*శ్రీ శివ మహా పురాణం*
*401.భాగం*
*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-ఇరవైయ్యో అధ్యాయం*
*దక్ష యజ్ఞ విధ్వంసనము*
*వాయువు ఇట్లు పలికెను:*
అపుడు విష్ణువు మొదలగు సాటిలేని తేజస్సు గల దేవతలు పాల్గొనే, రంగు రంగుల ధ్వజములు మరియు సామగ్రి గల గొప్ప యజ్ఞమును వీరభద్రుడు చూచెను. చక్కని పొడవైన దర్భలచే పరచబడి యున్నది, చక్కగా ప్రజ్వరిల్లే అగ్నులు గలది, మెరిసే బంగరు యజ్ఞభాండములతో అలంకరింపబడినది. యజ్ఞమును చేయుటయందు సమర్థులు, యథావిధిగా యజ్ఞప్రయోగమును నిర్వహించువారు అగు ఋషులచే వేదమునందు చెప్పబడిన విధిని అనుసరించి చక్కగా అనుష్ఠించబడే అనేకయజ్ఞాంగముల క్రమము గలది. వేలాది దేవతా స్త్రీలతో శోభిల్లునది, అప్సరసల గణములచే సేవింపబడునది, వేణునాదముతో మరియు వీణావాదనముతో ఉల్లాసమును కలిగించునది. వేదఘోషలతో ఆకాశమును నింపుచున్నది. అగు యజ్ఞమును దక్షుని యజ్ఞశాలలో చూచి వీరుడు, ప్రతాపము గలవాడు అగు వీరభద్రుడు అపుడు దట్టని మేఘము వలె సింహనాదమును చేసెను. తరువాత గణాధ్యక్షులు యజ్ఞశాలయందు పెద్ద సముద్రఘోషను ధిక్కరిస్తూ ఆకాశమును పూరించుచున్నవా యన్నట్లు కిలకిల శబ్దములను చేసిరి. ఆ పెద్ద శబ్దమును తాళలేక దేవతలందరు వస్త్రములు మరియు ఆభరణములు జారిపోవుచుండగా అన్నివైపులకు పరుగులెత్తిరి. గొప్ప మేరుపర్వతము విరిగి పడు చున్నదా యేమి? భూమి పగిలిపోవుచున్నదా యేమి? ఇది యేమి? అని దేవతలు కంగారుగా కేకలను వేయుచుండిరి. మానవులు ప్రవేశింప శక్యము కాని అడవిలో సింహముల నాదమును విన్న ఏనుగులు వలె కొందరు భయముతో ప్రాణములను విడచిరి.
పర్వతములు పగిలెను. భూమి కంపించెను. గాలులు సర్వమును పెకలించి వేసెను. సముద్రము కల్లోలమాయోను. అగ్నులు మండుట మానవేసెను. సూర్యుడు ప్రకాశంచుట ఆగిపోయెను. గ్రహములు, నక్షత్రములు, ఇతరములగు ప్రకాశించే గోళములు ప్రకాశించుట మానివేసెను. ఇదే సమయములో వీరభద్ర భగవానుడు భద్రగణములతో మరియు భద్రకాళితో కూడి ఆ ప్రకాశించే యజ్ఞవాటికను చేరుకొనెను. ఆయనను చూచి దక్షుడు చాల భయపడిననూ, దృఢముగా నున్నాడా యన్నట్లు నిలబడి, కోపముతో నిట్లు పలికెను. నీవెవరివి? నీకిచట పని యేమి? దుర్బుద్ధియగు దక్షుని ఆ మాటను విని, గొప్ప తేజశ్శాలి, మేఘగర్జనవలె గంభీరమగు స్వరము గలవాడు అగు వీరభద్రుడు చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు ఆ దక్షుని, దేవతలను మరియు ఋత్విక్కులను చూచి, కంగారు పడకుండగా గంభీరమగు అర్థము గలది, మరియు సముచితమైనది అగు వచనమును పలికెను.
