానీ ఎన్నో ఆప్షన్లు ఉన్నాయ్”
భార్య మాటల్ని ఆశ్చర్యపోతూ విన్నాడు కృష్ణమూర్తి. ఎంత బాగా చెప్పింది అనుకున్నాడు. ఆమెకున్న అవగాహనకు విస్మయం చెందాడు.  
కొద్దిరోజులుగా దారీ తెన్నూ లేక సతమతమైన తనకిప్పుడు కొత్త దారులు తెరుచుకున్నట్టయింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా అర్థవంతంగా గడిపేందుకు నిన్నటి వరకూ మార్గం కనిపించలేదు. కానీ ఇప్పుడు తనముందు ఎన్నో ఆప్షన్లు కనిపిస్తున్నాయి. నచ్చింది ఎంచుకొని సాగాలి. అన్నిటికంటే ముందు సుదీర్ఘకాలంగా తనకు కుటుంబంతో ఏర్పడ్డ గ్యాప్ భర్తీ చేసుకోవాలని భావించాడు. 
ఆ మర్నాడు ఉదయం కృష్ణమూర్తి హుషారుగా నిద్రలేచాడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు.                                                                                                                                                        
----------------------
                                                                                                      (స్వాతి మాసపత్రిక, జనవరి, 2026)

No comments:

Post a Comment