Wednesday, January 14, 2026

 1️⃣1️⃣6️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.*
   (నాలుగవ అధ్యాయము)

*31. యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్l*
 *నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమll*

పైన చెప్ప బడిన యజ్ఞములు చేసిన తరువాత యజ్ఞ ప్రసాదమును స్వీకరిస్తే వారికి శాశ్వతమైన బ్రహ్మపదము లభిస్తుంది. యజ్ఞము చేసిన తరువాత చేసే భోజనము కూడా యజ్ఞఫలము, యజ్ఞశేషము అవుతుంది. అటువంటి యజ్ఞము కనీసం ఒకటైనా చెయ్యాలి. అప్పుడు ఈ మానవ జన్మ ఎత్తి నందుకు సార్థకత కలుగుతుంది. ఏమీ చేయకపోతే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అంటే మరుజన్మలో కూడా సుఖం కలుగదు.

పైన చెప్పబడిన యజ్ఞములలో కొన్ని పూజలు వ్రతాలు, ఉన్నాయి. ఇవి చేసిన తరువాత భగవంతునికి నివేదించిన పదార్థాలను, భగవంతుని ప్రసాదంగా ఆరగించడం వలన శరీరము మనసు పరిశుద్ధం అవుతుంది. భగవంతునికి నివేదించిన పదార్థములు అమృతంగా మారిపోతాయి. అవి తింటే మనం కూడా అమృతత్వమును సంతరించుకుంటాము. అందుకే భగవంతునికి నివేదించిన పదార్థములను ప్రసాదము అనీ, అమృతముతో సమానమనీ, మనం భక్తితో కళ్లకద్దుకొని మరీ తింటాము. (సత్యనారాయణవ్రత ప్రసాదము ఇటువంటిదే. శ్రద్ధతో, దీక్షగా వ్రతం చేసి, లేదా వ్రతం జరిగే చోట కూర్చుని, వ్రతం అయిన తరువాత ప్రసాదం స్వీకరించాలే కాని కేవలం ప్రసాదం పెట్టే సమయానికి వాలిపోయే ప్రసాద భక్తులం కాకూడదు).

పైన చెప్పిన శ్లోకంలో యజ్ఞము, దానికి ఉపయోగించే వస్తువులు, ఆ యజ్ఞము చేసే వ్యక్తులు, ఆ యజ్ఞఫలము అంతా బ్రహ్మ పదార్ధమే అని చెప్పారు. ఈ శ్లోకంలో యజ్ఞము చేసిన తరువాత మిగిలిన పదార్ధములు కూడా బ్రహ్మమే. అవి ఆరగిస్తే వాళ్లు కూడా బ్రహ్మ స్వరూపులు అవుతారు. మనం ఏదన్నా పని చేస్తే ఆ కార్యము యొక్క గొప్ప దానము దాని ఫలితము మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం యజ్ఞము అనే కర్మ చేస్తున్నాము. యజ్ఞము బ్రహ్మము అయినపుడు ఆ యజ్ఞఫలము కూడా బ్రహ్మమే అవుతుంది కదా.

మనం బాహ్య ప్రపంచములో అనేక కర్మలు చేస్తుంటాము. వాటికి తగిన ఫలితములను పొందుతుంటాము. ఆ ఫలితములన్నీ కేవలం క్షణికములే. ఇలా వచ్చి అలా పోతాయి. కాని మనం చేసే కర్మ బ్రహ్మస్వరూపము అయినపుడు దాని ఫలితము కూడా బ్రహ్మమే అయినపుడు ఆ ఫలితము శాశ్వతముగా ఉండి పోతుంది. మనకు శాశ్వతానందము కలుగజేస్తుంది. మనం ఈ జన్మ ఎత్తింది మోక్షం కోసం. మోక్షం అంటే ప్రాపంచిక విషయముల నుండి విముక్తి పొందటం. అటువంటప్పుడు మనం కేవలం క్షణికములు అయిన సుఖములు ఇచ్చే వాటి కోసం పాకులాడే కంటే శాశ్వతానందము ఇచ్చే బ్రహ్మయజ్ఞము కోసం ఎందుకు ప్రయత్నించకూడదు. కాబట్టి మనం అందరం పైన చెప్పబడిన దేవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఆహార సంయమనము వీటిలో ఏదో ఒక యజ్ఞమును శ్రద్ధాభక్తులతో, ఏకాగ్రతతో, నిష్కామంగా చేసి శాశ్వతానందమును ఎందుకు పొందకూడదు.