*వీరభద్రుడు ఇట్లు పలికెను:*
మేము అందరము సాటిలేని తేజస్సు గల లయకారకుడుగు శివుని అనుచరులము. మేము యజ్ఞములో భాగములను పొందగోరి వచ్చియుంటిమి. మాకు భాగములనిడు. అట్లు గాక, యజ్ఞములో మాకు భాగములనీయక పోయినచో, దానికి కారణమును చెప్పుడు. లేదా, దేవతలతో కలసి యుద్ధమునుచేయుడు. ఆ గణాధ్యక్షుడు ఇట్లు పలుకగా, దక్షుని ముందిడుకున్న దేవతలు ఇట్లు పలికిరి: ఈ విషయములో మంత్రములు మాత్రమే ప్రమాణము. ఇది మా ఆధీనములో లేదు. మంత్రములు ఇట్లు పలికినవి: ఓ దేవతలారా! మీ బుద్ధులు అజ్ఞానముచే కప్పివేయబడినవి. ఏలయనగా, యజ్ఞములో మొట్టమొదటి భాగమునకు అర్హుడగు మహేశ్వరుని మీరు పూజించకుంటిరి. మంత్రములీ విధముగా చెప్పిననూ, ఆ దేవతలందరు వ్యామోహముతో నిండిని బుద్ధి గలవారై, వీరభద్రుని త్రోసివేయగోరి, ఆయనకు యజ్ఞభాగమునీయలేదు. తాము పలికిన హితకరము మరియు సత్యము అగు వచనములు వృథాయగుటను గాంచి, అపుడు మంత్రుములు ఆ స్థానమును విడిచిపెట్టి శాశ్వతమగు బ్రహ్మలోకమునకు మెల్లగా వెళ్లినవి. అపుడు గణాధ్యక్షుడగు వీరభద్రుడు విష్ణువు మొదలగు దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను: బలముచే గర్వించియున్న మీరు మంత్రముల వచనములను ప్రమాణముగా స్వీకరించకుంటిరి. అందు వలననే, ఈ యజ్ఞములో మేము దేవతలచే ఈ విధముగా అవమానించ బడినాము. కావున, మీ గర్వమును మరియు దానితో బాటు మీ ప్రాణములను నేను తొలగించి వేసెదను. వీరభద్ర భగవానుడు ఇట్లు పలికి కోపించి శివుడు త్రిపురములను వలె విశాలమగు భవనమువంటి ఆ యజ్ఞశాలను తన కంటినుండి పుట్టిన అగ్నితో దహించెను. తరువాత పర్వతముల వలె విశాలమైన దేహములు గల గణాధ్యక్షులు అందరు యూవస్తంభముల నూడబెరకి హోత ( యజ్ఞములోని ఋత్విక్కు ) ల కంఠములయందు త్రాళ్లతో కట్టి, రంగు రంగుల యజ్ఞపాత్రలను పగులగొట్టి, పొడి చేసి నీటిలో కరిగించి, యజ్ఞసాధనములన్నింటినీ తీసుకొని గంగాప్రవాహములో పారవైచిరి.
