🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకము 86
శ్లో॥ పతతూదేతు వా దోహే వాస్యచింతా మహాత్మనః । స్వభావభూమి విశ్రాంతి విస్మృతా సేష సంసృతేః1186.
తన స్వభావం అనే భూమిమీద స్థితుడై జనన మరణ చక్రంనుండి ముక్తుడైన మహాశయుడు, తన శరీరం మృతినంది పడిపోయినా, సజీవంగా తిరుగుతున్నా లెక్క చెయ్యకుండా సదా శాంతంగా ఉండగలడు.
బాహ్యంగా కనబడే సమస్త చరాచర సృష్టి, (అంతరంగంగా అనుభవించే ఇంద్రియాలు కూడా) అనంతమైన ఆత్మతత్త్వంమీద ఆరోపింపబడ్డాయి. ఈ ఆత్మ తత్త్వమే సర్వాధిష్ఠానం, సర్వం పుట్టి పెరిగి చరించి నశించే భూమి, దీని మీదే సృష్ట్యాదిగా సర్వ సంఘటనలూ సంభవమవుతూ గుర్తింపబడుతూ చరిత్రగా స్మృతిగా నిలచిపోతున్నాయి. అనంతమూ అచలనమూ పరిణామ రహితమూ అయిన ఆత్మగా తన్ను తాను గుర్తించిన మహనీయుడు, అందులో భావనా లేశ మాత్రమయిన తన శరీరం గురించి ఎందుకు శ్రద్ధతీసుకుని విచారిస్తాడు? మహోన్నతమయిన తన స్వస్థితిలోని కదలికలుగా ఈ మహావిశ్వమంతా అతనికి గోచరిస్తుంది. ఆ మహావిశ్వంలో, సప్తఖండాలతో కూడిన మన భూగోళం ఒక చిన్న చుక్కవంటిది, అందులో ఒక ఖండం ఆసియా, అందులో ఉపఖండంగా భారతదేశం ఉంది. భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో ఒక వీధిలో ఒక ఇంటి వరండాలో ధూళికణ సమానమైన ఉంది! ఈ శరీరం "జీవించి చరిస్తున్నా, మృతినంది పడి ఉన్సా" మహావిశ్వానికే యీ దేహం విశ్రాంతి తీసుకుంటూ అధిష్ఠానమైన నన్ను ఏ విధంగా బాధిస్తుంది.
ఆత్మజ్ఞాని సర్వదా తన స్వస్థితిని గుర్తిస్తూ, చరిస్తూ ఉంటాడు. అందుకే ఈ భ్రమాజగత్తులో చరించే అతని శరీరం ఏ స్థితిలో ఉన్నా అతనికి ఒకటే. కలనుండి మేల్కొన్న నీకు కలలో ఉన్న నీ అందమైనశరీరానికి గల సంబంధం ఎటువంటిది? నిస్సందేహంగా ఈ శరీరము జీవించి చరించినా, మృతి నంది పడి ఉన్నా నీ కేవిధమైన భావమూ కలగదు, ప్రస్తుతం మేలుకుని ఉన్నావు కాబట్టి.🙏🙏🙏
No comments:
Post a Comment