కాబట్టి మనం మన పరిధిలో ప్రతిరోజూ దేవునికి పూజాకార్యక్రమమును నిర్వర్తించి వండుకున్న పదార్థములను దేవుడికి నివేదించి తరువాత భుజించాలి అనే నియమం పెట్టుకోవాలి. అదే దేవయజ్ఞము. అలా కాకుండా వండుకున్నది దేవుడికి అర్పించకుండా తింటే పాపము తింటున్నట్టు అని ఇదివరకే తెలుసుకున్నాము. అటువంటి వానికి ఈ లోకంలో సుఖంఉండదు. పరలోకంలో అంటే తరువాతి జన్మలో కూడా సుఖం ఉండదు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను పొంది కూడా, కేవలం ప్రాపంచిక విషయముల కోసరం పాడులాడటం అవివేకము అని తెలుసుకోవాలి.

ఈ శ్లోకంలో భగవానుడు యజ్ఞశిష్టామృతభుజో అని చెప్పాడు. ఏదో ఒక యజ్ఞము చేసి తరువాత ఆ యజ్ఞశేషము అనే అమృతమును భుజించువాడు అని అర్థము. మనకు చేతనైన ఏదో ఒక యజ్ఞము చేసి, భగవంతునికి నివేదించి, ఆ యజ్ఞ శేషమును తింటే అది అమృతముతో సమానము. ఇక్కడ అమృతము అంటే మృతము లేని జ్ఞానము, వివేకము, శాంతి కలుగుతుంది. అంతే కానీ మనకు చావు రాదని కాదు. పుట్టినవాడు చావక తప్పదు అని గీతావాక్యము. కాబట్టి అమృతం అంటే అవ్యయము అయిన ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము అని అర్ధము.

ఇటువంటి యజ్ఞములు అంటే దేవతా కర్మలు, కనీసం ఒకటి అయినా చేయని వాడు అంటే ప్రతిరోజూ దేవుడికి దీపం పెట్టి తాను తయారుచేసుకున్న భోజనము పరమాత్మకు నివేదించని వాడు, ఈ లోకంలో కాదు కదా, పరలోకంలో కూడా అంటే మరుజన్మలో కూడా సుఖపడడు. వాడికి సుఖము శాంతి అనేవి ఉండవు అని పరమాత్మ బోధించాడు.

ఇక్కడ మనకు ఒకసందేహము వస్తుంది. జ్ఞానయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తపస్సు, ప్రాణాయాయము మొదలగునవి చేస్తే, యజ్ఞశేషము అనేది ఉండదు. కదా అని. మనం ఏ పని చేసినా అది తుదకు భోజనముతో సమాప్తి అవుతుంది. ఆ భోజనమునే భగవంతునికి నివేదించి, ఆ అమృతమును భుజించాలి అని అర్థం. పైన చెప్ప బడిన జ్ఞానయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తపస్సు, ప్రాణాయామము మొదలగు యజ్ఞముల ఫలము దాని వలన మనశ్శాంతిని, సుఖశాంతులను పొందటం. ఇవి కళ్లకు కనిపించే ఫలములు కాదు. మనస్సుతో అనుభవించేవి. అవి కూడా అమృతములే అంటే మృతము కానివి. శాశ్వతమైనవి.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P270

No comments:

Post a Comment