Saturday, January 17, 2026

 అమ్మో...ఎక్కాల పుస్తకం...! 

ఎవరు కనిపెట్టారో కాని చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నించి రెండో తరగతిలోకి అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచీలోకి చేరిపోయేది. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది. 

ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి. కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్నీ కొనేవారు కాని, ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవారు కాదు. ఏ అక్కో, అన్నో వాడేసి చిరిగి శల్యావస్థ లో వున్న పుస్తకం వాడుకోమనే వారు. ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవారు. ఇదొక యునివర్సల్ పుస్తకం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా రెండు రెళ్లు నాలుగే – ఒక్క తెలుగు సినిమాలో తప్ప. అక్కడ మాత్రం “రెండు రెళ్లు ఆరు”.  
 
అందరికీ  బై డిఫాల్ట్ ఒకటో ఎక్కం వచ్చేస్తుంది కదా.  రెండో తరగతిలో రెండో ఎక్కంతో మొదలయ్యేవి పాట్లు. “ రెండొకట్ల రెండు, రెండ్రెళ్ళు నాలుగు, రెండు మూళ్ళు ఆరు ...”  అంటూ ఒక ప్రత్యేక రాగం లో మాస్టారు పాడితే మనం కూడా అనాలన్న మాట. వేదాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంత చక్కగా  ఒకే రాగంలో మంత్రాలు చదవలేరన్నట్లుగా సాగేది ఆ రాగం.  ఈ  ఎక్కాల రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఎందుకు చేర్చలేదో ఇప్పటికీ అర్ధం కాదు. దీని గొప్పతనం ఏమిటంటే ఈ రాగంలో పాడితేనే ఎక్కం సరిగ్గా వచ్చేది. కాని దాని శృతి/రాగం/తాళం ఏమాత్రం మార్చినా ఆ ఎక్కం నోటికి వచ్చేది కాదు. అసలు అది  బుర్రలోకి అంత సులభంగా ఎక్కదు కాబట్టే దానికి “ఎక్కము” అనే పేరు వచ్చి వుంటుంది. 

అసలు ఎక్కాలు అంటే గుణకారాలేనని తెలియడానికి ఓ రెండు మూడు ఏళ్లు పట్టేది. అసలు ఇవి ఎందుకు కంఠతా పట్టాలి మాస్టారూ అని అడిగితే “పెద్దయ్యాక ఉపయోగిస్తాయిరా” అనే సమాధానం వచ్చేది. 

ఇరవై ఇరవైలు దాకా కంఠస్థ పడితే కాని పైక్లాస్ కి పంపము అని ప్రతీ క్లాస్ లోనూ అందరికీ ఓ మాస్ వార్నింగ్ లాంటిది ఇచ్చేవారు.  ప్రతీ ఎక్కం ఇరవై దాకానే ఎందుకుంటుంది, అలాగే పుస్తకంలో  20వ ఎక్కం దాకానే ఎందుకుంటుంది అన్నది అప్పట్లో అంతుచిక్కని ప్రశ్న. బహుశా మన సామర్ధ్యం ఇరవైల దాకానే అని వాళ్ళు నిర్ధారించుకుని వుంటారు.

ఏ పనికైనా వాయిదా పద్ధతి వున్నట్లు రెండో క్లాస్ లో పది పదుల దాకా చాలు అనేవారు. ఒక్కో క్లాసు పెరిగే కొద్దీ పన్నెడు పన్నెడులు, పదహారు పదహార్లు, చివరికి ఇరవై ఇరవైలు దాకా సాగేది. ఎక్కాలు అప్పజెప్పే సమయంలో అందరికీ గుండెలు దడ దడ లాడేవి. అప్పటి దాకా చదివినదే అయినా మాస్టారి దగ్గరకి వచ్చే సరికి  ఆరు ఆర్లు  కాస్తా నలభై రెండు అయిపోయేది. ఓ రెండు బెత్తం దెబ్బలు కొట్టి మళ్ళీ మొట్టమొదటి నించీ చదివి అప్పజెప్పు అని లైన్ లో చివరికి పంపించే వారు. 

నెక్స్ట్ స్టేజ్ లో కూడా ఎక్కాలు మోసం చేసేవి. అన్నీ చక్కగా అప్పచెప్తూ  ఆరార్లు  ముప్ఫై ఆరు అని చెప్పగానే మాస్టారు కోపంగా “ముప్ఫై ఆరా ?”  అని గద్దించే సరికి సెల్ఫ్ డౌట్ వచ్చి నలభై రెండు అనడం, రెండు దెబ్బలు తినడం, మళ్ళీ లైన్ లో చివరికి వెళ్ళడం నిమిషాల్లో జరిగిపోయేది. 

అప్పట్లో వీడియోలు లేవు కానీ ఈ ఎక్కాల క్లాస్ వీడియో తీస్తే ఒక హారర్ రీల్ గా వైరల్ అయిపోయేది. చేతులు దండకట్టి శూన్యంలోకి చూస్తూ మధ్య మధ్య మాస్టారి బెత్తం వైపు బెరుకు చూపులు చూస్తూ అప్పజెప్తుంటే  భలే వుండేది. ఇక ఆడపిల్లలైతే రాగం బ్రేక్ అయిపోయి ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. అంటూ కళ్ళు ఆకాశం వైపు పెట్టి దైవ సహాయానికై అర్ధించేవాళ్ళు. దేవుడు మాత్రం సహాయం మాట అటుంచి  రెండు చిన్న బెత్తం దెబ్బలు మాస్టారి ద్వారా ప్రసాదించేవాడు. 

