1️⃣1️⃣7️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖేl*
*కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసేll*
ఓ అర్జునా! ఈ ప్రకారంగా వివిధములైన యజ్జములు అన్ని వేదములలో చెప్పబడ్డాయి. ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో... అని పరమాత్మ బోధించాడు.
కర్మలలో పుట్టి పెరిగి, కర్మలు చేసే ప్రతి వాడూ ఈ యజ్ఞముల గురించి తెలుసుకోవాలి. ఆచరించాలి. శాశ్వతానందమును పొందాలి. అందరూ వేదములను చదవలేరు, చదివినా అర్థం కావు కాబట్టి పరమాత్మ మనకు వివరంగా క్లుప్తంగా ఈ యజ్ఞముల గురించి చెప్పాడు. కర్మణాన్ అంటే ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన పుట్టినవి. ఏ యజ్ఞము కానీ శ్రద్ధతో నిష్టతో, భక్తితో చేయాలి గానీ ఏ ప్రయత్నమూ చేయకుండా సోమరిగా కూర్చోకూడదు. కాబట్టి ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞము చేసి, జ్ఞానము సంపాదించి, మోక్షమార్గంలో ప్రయాణం చేయాలి కానీ ఏ ప్రయత్నమూ లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు అని పరమాత్మ నిర్ద్వంద్వంగా చెప్పాడు.
ఒక్కసారి ఇప్పటి వరకు ఎన్ని యజ్ఞములు చెప్పబడ్డాయో తెలుసుకుందాము. శ్లోకము 25 లో దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము. 26 లో ఇంద్రియ సంయమనము, శబ్దము మొదలగు విషయములను నిరోధించేయజ్ఞము. 27 లో మనో నిగ్రహ యజ్ఞము. 28 లో ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. జ్ఞాన యజ్ఞము. 29 లో ప్రాణాయామము. 30 లో ఆహార నియమములు అనే యజ్ఞము. మొత్తము 12 రకములైన యజ్ఞములు చెప్పబడ్డాయి. ఇవే కాదు వేదములలో ఇంకా చాలా విధములైన యజ్ఞముల గురించి చాలా విస్తారంగా, విపులంగా చెప్పబడింది. ఈ యజ్ఞములనన్నింటినీ స్థూలంగా రెండుగా విభజించవచ్చు. అవే జ్ఞాన యజ్ఞము, కర్మయజ్ఞము. కర్మయజ్ఞములు కూడా జ్ఞాన సముపార్జనకు తోడుపడతాయి. అందుకని ముందు కర్మయజ్ఞములు ఆచరించి వాటి వలన చిత్త శుద్ధి, మానసిక నిర్మలత్వము పొంది తరువాత జ్ఞాన యజ్ఞములు చేసి మోక్షమునకు మార్గం సుగమం చేసుకోవాలి.
*33. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞా జ్ఞానయజ్ఞః పరన్తపl*
*సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతేll*
ద్రవ్యములతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానము గురించి చేసే యజ్ఞము గొప్పది అని పరమాత్మ చెప్పాడు.
ద్రవ్యములు అన్నీ శాశ్వతములు కావు. జ్ఞానము నాశనం అయ్యేది కాదు. పైగా ద్రవ్య యజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే. జ్ఞానమునకు తొలి మెట్టు ద్రవ్యయజ్ఞము. కాబట్టి ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము గొప్పది. జ్ఞాన యజ్ఞము అంటే ఆత్మ తత్వమును గురించి విచారించడం, తెలుసుకోవడం. పరిశోధించడం, ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి అని విచారించడం. మనం జ్ఞానేంద్రియములతో గ్రహించే విషయములను వివేకంతో పరిశీలించడం, భగవంతుని గురించి వినడం, మననం చేయడం, ఆచరించడం, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించడం, పూర్వజన్మవాసనలను పూర్తిగా నిర్మూలించడం, మొదలగునవి జ్ఞానయజ్ఞము కిందికి వస్తాయి.
