1️⃣1️⃣5️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాఽపరేl*
*ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాఃll*
దీనినే ప్రాణాయామము అని అంటారు. ప్రాణాయామం చేయడం కూడా ఒక యజ్ఞమే. అష్టాంగ యోగములలో ప్రాణాయామము నాలుగవది. మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ కాలము జీవించడానికి మనస్సు నిలకడగా ఉండటానికి దోహదపడేది ప్రాణాయామము. ఈ ప్రాణాయామము వలన శరీరంలో అంతర్గతంగా, నిద్రాణంగా ఉన్న అపరిమితమైన శక్తి మేల్కొంటుంది. సూక్ష్మ రూపంలో ఉన్న శక్తి ప్రకటితమౌతుంది. మానవుడిని ఉత్తేజితుడిని చేస్తుంది. ఏకాగ్రతను పెంపొదిస్తుంది. ఈ ప్రాణాయామంలో మూడు రకాలు. పూరకము, కుంభకము, రేచకము. ఈ శ్లోకంలో చెప్పబడినట్టు అపానము నందు ప్రాణమును హోమం చేయడం అంటే పూరకము, ప్రాణములను అపానము నందు యజ్ఞం చేయడం అంటే రేచకము. ప్రాణమును అపానమును ఆపివేయడం అంటే కుంభకము. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఓం కారమును జపిస్తూ చేయమంటారు పండితులు. అప్పుడు మనం చేసే పాణాయామం దైవీభావమును సంతరించుకుంటుంది. లేకపోతే ప్రాణాయామం కూడా యాంత్రికంగా మారిపోతుంది. ఈ ప్రాణాయామం వలన మనస్సు చంచలత్వమును మాని నిశ్చలంగా ఉంటుంది.
ప్రాణములు మన శరీరంలోనే ఉంటాయి. మనస్సు బయట సంచరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసను అదుపు చేస్తూ ప్రాణాయామం చేస్తున్నామో, మనసు ఎక్కడకు పోకుండా అక్కడే ఉంటుంది. ప్రాణాయామాన్ని చూస్తూ ఉంటుంది. ప్రాణములు మనస్సు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. కాబట్టి మనస్సును అదుపులో ఉంచడానికి ప్రాణాయామము అత్యావశ్యకము. కానీ ఈ ప్రాణాయామము సొంతంగా చేయకుండా గురువు గారి వద్ద అభ్యసించి చేయడం మంచిది.
*30. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జిహ్వతిl*
*సర్వేఽష్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాఃll*
మరి కొంత మంది ఆహార నియమములను నియంత్రించి దానిని ఒక యజ్ఞంగా చేస్తారు. అంటే ఉపవాసాలు చేయడం, శ్వాసను నియంత్రించడం ఇలాంటివి. బయట కనపడే వస్తువుల మీద ఎక్కువ ఆసక్తి కనపరచకపోవడం, ప్రాపంచిక విషయాలను విషయ వాంఛలను, లోపలకు ఏమీ చొరబడనీయకుండా నియంత్రించి, లోపల ఉన్న ప్రాణాలను ప్రాణాలలో హెమం చేస్తారు. మనసును ఆత్మతో కలుపుతారు. ఇది ఆఖరు యజ్ఞము. సాధకుడికి ఆహారమును నియంత్రించడం చాలా ముఖ్యము. లేకపోతే ఏకాగ్రత కుదరదు.
ఆహారాన్ని నియంత్రించడం. ఆహారం అంటే కేవలం తినే పదార్థాలు అనే కాదు. బాహ్య ప్రపంచంలో నుండి మనలోకి వెళ్లే ప్రతిదీ ఆహారమే. తినే ఆహారం పీల్చే గాలి, తాగే నీరు, చూడటం, వినడం, తాకడం, జననేంద్రియములతో అనుభవం ఇవన్నీ ఆహారం కింద లెక్క. వీటిని నియంత్రించడం ద్వారా కూడా యజ్ఞం చేయవచ్చు. ఇదంతా కలిపితే ఇదివరకు చెప్పిన ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, నిష్కామ కర్మ, అవుతుంది. ఇవన్నీ కాకుండా కేవలం ఆహారము పానీయములను మాత్రమే అనుకుంటే, మనం తీసుకునే ఆహారము పానీయముల ప్రభావము మన శరీరం మీదా, మనస్సు మీదా ఉంటుంది. సాత్వికాహారం తింటే సాత్వికమైన అణువులు ఏర్పడతాయి. మనస్సు సాత్వికంగా ఉంటుంది. జంతువుల మాంసం తినడం, మద్యం సేవించడం లాంటివి చేస్తే ఆ లక్షణాలే మనకు సంక్రమిస్తాయి. రజోగుణము తమోగుణము ప్రధానంగా ఉంటుంది. ఈ తీసుకునే ఆహారం కూడా మితంగానూ, సాత్వికంగానూ, న్యాయార్జితంగానూ, భగవంతునికి నివేదించినది కానూ, ఒక నియమిత కాలములో తీసుకొనేది గానూ ఉండాలి. వీటిలో కొన్ని పాటించమని నేడు డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇవి అన్నీ కూడా యజ్ఞముల కిందికి వస్తాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించాలి. సాత్వికాహారం తీసుకోవాలి. అప్పుడు గతి తప్పిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణములను, ఆహారనియమాలను పాటించడం ద్వారా, సక్రమమైన మార్గంలో మార్చడం జరుగుతుంది. ఇదీ ఒక యజ్ఞమే. అప్పుడు ప్రాణములు అన్నీ సక్రమంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వేటి పని అవి సక్రమంగా చేస్తాయి. అప్పుడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు.
యజ్ఞము అంటే ఏదో హడావిడి చెయ్యాలని అది మన వల్లకాదనీ అనుకొనే వారికి యజ్ఞములు అంటే ఏమిటి అని ఈ శ్లోకంలో పరమాత్మ వివరంగా చెబుతున్నాడు. ఈ యజ్ఞములు అందరూ చేయవచ్చు అందరికీ సాధ్యమే అని భరోసా ఇస్తున్నాడు. ఈ ప్రకారంగా యజ్ఞములు చేసినందు వలన జ్ఞానం కలుగుతుంది. గతజన్మలో పేరుకున్న పాపరాశి నశించి పోతుంది. మోక్షానికి మార్గం సులభం అవుతుంది. ఎవరు చేసిన పాపం వారు అనుభవించాలి. లేకపోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలంటే దానికి మార్గం పైన చెప్పబడిన యజ్ఞముల రూపంలో ఉంది అని భగవానుడు మనకు విశధీకరించాడు. ముందు గత జన్మపాపాలు పోవాలంటే పైన చెప్పిన యజ్ఞలు చెయ్యాలి. అప్పుడు మనస్సు శుద్ధిఅవుతుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది. అదే మోక్షానికి సోపానము. కాబట్టి పైన చెప్పబడిన యజ్ఞములలో కనీసం ఒక్కటైనా మనం ఆచరించగలిగితే, ఆ ప్రయత్నం చేయగలిగితే ఈ జన్మ సార్థకం అయినట్టే. తరువాతి శ్లోకంలో ఈ యజ్ఞములు చేయడం వలన కలిగే లాభముల గురించి వివరించాడు పరమాత్మ.
(సశేషం)
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P268
No comments:
Post a Comment