Wednesday, January 14, 2026

 🔥అంతర్యామి 🔥

# గెలుపు దారి..

☘️లోకంలో కొందరు తమ బుద్ధి విశేషంతో, అపార అనుభవంతో ఎలాంటి సమస్యలనైనా తేలిగ్గా ఎదుర్కొంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోగ ఆ సామర్థ్యాన్ని స్వయం ప్రతిపత్తిగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో విజయం సాధించినప్పుడల్లా తమపై తమకు నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మిక పరిభాషలో 'పౌరుషం' అంటే అదే!

☘️మరికొందరు ప్రతి విషయానికీ దేవుడి సాయం ఆశిస్తారు. తమ చిత్తాన్ని దైవానికి అంకితం చేసి, కోరికలను ప్రార్ధన రూపంలో భగవంతుడికి నివేదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో గెలుపొందినప్పుడల్లా వారికి దేవుడిపై నమ్మకం మరింత బలపడుతూ వస్తుంది. అలా తమను తాము దైవానికి సమర్పణ చేసుకోవడమే- 'శరణాగతి'. ఆ మార్గంలో దక్కిన విజయాన్ని 'దైవికత' అంటారు. దైవ, పౌరుషాల మధ్య సమన్వయం చేకూరితే సంపూర్ణ విజయం సిద్ధిస్తుందని పెద్దల సూచన. అర్జునుడికి లభించింది. ఆది. పూర్తి సామర్థ్యంతో, పరాక్రమంతో తానే యుద్ధం చేసినా కీలక సమయాల్లో మాత్రం కృష్ణుడి సహకారాన్ని స్వీకరించాడు. దైవ, పౌరుషాల ఆ మేలికలయిక కిరీటికి గొప్ప విజయాన్ని అందించింది. 'శిశుపాల వధ'లో మాఘకవి- ఆ కలుపుగోలు ధోరణిని వివరిస్తూ 'విద్వాంసుడు పూర్తిగా దైవంపై ఆధారపడడు. అలా అని, అంతా తన ప్రతిభేననీ పొరబడడు, సత్కవులకు శబ్దం, అర్ధం రెండూ అవసరమైనట్లే... విజేతల విషయంలో దైవ పౌరుషాలు ఒకటవ్వాలి' అన్నాడు. ఆధునిక యుగంలో ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలుచేసిన వారిలో భారత పూర్వ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ అగ్రగణ్యులు.

☘️'ఆదినుంచీ దైవాన్ని నా కార్యకలాపాల్లో భాగస్వామిగా నమ్మడం అలవాటు. విధుల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడం అన్నివేళలా సాధ్యం కాదని, అది నా శక్తికి మించినదని నాకు తెలుసు. నా సామర్థ్యాన్ని తొలుత అంచనా వేసుకుని దాన్ని యాభైశాతం పెంచి, నన్ను నేను  దేవుడి చేతులకు సమర్పించుకుంటాను. ఆ తరహా సమష్టి భాగస్వామ్యంలో నేను అదనపు శక్తిని పొందడమే కాక, అది నిజంగానే నా ద్వారా ప్రసరిస్తున్న అనుభూతిని సైతం స్వయంగా ఆస్వాదించాను. దేవుడి రాజ్యం నీలోనే ఆ శక్తి రూపంలో ఉంటుందని నిశ్చయంగా చెప్పగలను' అంటూ తన ఆత్మకథలో కలామ్ చెప్పారు.

☘️దిలీప్ కుమార్ పుట్టి పదహారో ఏట సూఫిజాన్ని స్వీకరించి, భారతీయ సినీ సంగీత జగత్తును శాసించే స్థాయికి ఎదిగిన ఎ. ఆర్. రెహమాన్ అనుభవమూ అదే. 'ఎప్పటికప్పుడు కొత్తదేదో చేయడానికి నన్నొక శక్తి ముందుకు తోస్తోందని నిత్యం అనిపిస్తూనే ఉంది' అన్నారాయన. పడమటి సంగీతానికి పట్టుచీర కట్టినట్లు తన పౌరుషానికి దైవికతను చుట్టబెట్టాన దాని అంతరార్థం.

☘️కలామ్, రెహమాన్ల విషయంలో ఆధ్యాత్మికత అనేది విశ్వాసాలకు చెందినది కాదు- అధ్యయనం చేయాల్సిన అంశంగా నిరూపణ అయిన విషయం. దాన్ని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతను మనిషి తనకు చోదకశక్తిగా మలచుకోగలుగుతాడు. అది గెలుపు దిశగా మనిషిని నడిపించగలుగుతుంది.🙏

✍️- ఎర్రాప్రగడ రామకృష్ణ

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺

No comments:

Post a Comment