Wednesday, January 14, 2026

 1️⃣1️⃣4️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.*
   (నాలుగవ అధ్యాయము)

*28. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగ యజ్ఞాస్తథాఽసరేl*
 *స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాఃll*

ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, కర్మయోగము, స్వాధ్యాయము అనే జ్ఞానయజ్ఞము, వ్రతములు పూజలతో కూడిన దైవయజ్ఞము కొంత మంది ఆచరిస్తూ ఉంటారు.

మనం కర్మలు చేస్తాం. ధనం సంపాదిస్తాం. ఆస్తులు సంపాదిస్తాం. వాటిని కూడబెడతాం. అవి వృద్ధిచెందుతుంటే ఆనందం. అని పోతే విషాదం. మనం సంపాదించిన ధనం వలన కేవలం ఆనందం మాత్రం కలగాలంటే ఒకటే మార్గము, దానం. తనకు అవసరమైనంత వరకు ఉంచుకొని మిగిలిన దానిని ఇతరులకు దానం చేయడం దాని వలన తృప్తి, ఆనందం కలుగుతాయి. దానం కూడా ఒక విధమైన యజ్ఞము అని అన్నాడు పరమాత్మ. దీనినే ద్రవ్య యజ్ఞము అని అన్నారు. ద్రవ్యయజ్ఞము అంటే తాను ఆర్జించిన ధనమును ఇతరులకు దానం చేయడం. మంచి విషయములకు వినియోగం చేయడం, దానము ధర్మము కూడా యజ్ఞంగా భావించాలి. ధనము, ఆస్తులు, ఒకరి నుండి ఒకరికి మారుతూ ఉండాలి కానీ ఒకే చోట నిలకడగా ఉండకూడదు. దానం వలన ధనము, వస్తువులు, ఆస్తులు, విద్య ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి. ధనం ఆర్జించిన దానికి ఫలితం కూడబెట్టడం కాదు. దాని వలన దుఃఖము వస్తుంది. ఆర్జించిన ధనాన్ని ఇతరులకు, మంచి కార్యాలకు దానం చేస్తే, మనసుకు ఆనందం కలుగుతుంది. సమాజశ్రేయసు కలుగుతుంది. అలాగే విద్య నేర్చుకున్న దానికి ఫలితం ఆ విద్యను పది మందికి దానం చేయడం, అంటే చెప్పడం, దానివలన పది మంది విద్యావంతులు తయారౌతారు. ఆ విధంగా విద్యావ్యాప్తి జరుగుతుంది. కాబట్టి హిందూ సంస్కృతిలో దానం అత్యంత ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి దానాన్ని ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పాడు పరమాత్మ.

రెండవది తపోయజ్ఞము. అంటే మనకు గాను మనం, ఇష్టపూర్వకంగా, స్వీయక్రమశిక్షణ పాటించడం. ప్రాపంచిక విషయాల మీద, వాటిని అనుభవించడం మీద స్వీయ నియంత్రణ కలిగి ఉండటం అంటే ప్రాపంచిక విషయాలకు మనం యజమానుల మాదిరి ఉండాలి. కానీ వాటికి బానిసలు కాకూడదు. ఉదాహరణకు అయ్యప్పస్వామి మండల దీక్ష నియము బద్ధంగా పాటిస్తే, అది ఈ తపోయజ్ఞము కిందికి వస్తుంది. అలాగే ఏకాదశి, శివరాత్రి, కార్తీకమాసము, మొదలగు సర్వదినములలో ఉపవాసములు ఉండటం, భగవంతునికి పూజలు, ప్రతాలు, ధ్యానము, దేవుని కథలు వినడం, సత్సాంగత్యము, ఎల్లప్పుడు దైవధ్యానము అని కూడా తపోయజ్ఞము కిందికి వస్తాయి. వీటి వలన మనసు ఇంద్రియములు మన స్వాధీనంలో ఉంటాయి.

మూడవది యోగ యజ్ఞము అంటే యమము, నియమము, ఆననము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి వీటిని అష్టాంగములు అంటారు. వీటిని ఆచరించడం యోగ యజ్ఞము అంటారు. వీటిని ఎక్కువగా యోగులు, సన్యాసులు అవలంబిస్తారు.

