Friday, January 16, 2026

 1️⃣1️⃣8️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.*
   (నాలుగవ అధ్యాయము)

*34. తద్విద్ధిప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాl*
*ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినఃll* 

జ్ఞానము సంపాదించడానికి మార్గమేమిటి అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ముందు తత్వవేత్త అయిన గురువును వెతుక్కోవాలి. ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయాలి. ఆయనకు సేవలు చేస్తూ సమయం కొరకు ఆయన పక్కన వేచి ఉండాలి. గురువు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆయనను జ్ఞానము గురించి ప్రశ్నించాలి. అప్పుడు గురువు ప్రసన్నుడై జ్ఞానోపదేశం చేస్తాడు. గురువు ఉపదేశములను శ్రద్ధతో వినాలి. విన్నది భక్తితో ఆచరించాలి. ఈ విధంగా జ్ఞానమును సంపాదించాలి.

ఇక్కడ కృష్ణుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ ఆత్మజ్ఞానము అనేది ఎవరికి వాళ్లు తెలుసుకునేది కాదు. కేవలం గురువు ద్వారానే పొందదగినది. ఎందుకంటే, మనము ఎంత పండితులము అయినా, సంస్కృతము బాగా అధ్యయనం చేసినా, శాస్త్రములలోనూ, వేదములలోనూ, ఉపనిషత్తులలోనూ ఉండే విషయములను సరిగా అర్థం చేసుకోలేము. తప్పుగా అర్థంచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ద్వారానే మనము శాస్త్రములను సరిగా అర్ధంచేసుకునే అవకాశం ఉంటుంది.

ఆత్మజ్ఞానం గురించి అంటే తనను గురించి తాను తెలుసుకోడానికి ముందు, శాస్త్రము గురించిన అవగాహన కావాలి. శాస్త్రము అంటే వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవి. శాస్త్రముల సాయం లేనిదే మనం మన గురించి తెలుసుకోలేము. మన ముఖం మనం చూసుకోవాలంటే మనకు అద్దం కావాలి. అలాగే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు శాస్త్రప్రమాణం అత్యవసరము. కేవలము శాస్త్రము ఉండి ప్రయోజనము లేదు. ఆ శాస్త్రాన్ని మనకు అర్ధం అయేటట్టు చెప్పే గురువు ఉండాలి. మందుల షాపులో మందులు ఉన్నాయి. ఏ జబ్బుకు ఏ మందు వేసుకోవాలో, ఏ మోతాదులో వేసుకోవాలో చెప్పడానికి డాక్టరు కావాలి. అలాగే శాస్త్రములలో ఉన్న విషయాలను మనకు విడమరచి అర్ధం అయేటట్టు చెప్పడానికి గురువు కావాలి. గురువు అంటే అంధకారమునుండి వెలుగులోకి నడిపించేవాడు. అజ్ఞానము అనే చీకటిలోనుండి జ్ఞానము అనే వెలుగులోకి నడిపించేవాడు అని అర్థము.

ఆ గురువులు ఎలా ఉండాలి అంటే గురువుల యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చెప్పాడు పరమాత్మ. వారు జ్ఞానులు అయి ఉండాలి. అంటే జ్ఞానం సంపాదించి ఉండాలి. జ్ఞానం సంపాదించాలంటే వారు వంశవరంపరగా జ్ఞానసముపార్జన చేసిన వారు అయి ఉండాలి. గురు సంప్రదాయం కలవారుగా ఉండాలి. ఇంకా వారు తత్వదర్శనులు అయి ఉండాలి. అంటే పరమాత్మ తత్వమును బాగా తెలుసుకొని ఉండాలి. తత్వదర్శి కాకుండా, కేవలం తత్త్వదర్శి అని పేరు పెట్టుకొని, ఉపన్యాసములు ఇచ్చేవారు, వేదాలను వల్లించేవారు, వేదాంతము చెప్పేవారు గురువులు కాదు. తత్వదర్శనుడు అయి ఉండి, తాను తెలుసుకున్న దానిని, దర్శించిన దానిని తన శిష్యులకు అర్ధం అయేటట్టు బోధించే వాడు మాత్రమే జ్ఞాన బోధకు అర్హులు. వారినే బోధగురువులు అని అంటారు.

గురువుల గురించి చెప్పిన తరువాత ఆ గురువులను ఆశ్రయించిన శిష్ములు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ వివరంగా చెప్పాడు కృష్ణుడు, శిష్యుడికి శాస్త్రములను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాన ఉండాలి. శ్రద్ధ ఉండాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండాలి. దానికి తగ్గట్టు గురువు పట్ల వినయం, విధేయత కలిగి ఉండాలి. గురువు దగ్గరకు పోయినపుడు శిష్యుడు తనలో ఉన్న వినయమును, విధేయతను, శ్రద్ధను గురువు ముందు ప్రకటించాలి. అది ఎలాగంటే...
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P274

No comments:

Post a Comment