Wednesday, January 14, 2026

 🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 87

శ్లో॥ అకించనః కామచారో నిర్వంద్వ శ్చిన్నసంశయః|

అసక్త స్పర్యభావేషు కేవలో రమతే బుధః ||

మోహింపజేసే రెండవదేదీ లేదనే దృఢజ్ఞానంతో, దేనినీ సంపాదించా లనే కోరిక లేకుండా యథేచ్చగా చరిస్తూ ఉంటాడు జ్ఞాని. సర్వసంశయ రహితుడై సర్వద్వంద్వాల ప్రభావానికీ లోనుకాకుండా నిత్యానందస్వరూపుడై ఉంటాడు.

ఈ ప్రాపంచిక విషయాలు తమంతతాముగా ఏ వ్యక్తినీ బంధించి బాధించవు. వాటిని సంపాదించాలనే కోరికే అహంకారంగా రూపుదిద్దుకుంటుంది. అహంకారమే తన కోరికలతో ఉద్రేకాలతో విషయ వాంఛలతో కష్టసుఖాల ననుభవిస్తూ ఉంటుంది. సాధించి స్వంతం చేసుకోవాలనే ఈ కోరిక వస్తువులపై కావచ్చు, వ్యక్తులపై కావచ్చు, ప్రదేశాలపై కావచ్చు, కొందరు తమ గురువుల నారాధిస్తూ బందీలైపోతారు. మరికొందరు గంగాతీరానికో పుణ్యక్షేత్రాలకో బానిసలైపోతారు. ఈ విధంగా ఆకర్షింపబడి దృఢంగా కట్టుబడిపోవడం సాధకు లకు ప్రాథమిక దశలో అవసరమే. ఈ విధంగా ఒక భావాన్ని ఆరాధిస్తూ కట్టుబడిన మనస్సు క్రమంగా ఏకాగ్రమయి, సునిశితమూ తీక్షణమూ అయిన శాస్త్రాధ్యయనంలో సారాన్ని గ్రహించగలుగుతుంది. ఇక్కడ మహర్షి జీవన్ముక్తుని జీవన దృక్పథాన్ని వర్ణిసూ అతడేవిధంగా దేనినీ సంపాదించాలనే కోరికలేకుండా, ఏ స్థలంమీద ప్రత్యేక వ్యామోహం లేకుండా యథేచ్చగా చరిస్తూ ఆనందంగా జీవించ గలడో స్పష్టం చేస్తున్నారు. మానసికంగా అతనిలో అహంకార తాదాత్మ్యం ఉండదు. కాబట్టి తత్ఫలితమయిన కోరికలూ ఆశాంతీ ఉండవు, సుఖదుఃఖాలు మానావమానాలు మొదలయిన ద్వంద్వాలతనిని బాధించవు.

ఈ విధంగా శరీరానికి సంబంధించి ఆతనివంటూ ప్రత్యేక పసువులు కానీ అతనికిష్టమయిన ప్రత్యేక ప్రదేశాలు కానీ ఉండవు. ద్వంద్వాలచే బాధింప బడవి శాంత మనఃస్థితి కలిగి ఉంటాడు. ప్రపంచంలో యథేచ్చగా చరిస్తూ ఉంటాడు. బుద్దిపరంగా అతనిలో ఎటువంటి సందేహాలు లేకపోవడంతో నిశ్చలశాంత బుద్దితో సదా సంతోషంగా ఉండగలుగుతాడు. అనుక్షణమూ తాను ఆత్మనని, తనకంటే భిన్నంగా రెండవదేదీ లేదని దృఢజ్ఞానం కలిగిన అతనిలో ఎటువంటి సందేహాలూ ఉండవు. వ్యక్తులపై, వస్తువులపై, ప్రదేశాలపైనా కూడా మోహపు విలువలు అతనిలో పూర్తిగా నశిస్తాయి. సాధారణ మానవులలో ఈ మూడింటిపైనా ఉండే మోహపు విలువలే వారి బాధలన్నిటికీ కారణంగా ఉంటాయి.

ఈ విధంగా జ్ఞాని---"కేవలో రమతే" -- తనలో తానే సదా ఆనందంగా ఉంటాడు. ఈ కేవలత్వం సర్వవ్యాప్తమయిన ఆత్మ చైతన్యపు స్వస్థితిని యథా తథంగా సూచిస్తుంది. స్తంభంలో భూతపుజాడ ఏ మాత్రమూ ఉండదు! భ్రమా జన్యమయిన పాము పోలికలు తాడులో మచ్చుకయినా కనిపించవు!! ఆత్మ తత్త్వంలోనికి జాగృతుడయిన వానిలో జగద్రూపభ్రమ లేశమాత్రమయినా ఉండదు, ఉన్న ఏకైక సత్యమే ఎప్పుడూ ఉంటుంది. వేదాంతంలో సూచింపబడే లక్ష్యం ఈ కైవల్యమే.

ఇక్కడ మహర్షి వాడిన "ఛిన్నసంశయః" అన్న పదం ముండకోపనిషత్తు లోని ఈ క్రింది శ్లోకాన్ని జ్ఞప్తికి తెస్తుంది.

భిద్యతే హృదయగ్రంధిః ఛిద్యస్తే సర్వసంశయాః క్షీయస్తే చాస్య కర్మాణి తస్మన్ దృష్టి పరావరే.

(ముండకోపనిషత్తు 2-28)

పరాపరాల రెండింటినీ దర్శించగల మహనీయునిలో హృదయపు గ్రంధులు ఏకమయి సర్వసంశయాలూ నశిస్తాయి. అతని కర్మలన్నీ కూడా దీనితోపాటే నశిస్తాయి.🙏🙏🙏

No comments:

Post a Comment