ఇంక ద్రవ్యయజ్ఞము అంటే ధనముతో సంపాదించిన వస్తువులతోనూ, బంగారముతో చేసిన వస్తువులను ఉపయోగించి చేసే యజ్ఞములు, ద్రవ్యము, వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని అన్నారు. ద్రవ్యయజ్ఞమునకు ధనం కావాలి, వస్తువులు కావాలి. కాని జ్ఞానయజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏదీ అక్కరలేదు. మనం విహిత కర్మలు చేసినా, కర్మలో అకర్మను చూచినా, అకర్మలో కర్మను చూచినా తుదకు అది జ్ఞానమునకే దారి తీస్తుంది. కాబట్టి ఏదీ వృధా కాదు. ఏ కర్మయజ్ఞము చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానము అనే సముద్రంలో కలుస్తాయి. అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అనే పదం వాడాడు. మనం ఏ యజ్ఞము చేసినా తుదకు జ్ఞానంతో పరిసమాప్తం అవుతుంది అని అర్థం. మనం చేసే సమస్తమైన కర్మలు, యజ్ఞములు వాటిఫలములు అన్నీ జ్ఞానంలో కలిసిపోతాయి. శాశ్వతత్వాన్ని పొందుతాయి.
కాబట్టి మనం ఏదైనా మంచి పని శ్రద్ధతో, భక్తితో, దైవపరంగా, నిష్కామంగా చేస్తే అది యజ్ఙంతో సమానము. దానికి మంచి ఫలం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. అది జ్ఞానమునకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానమును పొందాలి అనే లక్ష్యంతోనే కర్మలు చేయాలి కానీ ఏవో తాత్కాలిక సుఖముల కోసం కాదు. కర్మ యజ్ఞము యొక్క లక్ష్యం జ్ఞానం పొందడం. దానికి సాయపడేదే కర్మ. అంతే కానీ ద్రవ్యయజ్ఞములే శాశ్వతం కాదు. మానవులు ఏ దేవుని పూజించినా, ఏ మార్గంలో ప్రయాణించినా, ఏ సాధన చేసినా, ఏ సంప్రదాయాన్ని పాటించినా, తుదకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యము. మోక్షం పొందడానికి ఈ జ్ఞానమే తుది మెట్టు. కాబట్టి జ్ఞానాన్ని సాధించడానికి కర్మ చేయాలి. ఆ జ్ఞానంతో మోక్ష మార్గం చేరుకోవాలి.
కర్మ ఏం చేస్తుంది? మానవుని జ్ఞానము అనే భవనం వద్దకు తీసుకొని వెళుతుంది. అక్కడి నుండి జ్ఞానము మానవుని మోక్షమార్గంలో తీసుకెళుతుంది. కాబట్టి జ్ఞానము అనేది ఒకే సారి రాదు. సత్కర్మలు చేసి చేసి, చిత్తశుద్ధిని అలవరచుకొని, తరువాత జ్ఞానమును సంపాదించాలి. కాబట్టి మొట్ట మొదటి మెట్టుగా మానవుడు కర్మయోగం అవలంబించాలి. సత్కర్మలు చేయాలి. సత్సంగములో ఉండాలి, నిష్కామ కర్మలు చేయాలి. నిరంతరము భగవంతుని ఆరాదించడం, దైవ చింతన చేయడం, శ్రవణం, మననం, కీర్తనం మొదలగునవి ఆచరించాలి. అప్పుడు మానవుడు జ్ఞానమునకు అర్హుడవుతాడు. కాబట్టి ప్రతి మానవుడు జ్ఞానసముపార్జనే లక్ష్యంగా కర్మలు చేయాలి. జ్ఞానము, కర్మ రెండింటిలో జ్ఞానమే శ్రేష్ఠమనీ, కాని జ్ఞానము సంపాదించడానికి కర్మముఖ్యమనీ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు.
ఈ శ్లోకంలో జ్ఞానము యొక్క శ్రేష్టత, కర్మయొక్క ఆవశ్యకత నిరూపించబడ్డాయి. మరి ఆ జ్ఞానమును ఎలా పొందాలి అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో చెప్పాడు పరమాత్మ.
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P272
No comments:
Post a Comment