నాలుగవది స్వాధ్యాయ యజ్ఞము. దీనిలో వేదములను అధ్యయనం చేయడం, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు చదవడం, అందలి అర్థమును గ్రహించడం, దానిని ఇతరులకు బోధించడం, అందులో చెప్పబడిన ధర్మములను ఆచరించడం. ఈ పనులన్నీ శ్రద్ధతో, భక్తితో చేయాలి కానీ ఏదో ప్రచారం కొరకు చేయాలి కాబట్టి చేయడం, చేయకూడదు. దీనిని స్వాధ్యాయ యజ్ఞము అని అంటారు.

తరువాతది జ్ఞానయజ్ఞము అంటే జ్ఞానమును సంపాదించడం. పైన చెప్పబడిన స్వాధ్యాయ యజ్ఞములో కేవలం శాస్త్రములు పురాణములు చదవడం మననం చేయడం, వల్లెవేయడం చేసే వారు వాటిలో ఉన్న అర్థములను, అంతరార్ధములను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడమే జ్ఞానయజ్ఞము. దానికి గురువు అవసరము, గురుకులములలో ముందు విద్యార్థి చేత వేదములు వల్లెవేయిస్తారు. అప్పుడే అర్థములు చెప్పురు. వేదములు కంఠతా వచ్చిన తరువాత ఒక్కొక్క శ్లోకానికి అర్థం వివరించి చెబుతారు. అలాగే చదివిన వాటిని అర్థం చేసుకోవడమే జ్ఞానయజ్ఞము అని అంటారు.

ఈ యజ్ఞములు అన్నీ మానవులు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఈ జన్మలో వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను అనుసరించి వారి వారి అభిరుచులను అనుసరించి, పై యజ్ఞములను ఆచరించాలి. దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. ముక్తికి మార్గం సులువు అవుతుంది. ఈ దిశగా ప్రయత్నం చేయడం మానవుల కర్తవ్యము. ఈ యజ్ఞములు చేసేవారిని యతయః అని అన్నారు. యతి అంటే సన్యాసి అని కాదు. సాధకుడు, చక్కగా ప్రయత్నించేవాడు అని అర్ధము. అంటే పైపైన సాధన చేయకుండా, ఏదో సాధించాలి అనే నిశ్రయాత్మక బుద్ధితో పట్టుదలతో చేయడం యత్నము అంటారు. ఆ యత్నమును ప్రకృష్టంగా చేస్తే అది ప్రయత్నము అవుతుంది. నిరంతరం యత్నము చేసేవాడు యతి.

ఈ శ్లోకములో ఆఖరున ఒక పదం వాడారు. సంశితవ్రతాః అంటే పైన చెప్పబడిన దానాలు ధర్మాలు, కర్మలు అన్నీ ధృడమైన సంకల్పంతో నిశ్చయంతో చేయాలి కాని పేరు కోసరం పేపర్లలో వేయించుకోడాని కోసరం చేయకూడదు. ఏదైనా పూజ, వ్రతం, చేసేటప్పుడు కఠోరమైన నియమాలను పాటించాలి. బాహ్యవిషయములను మనస్సులోకి రానీయకూడదు. అంతఃకరణ పరిశుద్ధంగా ఉండాలి. అలాకాకుండా ఏదో చేసాం అంటే చేసాం అని చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. ఇక్కడ దానము ధర్మము త్యాగము అంటే కేవలం ధనము ఆస్తి అని కాదు. ఇష్టమైన విషయములను కూడా త్యాగం చేయవచ్చును. దాని వలన మనస్సు పవిత్రం అవుతుంది. ఏ కార్యం చేసినా భక్తి శ్రద్ధ ప్రయత్నము ముఖ్యం. కాబట్టి ఏదో ఆషామాషీగా కాకుండా అన్ని నియమాలను పాటిస్తూ, చేసే పని మీద మనసు పెట్టి అంతఃకరణ శుద్ధిగా చేయాలి.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P266

No comments:

Post a Comment