*శ్రీ శివ మహా పురాణం*
*402.భాగం*
*వాయవీయ సంహిత (పూర్వ భాగం) ఇరువది ఒకటవ అధ్యాయం*
*భద్రగణములు దక్షయజ్ఞములో బీభత్సమును సృష్టించుట*
*వాయువు ఇట్లు పలికెను:*
అపుడు విష్ణువు, ఇంద్రుడు మొదలైన ఆ దేవప్రముఖులు అందరు భయభీతులై కంగారుపడి పారిపోయిరి. తమ అవయవమలు ఏవియు చెక్కు చెదరకుండగనే దేవతలు పారపోవుచుండుటను గాంచి, గణాధ్యక్షుడగు వీరభద్రుడు శిక్షార్హులకు శిక్ష పడుట లేదని భావించి, కోపించెను. అపుడు గొప్ప బాహువులు గల వీరభద్రుడు సర్వలయకరుడగు రుద్రుని శక్తిని ప్రతిఫలించే త్రిశూలమును తీసుకొని, పైకి చూస్తూ నోటినుండి నిప్పులను గ్రక్కుచూ, సింహము ఏనుగులను వలె దేవతలను తరిమి గొట్టెను. పారిపోవుచున్న వారి వెనుక పరుగెత్తుచున్న ఆ వీరభద్రుని పరుగు మదించిన ఏనుగుయొక్క పరుగు వలె చాల సుందరముగా, మనోహరముగా నుండెను. తరువాత బలశాలియగు వీరభద్రుడు నీలము బూడిద రంగు మరియు ఎరుపు రంగుల కాంతులను వెదజల్లుతూ, ఏనుగుల గుంపునకు నాయకుడగు మహాగజము పెద్ద సరస్సును వలె, ఆ విశాలమైన దేవసైన్యమును కల్లోలపరచెను. బంగారముతో మరియు ముత్యములతో ప్రకాశించే పెద్దపులి చర్మమును వస్త్రముగా ధరించియున్న వీరభద్రుడు దేవతల గుంపులయందు నరుకుతూ, పగులగొడుతూ, రక్తధారలతో తడుపుతూ, చీల్చుచూ, పచ్చడి చేయుచూ, ఎండుగడ్డిని తగులబెట్టే అగ్నిహోత్రము వలె సంచరించెను. శూలమును చేతబట్టి అక్కడక్కడ మహావేగముతో సంచరించుచున్న వీరభద్రుడు ఒక్కడే అయిననూ, దేవతలకు వేయిమంది వీరభద్రులు ఉన్నట్లుగా కన్పట్టెను. అతిశయించిన బలగర్వముచే యుద్ధము కొరకు ఉరుకులు పెట్టుచున్న భద్రకాళి కూడ నిప్పులు గ్రక్కే శూలముతో యుద్దమునందు దేవతలను చీల్చి చెండాడెను. రుద్రుని కోపమునుండి పుట్టిన వీరభద్రుడు భద్రకాళితో గూడి, చంచలము మరిము పొగతో కప్పబడి బూడిద రంగును కలిగియున్నది అగు జ్వాలతో ప్రకాశించే ప్రళయకాలాగ్ని వలె శోభిల్లెను. ఆ సమయములో యుద్ధములో దేవతలను తరిమి గొట్టిన భద్రకాళి కల్పాంతమునందు జగత్తునంతనూ తగులబెట్టే ఆదిశేషుని విషాగ్నిజ్వాలవలె ప్రకాశించెను. రుద్రగణములలో అగ్రేసరుడగు వీరభద్రుడు ఆ సమయములో గుర్రములతో సహా సూర్యుని మరియు రుద్రులను శీఘ్రముగా ఎడమకాలితో అవలీలగా తన్నెను. జితేంద్రియుడగు వీరభద్రుడు కత్తలతో అగ్నిని, పట్టిశములతో యముని కొట్టెను.
ఆయన గట్టి శూలముతో రుద్రులను, గట్టి ముద్గరములతో వరుణుని, పరిఘలతో నిరృతిని, స్వయముగా గొడ్డళ్లను చేతపట్టి వాటితో వరుణుని కొట్టెను. వీరుడగు ఆ గణాధ్యక్షుడు యుద్ధములో సమస్తదేవతాగణములను మరియు శంభునకు విరోధులగు మునులను వెనువెంటనే అవలీలగా దనుమాడెను. ఇంతేగాక, తరువాత ఆ వీరభద్రదేవుడు దేవతలకు తల్లియగు సరస్వతియొక్క మిక్కిలి అందమైన ముక్కు కొనను వ్రేలిగోటితో త్రుంచి వేసెను. అతడు అగ్నియొక్క దండమువంటి చేతిని గొడ్డలితో నరికెను. దేవమాతయగు అదితియొక్క నాలుకను కొనలో రెండు అంగుళములను అతడు త్రుంచివేసెను. ఇంతే గాక, ఆ వీరభద్రదేవుడు స్వాహాదేవియొక్క కుడి ముక్కుపుటమును, ఎడమ స్తనాగ్రమును వ్రేలిగోటితో దునిమి వేసెను. ఆయన పూషమొక్క ముత్యాల వరుస వలె ప్రకాశించే దంతముల వరుసను ధనస్సుయొక్క అగ్రభాగముతో పగులగొట్టగా, ఆ కారణముగా అతని పలుకులలో స్పష్టత లోపించెను. తరువాత వీరభద్రదేవుడు కాలి బొటన వ్రేలితో అవలీలగాక్షణకాలముతో చంద్రుని పురుగును వలె తొక్కి పెట్టి నేలపై రాపాడించెను. వీరిణి (దక్షుని భార్య) ఆక్రోశించుచుండగా, వీరభద్రుడు మహాకోపముతో దక్షుని తలను దునుమాడి, దానిని భద్రకాళికిచ్చెను. ఆ దేవి మహానందముతో తాటిపండువంటి ఆ తలను తీసుకొని యుద్ధరంగములో బంతులాటను ఆడెను.