అచట పర్వతములవంటి దివ్యములగు అన్నములు రాశులు, మధురపానీయములు చెరువులు, అమృతప్రవాహములనదగిన పాల నదులు, చిత్తడి నేలలవలె విశాలమైన గెడ్డ పెరుగుల సముదాయములు. రుచికరములైన పరిమళభరితములైన మాంసముల చిన్న పెద్ద గుట్టలు, రసవంతములైన ఆసవములు, పచ్చళ్లు, హల్వాలు ఉండెను. వీరులు వాటిని నోటియందుంచుకొని నమిలి భక్షించి చెల్లాచెదరుగా పారమేయు చుండిరి. వీరభద్రుని దేహమునుండి పుట్టిన బలవంతులగు ఆ వీరులు వజ్రములు, చక్రములు, పెద్ద శూలములు, శక్తులు, పాశములు, పట్టిసములు (గదల వంటి ఆయుధములు), రోకళ్లు, కత్తులు, గొడ్డళ్లు, భిందిపాలములు (ఒక రకమైన ఆయుధములు), గండ్ర గొడ్డళ్లు అనే ఆయుధములతో, లోకపాలురనందరినీ ముందిడుకొని గర్వించియున్న దేవతలను చావగొట్టిరి. నరుకుము, పగులగొట్టుము, త్రోసివేయుము, వేగముగా చంపుము, చీల్చుము, లాగుము, దెబ్బ తీయుము, పీకి వేయుము, పెకిలించి వేయుము మొదలైన క్రూరములగు, కర్ణకఠోరములైన, యుద్ధమునకు తగియున్న, హడావుడినుండి పుట్టే శబ్దములను గణాధ్యక్షులు అక్కడక్కడ మహావేగముతో ఉచ్చరించుచుండిరి. కొందరు కోరల వంటి దంతములతో పెదవులను అంగుడులను కొరుకుతూ కన్నులను గిరగిర త్రిప్పుచుండిరి. వారు తపస్సే ధనముగా గల, ఆశ్రమములయందు ఉన్న తపశ్శాలులను గట్టిగా లాగి కొట్టుచుండిరి. వారి స్రువము (హోమసాధనము) లను అపహరించి, వారి అగ్నిహోత్రములను నీళ్లలో పారవేసిరి. వారి కమండలములను పగులగొట్టి, మణులు పాదిగిన అరుగులను పగులగొట్టి, వారు పాడుతూ, గర్జిస్తు, అదే పనిగా నవ్వుచుండిరి (35). ఆ గణనాయకులు ఎర్రని ఆసవమును త్రాగుచూ నాట్యమును చేసిరి.
గొప్ప ఎద్దుతో పెద్ద ఏనుగుతో మరియు సింహముతో సమానమగు బలము గలవారు, సాటిలేని ప్రభావము గలవారు అగు గణనాయకులు ఇంద్రునితో సహా దేవతలను చితకగొట్టి, శరీరమునకు గగుర్పాటును కలిగించే అనేకచేష్టలను చేసిరి. వారిలో కొందరు గణనాయకులు ఆనందించుచుండిరి; కొందరు కొట్టుచుండిరి; కొందరు పరుగెత్తుచుండిరి; కొందరు వాగుచుండిరి; కొందరు నాట్యమాడుచుండిరి; కొందరు అధికముగా నవ్వుచుండిరి; కొందరు బలముగా గెంతుచుండిరి. కొందరు వర్షజలముతో నిండియున్న మేఘములను పట్టుకొనుటకు యత్నించుచుండిరి; కొందరు సూర్యుని పట్టుకొనుటకై పైకి ఎగురుచుండిరి; కొందరు భయంకరాకారులగు గణనాయకులు ఆవాశమునందున్నవారై వాయువుతో సమానముగా వీచుటకు యత్నించుచుండిరి. గరుడ పక్షులు పెద్ద పాములను వలె కొందరు పర్వతశిఖరమును బోలి యున్న గణనాయకులు శ్రేష్ఠమగు ఆయుధములను ఎత్తి పట్టుకొని దేవతలను కూడ తరుముచూ అంతరిక్షమునందు గిరిగిర తిరుగుచుండిరి. నల్లని మేఘములను పోలియున్న కొందరు గణనాయకులు పై కప్పులతో కిటికీలతో మరియు అరుగులతో సహా ఇళ్లను పెకిలించి పెకిలించి నీటి మధ్యలో పారవేసి పారవేసి సంహనాదములను చేయుచుండిరి. ఆశ్చర్యము! ద్వారములను తలుపులను ఊడబెరకి, గోడలను పగులగొట్టి, శాలలను పై కప్పులకు ఆధారముగానుండే బల్లగొడుగులను మరియు కిటికీలను విధ్వంసము చేసి వారు, రక్షించే నాథుడు లేని ఆ యజ్ఞశాలను అసత్యవాక్యమును వలె భగ్నము చేసిరి. వారు ఇళ్లను పెకిలించుచుండగా, ఓ నాథా! తాతా! తండ్రీ! కుమారా! సోదరా! మాయమ్మా! మామయ్యా! మొదలైన, రక్షకులు లేని వారు చేసే పలువిధముల ఆక్రందనములను స్త్రీలు చేయుచుండిరి.
*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో పూర్వభాగమునందు దక్షయజ్ఞవిధ్వంసమును వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).*
No comments:
Post a Comment