Saturday, April 12, 2025

 *రాగద్వేషాలు*
*రచన - విజయారావు*
*(ఫోన్ 8897027778)*


"ఇవ్వాళ ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉందన్న సంగతి గుర్తుంది కదా? క్యారేజ్ కొంచం వేగంగా కట్టివ్వు" ఎందుకైనా మంచిదని,  లేచిన వెంటనే  వంట గదిలో బిజీగా వున్న  శ్రీమతికి గుర్తు చేశాడు శ్రీధర్.

"గుర్తుంది మహాశయా! మీరు స్నానం చేసి వచ్చే లోపల మీ క్యారేజ్ కట్టేస్తాను" అభయ హస్తం ఇచ్చింది అతని శ్రీమతి, సంధ్య , నవ్వుతూ.

కాలకృత్యాలన్నీ ముగించుకుని ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధమై శ్రీధర్ వచ్చేసరికి వేడి, వేడి సాంబార్ ఇడ్లీ టేబుల్ మీద సిద్దంగా వుంది. పక్కనే క్యారేజ్ కూడా కట్టేసి వుంది.  టిఫిన్ తినడం ప్రారంభించాడు శ్రీధర్.

"ఈ ప్రమోషన్ రాకపోతే మనకేమైనా నష్టం కలుగుతుందా? " కుతూహలంగా ప్రశ్నించింది సంధ్య.

" ప్రమోషన్ వస్తే జీవన స్థాయిని మరి కొంచం మెరుగు పరుచుకోవచ్చని ఒక చిన్న ఆశ.  అలాగే రిటైరైన తర్వాత పెన్షన్ డబ్బులు కూడా కొంచం పెరుగుతాయి. ప్రమోషన్ వలన జీతం పెంపుతో పాటు ఉద్యోగ భాధ్యతలు,  జవాబుదారీతనం కూడా పెరిగి,  ప్రతి మూడేళ్లకొకసారి ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. అందుకే ప్రమోషన్ మీద అంత ఆసక్తి చూపించటం లేదు. ఏమైనా మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఇంటర్వ్యూ కి వెళుతున్నాను. ఫలితం గురించి ఆందోళన ఏమాత్రం లేదు. ఏం జరిగినా అది మన మంచికే " టిఫిన్ ముగించి, చేతులు  కడుగుకోవడానికి లేస్తూ చెప్పాడు శ్రీధర్.

"హమ్మయ్యా!  ప్రమోషన్ రాకపోయినా మనం బాధ పడేది లేదన్న మాట. ఇలాంటి మనస్తత్వంతో ఇంటర్వ్యూ కి వెళ్ళడం ఒక విధంగా మంచిదే.  టెన్షన్ వుండదు"  కాఫీ కప్పు అందిస్తూ సంధ్య నవ్వింది. 

"నిజమే. టెన్షన్ లేదు కాబట్టే ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను" అంటూ కాఫీని ఆస్వాదించడం మొదలుపెట్టాడు శ్రీధర్. 

క్యారేజ్ అందుకుని ఆఫీసుకు బయలుదేరుతుంటే ...

"ఆల్ ద బెస్ట్" నవ్వుతూ సంధ్య విష్ చేసింది. సమాధానంగా చిరునవ్వు నవ్వి , మోటార్ సైకిల్ స్టార్ట్ చేసాడు శ్రీధర్.