తరువాత దక్షుని భార్యయగు సోమిదేవమ్మను, దుష్టమగు శీలము గలభార్యలను భర్తలు వలె, గణాధ్యక్షులు కాళ్లతో మరియు చేతులతో కొట్టిరి. బలవంతులు, సంహము యొక్క పరాక్రమము గలవారు నగు గణాధ్యక్షులు అరిష్టనేమిని, చంద్రుని, ధర్మప్రజాపతిని, అనేక పుత్రులు గల అంగిరసుని, కృశాశ్వుని మరియు కాశ్యపుని కంఠమునందు పట్టుకొని లాగి పరుషమగు వాక్కులతో భయపెడుతూ, తలపై పిడికిళ్లతో మోదిరి. కలియుగమునందు విటులు కులస్త్రీలను బలాత్కరించు విధముగనే, భూతములు మరియు వేతాళములు భార్యలను మరియు కోడళ్లను బలాత్కరించిరి. పగులగొట్టబడిన కలశమలు గలది, విరుగగొట్ట బడిన యూపములు గలది, నశించిన పండుగ వాతావరణము గలది, తగులబెట్టబడిన ప్రధానశాల గలది, విరుగగొట్టబడిన ద్వారములు ఆర్చీలు గలది, పెకిలంచి వేయబడిన దేవబృందములు గలది, చితకగొట్టబడిన తపశ్శాలురు గలది, సద్దు మణిగిన వేదఘోషలు గలది, చల్లారిన జనసమ్మర్దము గలది, పీడింపబడుచున్న స్త్రీల ఆక్రందనలతో నిండినది, పాడుచేయబడిన సకలసామగ్రి గలది అగు ఆ యజ్ఞవాటిక పీడకు గురియై అరణ్యము వలె శూన్యముగా నుండెను. శూలముచే వేగముగా పొడువబడిన నరుకబడిన చేతులు మరియు వక్షఃస్థలములు గలవారు, పెరికివేయబడిన తలలు గలవారు అగు దేవశ్రేష్ఠులు నేలపై పడియుండిరి. ఆ దేవతలు వేల సంఖ్యలో సంహరించబడి నేలపై బడియుండగా, క్షణకాలములో గణాధ్యక్షుడగు వీరభద్రుడు ఆహవనీయాగ్ని (హోమములను ప్రధానముగా చేసే అగ్ని; మూడు అగ్నులలో ఒకటి) వద్దకు వచ్చెను.
యజ్ఞశాలలో ప్రవేశించిన ప్రళయకాలాగ్నిని బోలియున్న ఆ వీరభద్రుని చూచి మరణము వలన భయపడిన యజ్ఞపురుషుడు మృగదేహమును ధరించి పరుగెత్తెను. ఆ వీరభద్రుడు దృఢమైన నారిత్రాటియొక్క ధ్వనిచే భయమును కలిగించుచున్న పెద్ద ధనస్సును టంకారము చేయుచూ, పారిపోవుచున్న ఆ యజ్ఞపురుషుని వెనుక బాణములను ప్రయోగిస్తూనే పరుగెత్తెను. చెవి వరకు పూర్తిగా నారిత్రాటిని లాగి విడిచినప్పుడు ఆ ధనస్సు చేయు ధ్వని మేఘగర్జనను పోలియున్నది. నారిత్రాడు స్వర్గలోకము ఆకాశము మరియు భూమి అంతటా కంపించునట్లు చేయుచుండెను. ఆ పెద్ద ధ్వనిని విని తాను మరణించినాననియే తొట్రుపాటు పడుచున్న పాదములు గలవాడై వణికి పోతూ, కాంతిని కోల్పోయి లేడి రూపములో పరుగిడుతున్న ఆ యజ్ఞపురుషుని తలను వీరభద్రుడు నరికి వేసెను. సూర్యునినుండి పుట్టిన యజ్ఞపురుషుడు ఈ విధముగా అవమానింబడుటను గాంచిన విష్ణువు మహాకోపమును పొందినవాడై యుద్ధమునకు సన్నద్ధుడాయెను. సకలపక్షలకు రాజు, పాములను భక్షించువాడు అగు గరుడుడు వంగిన సంధి గల భుజముతో విష్ణువును మహావేగముగా మోయుచుండెను. దేవతలలో మరణించగా మిగిలిన వారు ఇంద్రుని ముందిడుకొని ప్రాణములను వీడుటకు సంసిద్ధులైనారా యన్నట్లు ఆ విష్ణువునకు సహాయపడుచుండిరి. రుద్రగణములకు అధిపతి, సింహము వంటి వాడు అగు వీరభ్రదుడు విష్ణువుతో కూడియున్న దేవతలను చూచి, నక్కలను చూచిన సింహమువలె భయము లేనివాడై, నవ్వెను.
*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో వీరభద్రుడు దేవతలను శిక్షించుటను వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది.*
No comments:
Post a Comment