ప్రతీ క్లాస్ లోనూ ఒకరిద్దరు ఐన్స్టీన్ లు వుంటారు కదా. వాళ్ళు ఎప్పుడు కంఠస్థ పడతారో  తెలిసేదికాదు గాని టక టకా అప్పజెప్పేసే వాళ్ళు. ప్రపంచాన్ని జయించినంత గర్వంతో మిగతా వాళ్ళ వైపు జాలిగా చూస్తుండేవారు. మనకి వళ్ళు మండిపోతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత. 

సరే, రాగాన్ని ప్రాక్టీస్ చేసో, కొండగుర్తులు పెట్టుకునో, బండగా బట్టీ పట్టో మొత్తానికి  ఇరవై ఇరవైల దాకా  అప్పజెప్పామనుకోండి, వెంటనే మాస్టారు రూల్స్ మార్చేసేవారు. ఈసారి తలక్రిందుగా అప్పజెప్పాలి అనే వారు. అంటే ఇరవై ఇరవైలు నాలుగొందలు  నించి రెండు ఒకట్ల రెండు దాకా అన్న మాట. పట్టుదలగా అదీ సాధిస్తే ఈ సారి రాండమ్ గా అడిగే వారు. పదమూడు పదిహేళ్లెంత అనో, పద్దెనిమిది పదమూళ్లెంత అనో ఆడగ్గానే మనసులో రాగం పాడుకోడానికి టైమ్ పట్టేది. 

 స్కూల్లో మాష్టర్లే కాదు, ఇంటికొచ్చిన చుట్టాలు,పక్కాలు కూడా కనబడితే చాలు “ఎన్నో క్లాస్ రా నువ్వు ?  ఎన్ని ఎక్కాలు వచ్చు ?  పన్నెడు పద్నాలుగులు ఎంత ?”  లాంటి ప్రశ్నలతో వేధించే వాళ్ళు. అందుకే వాళ్ళని తప్పించుకుని తిరగవలసి వచ్చేది.  
  
ఈ ఎక్కాల పుస్తకంలో ఎక్కాలే కాక ఇంకా ఎన్నో వుండేవి. అవి చాలా ఇంటరెస్టింగ్ గా వుండేవి. ప్రతీ  పేజీలోనూ క్రింద ఒక మంచి సుభాషితమో, సామెతో, వేమన పద్యమో వుండేది. అవన్నీ చక్కగా కంఠతా వచ్చేసేవి.  చివరి పేజీలలో అన్ని భాషల లోనూ తెలుగు వారాల పేర్లు,నెలల పేర్లు,ఋతువులు,తిధులు,నక్షత్రాల పేర్లు వుండేవి. తెలుగుతో బాటు తమిళ, హిందీ భాషలలొ కూడా వుండేవి.  భాను వారము, ఇందు వారము .. చిత్తి , వయ్యాశీ.. ఇలాగ. నిజానికి తెలుగు రాష్ట్రాలలో పల్లెటూళ్ళలో వుండేవారికి  దేశంలో తెలుగుతో బాటు వేరే భాషలు కూడా వుంటాయని మొదటి సారి పరిచయం చేసేది ఈ ఎక్కాల పుస్తకమే. అవి చదివేసిన విద్యార్ధులు బహుభాషా కోవిదుల్లా ఫీలైపోయేవారు.  

మొత్తానికి ఈ ఎక్కాల పుస్తకం ఒక మైక్రో బాలశిక్షలా పనిచేసేది. ఇది చదివినందువల్లే అప్పటి పిల్లలకి తెలుగు నెలలు, తిధుల పేర్లు తెలిసేవి. ఇప్పటి బాలలని ఎవరిని అడిగినా ఇవి సరిగ్గా చెప్పలేరని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి. 

ఇంతటి ఘన చరిత్ర వున్న ఎక్కాల పుస్తకం ఈనాటి కాలిక్యులేటర్లు, అబాకస్ లు, టాబ్లెట్ ల ధాటికి తట్టుకోలేక మాయమైపోతోంది. దానితోబాటే మన  పిల్లలకి తెలుగు సంస్కృతిని చిన్నతనం నించీ నేర్పే అవకాశం కూడా మృగ్యమైపోతోంది. ఐ మిస్ యు  -  ఎక్కాల పుస్తకం !!

ఇది చదివిన తర్వాత మీరు కూడా మిస్సవుతున్నారు కదూ? వెంటనే బజారుకెళ్ళి ఓ ఎక్కాల పుస్తకం కొనుక్కుని ఇరవై ఇరవైల దాకా తలక్రిందుగా కంఠస్థం చేయండి. మొబైల్లో  పాడు రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసేకంటే అదే మంచిది. మైండ్  ఆరోగ్యంగా, ఉత్సాహంగా వుంటుంది.

*సేకరణ🙏*

No comments:

Post a Comment