పని విషయంలో శ్రీధర్ కు మంచి పేరున్నా ,
' లౌక్యం ' అనే మాట అతని డిక్షనరీ లో లేదు. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడతాడు. మంచిని ప్రోత్సహిస్తాడు, చెడును ఖండిస్తాడు.  నైతిక విలువలకు, సంస్థ యొక్క నియమాలకు పెద్ద పీట వేస్తాడు. అప్పుడప్పుడు పై అధికార్లు, స్వార్థంతో, తమ వర్గం  వారికి లబ్ది చేకూర్చడం కోసం, సంస్థ యొక్క నియమాలను అతిక్రమించమని మౌఖికంగా ఆదేశాలను ఇచ్చినా, అతనేనాడూ  వాటిని ఖాతరు చేయలేదు. మొండిగా కుదరదని చెప్పేసేవాడు.  ఒకరిద్దరు  మేనేజర్లు శ్రీధర్ వ్యక్తిత్వం నచ్చక, అతనిని ఇబ్బందులకు గురి చేసినా, సహనంతో వాటినెదుర్కొని, ఎట్టి పరిస్థితులలోనూ తాను లొంగేది లేదని వారికి పరోక్షంగా తెలియపరిచాడు. నీతి, నిజాయితీ గల అధికార్లకు మాత్రం శ్రీధర్ అంటే చాలా అభిమానం, గౌరవం.

జోనల్ ఆఫీసులో శ్రీధర్ ఇంటర్వ్యూ పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం రెండు గంటలయ్యింది.  ఇంటర్వ్యూ కమిటీ లో ఉన్న  ముగ్గురి దగ్గరా, లోగడ  పనిచేసి ఉన్నాడు శ్రీధర్.  అతని గురించి పూర్తిగా వాళ్ళకి తెలిసినా కూడా, వాళ్ళు సబ్జెక్ట్ మీద క్షుణ్ణంగా ప్రశ్నలు వేసి, సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే దాకా వదలలేదు. 

జోనల్ ఆఫీస్ లోనే క్యారేజ్ తిని బ్రాంచికి వెళ్ళేసరికి సాయంత్రం మూడు గంటలయ్యింది. మేనేజర్ గారు, మిగతా స్టాఫ్, కుతూహలంగా ఇంటర్వ్యూ గురించి ప్రశ్నలు వేశారు. అందరికీ ఓపికగా సమాధానాలు చెప్పి , తన పని చేసుకోవడం మొదలుపెట్టాడు శ్రీధర్.
----------------------+++++-------------------
"పాప గొంతు శ్రావ్యంగా వుంది. శృతి బద్దంగా స్వరాలు పలుకుతున్నాయి. సంగీతాన్ని చక్కగా అభ్యసిస్తుంది. ఈ సారి దసరా పండుగకు, మేము సమర్పించే టీ.వీ., 
ప్రోగ్రామ్ లో, పాప చేత ఏదైనా సోలో పెర్ఫార్మెన్స్ చేయిద్దాము" సంగీతం మాస్టారు శంకరం గారు, తమ పాప మృదుల గురించి చెబుతుంటే, సంధ్య మహదానందం పడిపోయింది. సంగీతం తాను కొంత వరకు నేర్చుకున్నా, మృదుల చేత  సంగీతంలో డిప్లొమా పరీక్ష రాయించాలని, అందుకు మొదటినుండి మంచి శిక్షణ నిప్పించాలని,  శంకరం మాస్టారు దగ్గర చేర్పించింది సంధ్య.

ఇంటికి రాగానే, శంకరం మాస్టారు 
మృదుల ను మెచ్చుకున్న సంగతి సంధ్య ద్వారా తెలుసుకున్న శ్రీధర్,  మృదులను దగ్గరకు తీసుకుని, గురువుగారి దృష్టిలో పడి ఆయన అభిమానాన్ని పొందినందుకు అభినందించి, సంగీతాన్నిప్పుడు మరింత దీక్షగా రోజూ అభ్యసించాలని, దానికి తల్లి సహకారం కూడా తీసుకొమ్మని సూచించాడు.

"అలాగే నాన్నా!" అంటూ  ఆనందంగా తల ఊపింది మృదుల.

"ప్రమోషన్ ఇంటర్వ్యూ ఎలా జరిగిందండి?" కుతూహలంతో ప్రశ్నించింది సంధ్య.

