🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺
🔥అంతర్యామి 🔥
# పరమాత్ముడి ప్రవచనం...
☘️భగవద్గీత... శ్రీకృష్ణ పరమాత్మ పాండవ మధ్యముడైన అర్జునుడికి బోధించిన అద్భుత వికాస పాఠం. పరమాత్మ ప్రబోధం అర్జునుడికే అయినా, విశ్వ మానవాళి దైనందిన జీవితంలో తెలుసుకోవాల్సిన అనేక విషయాలు భగవద్గీతలో దర్శనమిస్తాయి. భగవద్గీత అపురూపమైన విశ్వమానవ విజ్ఞానకోశం! నిత్యసత్యాలు, మార్గదర్శకమైన బోధనలు అన్ని అధ్యాయాలలోనూ అంతర్భాగమై, నవ్యమైన జీవనానికి బంగరు బాటలు వేస్తాయి.
☘️అమృతతుల్యమైన గీతాసారాన్ని పరికిస్తే, మంచి చెడుల మధ్య జరిగే నిరంతర సంఘర్షణ, మానవులు ఆచరించాల్సిన జీవన నియమాల వంటివి వ్యక్తిత్వవికాసానికి హితమైన రీతిలో కన్పిస్తాయి. ఇంద్రియ భోగం క్షణభంగురమనీ, ఆవేశాలను, ఆవేదనలను మనిషి వీలున్నంతగా నిగ్రహించుకోవడం అవసరమని గీత చెబుతోంది. దేహినిత్యుడని, దేహాలు అనిత్యాలనీ ప్రబోధిస్తూ, ఒంటి మీద పెంచుకునే మమకారం శుష్కమైందని కృష్ణ పరమాత్మ ప్రబోధించాడు. తద్వారా లంపటాలపై, అనుబంధాల పై నిండిన అమితమైన
ఆసక్తి మనుషులకు నిరర్థకమని విశదం చేశాడు.
☘️ ప్రాపంచిక సుఖభోగాలపట్ల మమకారంతో మెలిగే జీవులు చిత్తభ్రాంతికి లోనవుతారు. భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావాల్సిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. కళ్ల ముందు కనిపించే అందాలు, ఆనందాలు శాశ్వతమని భావించే అల్పమనస్కులు వీరు. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, సముద్రం ఎలా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంటుందో, అలాగే వాంఛనీయ వస్తువులు కనులముందు దర్శనమిస్తున్నా, చలించని యోగి నిజమైన శాంతిని పొందుతాడన్న గీతా ప్రబోధం నిత్యసత్యం. వివేకులకు అనుభవైకవేద్యం. పనులను కర్తవ్యంలా పూనికతో నిర్వహిస్తూ, కర్మఫలాలపై ఆసక్తి లేకుండా వ్యవహరించే వ్యక్తి పరమపదాన్ని చేరుకోగలడని
బోధించింది.
☘️పండితుడైనవాడు అందరినీ, అన్నిటినీ
సమదృష్టితో చూస్తాడని తెలుపుతూ పాండిత్యమన్న
పదానికి మహితమైన నిర్వచనాన్ని భగవద్గీత
అందించింది. మనిషికి మనసే మిత్రుడు, మనసే
శత్రువు. మనసును జయించిన యోగులు శీతోష్టాలు,
సుఖదుఃఖాలు, మానావమానాలవంటి ద్వంద్వాలకు
అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. వారు
ప్రశాంతతతో, స్థిరచిత్తంతో మెలుగుతారన్నది
గీతావాక్యం. భగవద్గీత అనేది ఆధ్యాత్మిక బోధ కాదు.
మనుషులు తాము చేయాల్సిన పనుల పట్ల ఎం నిబద్ధతతో ముందుకు సాగాలో చెప్పే విశిష్ట గ్రంథం.
☘️సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ప్రవర్తించేవారు పరమాత్మను తెలుసుకోగలరని గీత పేర్కొంది. సుఖదుఃఖాలలో ఒక రీతిగానే ఉండేవారు; మట్టిముద్దను, బంగారాన్ని ఒకే విలువతో చూసేవారు; అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో ఒక్కరీతిగానే ఉండేవారు; నిందాస్తుతులను రెంటినీ సమంగా స్వీకరించేవారే త్రిగుణాలకు అతీతులు. వారి వర్తన అందరికీ మార్గదర్శకమనీ గీత ప్రబోధించింది. పరమాత్మ జగతికి అందించిన మహత్తర జీవన సందేశమిది.🙏
✍️-వెంకట్ గరికపాటి
🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺
No comments:
Post a Comment