"బాగానే చేశాను.  ఇంటర్వ్యూ కమిటీ లోని వాళ్ళతో నాకు బాగా పరిచయం ఉన్నా కూడా వాళ్ళు  పద్దతిగానే ఇంటర్వ్యూ చేశారు.  ఏమీ రిలాక్స్ చేయలేదు"  నెమ్మదిగా చెప్పాడు శ్రీధర్.

"ఇంతవరకూ బాగానే జరిగింది, సంతోషం" అంటూ సంధ్య కూడా ఆనందించింది.
--------------------++++++-------------------
మృదుల ను బడి దగ్గర దింపి సంధ్య వెనుతిరిగబోతుంటే , ఎవరో పిలిచినట్లనిపించింది. వెనుకకు తిరిగి చూస్తే మృదుల క్లాస్ టీచర్ రమ గారు నవ్వుతూ కనిపించారు.

"గుడ్ మార్నింగ్!" విష్ చేసింది సంధ్య.

"వెరీ గుడ్ మార్నింగ్! మళ్ళీ లీవ్ వేకన్సీలో టీచర్ పోస్ట్ ఒకటి వచ్చింది. కిందటి సారి లీవ్ వేకన్సీ లో మీరిచ్చిన పర్ఫార్మెన్స్  నచ్చడం వలన, ప్రిన్సిపల్ గారు మీకేమైనా వీలవుతుందా అని ఒకసారి కనుక్కోమన్నారు" అని నవ్వుతూ చెప్పారు రమ గారు.

"తప్పకుండా! ప్రస్తుతం నేను ఖాళీగానే ఉన్నాను, థాంక్యూ" అంటూ సంధ్య తన సమ్మతి తెలపగానే... 

"పదండి" అంటూ రమ గారు,  ప్రిన్సిపల్ గారి గది వైపు  అడుగులు వేసారు.

ప్రిన్సిపల్ గారు, మెటర్నిటీ లీవ్ మీద వెళుతున్న టీచర్ ని పిలిపించి,  అప్పటిదాకా అయిన సిలబస్, ఇంకా మిగిలి ఉన్న సిలబస్, తదితర వివరాలు అడిగి తెలుసుకుని, ఎంత త్వరగా చేరితే అంత మంచిదని సంధ్యకు సూచించారు. రెండు రోజులు గడువు కావాలని కోరి వీడ్కోలు తీసుకుంది సంధ్య.
------------------++++++---------------------
"అమ్మా! సంగీతం మాస్టారు గారు నేను బాగా పాడటం లేదని, దసరా పండుగకు టీ.వీ., ప్రోగ్రామ్ లో ఇంకో పాప శ్రావ్య చేత సోలో పెర్ఫార్మెన్స్ ఇప్పిస్తానని చెబుతున్నారు" వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది మృదుల.

"ఏం జరిగిందో పూర్తిగా చెప్పు" అనునయంగా అడిగింది సంధ్య.

"నేను సరిగ్గా పాడటం లేదంటూ సంగీతం మాస్టారు గారు ఈ మధ్య కసురుకుంటున్నారు. 
నా కంటే శ్రావ్య బాగా పాడుతుందని మెచ్చుకుంటున్నారు" ఏడుపు దిగమింగుకుంటూ వెక్కిళ్లతో చెప్పింది మృదుల.

" పోనీలేమ్మా! ముఖం కడుక్కుని వచ్చి ఆ పాట ఒకసారి అమ్మకు వినిపించవూ" బ్రతిమలాడింది సంధ్య.

మృదుల తల్లి చెప్పినట్లే ముఖం కడుక్కుని, కాస్సేపు సేద తీరేకా, పాట ఎత్తుకుంది. తిడుతున్న  గురువుగారు పక్కన లేకపోవడం వలనో, లేక తల్లి పక్కన ఉందన్న ధైర్యం తోనో కానీ, అద్భుతంగా పాడింది మృదుల.  ఆశ్చర్యపోయి, ఇంకొక పాట పాడమని సంధ్య కోరింది.  రెట్టించిన ఉత్సాహంతో మృదుల ఇంకొక పాట అందుకుంది. ఆ పాట కూడా బాగా పాడేసరికి సంధ్య ఆలోచనలో పడింది.  తన ఆలోచనలు పైకి తెలియకుండా జాగ్రత్త పడుతూ...

"ఇప్పుడు పాడినంత ఫ్రీ గా మాస్టారు గారి దగ్గర కూడా పాడాలామ్మా! భయంతో పాడితే పాట సరిగ్గా రాదు" అంటూ మృదులకు నచ్చ చెప్పింది.

"నేనిలాగే అక్కడ కూడా బాగానే పాడానమ్మా! నిజం" అని మృదుల చెబుతుంటే ఏమనాలో తెలియక సంధ్య మౌనం వహించింది.

రాత్రి, మృదుల పడుకున్న తర్వాత, 
"ఈ మధ్య సంగీతం మాస్టారు గారు మృదులను సరిగ్గా పాడటం లేదని తిడుతున్నారంట. దసరా పండుగ కి సోలో పెర్ఫార్మెన్స్ ఇంకో పాప శ్రావ్యతో ఇప్పిస్తారట" శ్రీధర్ తో నెమ్మదిగా చెప్పింది సంధ్య.

"నువ్వొకసారి తన పాట వినలేక పోయావా? తప్పులేమైనా ఉంటే నువ్వు కొంచం సున్నితంగా చెప్పి సరిదిద్దగలవు  కదా!" నెమ్మదిగా చెప్పాడు శ్రీధర్.

"నేను పాడమని అడిగినప్పుడు ఏ తప్పులు లేకుండా, రెండు పాటలు అద్భుతంగా పాడిందండి" సమాధానమిచ్చింది సంధ్య.

మృదుల ఎంత బాగా పాడినా, తను కానీ, సంధ్య కానీ, అతిగా ఏ రోజూ పొగడలేదు. "బాగా పాడావు" అని మాత్రమే మృదులను ఉత్సాహపరిచేవాళ్లు. అలాంటిది ఈ రోజు 'అద్భుతంగా పాడింది' అని సంధ్య చెబుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు.  అంత బాగా మృదుల పాడుతుంటే సంగీతం మాస్టారు గారు ఎందుకు తిడుతున్నారో అర్థం చేసుకోలేక తికమక పడ్డాడు.

"పోనీ, నన్నొకసారి సంగీతం మాస్టారు గారిని కలవమంటావా? " ప్రశ్నించాడు శ్రీధర్.

"మీరొద్దులెండి.  నిదానంగా నేనే కనుక్కుంటాను.  జరిగిన సంగతి మీ దృష్టికి తేవాలని చెప్పాను. అంతే!" అని సంధ్య 
నిద్రకు ఉపక్రమించింది.
--------------------+++++---------------------
"సంధ్య గారూ!  ఆ మధ్య మెటర్నిటీ 
లీవ్ లో వెళ్లిన టీచర్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాబట్టీ ఇప్పుడు పెర్మనెంట్ వేకెన్సీ వచ్చింది.  మీరు ఒక అప్లికేషన్ పెట్టండి" ఫోన్లో మృదుల క్లాస్ టీచర్ రమ గారి గొంతు ఉత్సాహంగా వినిపించింది.

"అలాగేనండీ! థాంక్యూ!" సంధ్య తన కృతజ్ఞతలను తెలియపరచింది.

సంధ్య తో పాటు ఇంకో పది మంది ఆ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టడం, వారిని ప్రిన్సిపల్ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారం రోజులలో ఫలితాలు తెలియపరుస్తామన్నారు.
---------------------+++++-------------------
"ప్రమోషన్ ఫలితాలు వచ్చేసాయి. మన పేరు అందులో లేదోయ్. పని చేయడానికే నేను పనికివస్తాను కానీ ప్రమోషన్ కు పనికిరానని తీర్పిచ్చారు. అఫ్ కోర్స్ , ఇలాంటి ఫలితాలు మన విలువనేమీ తగ్గించలేవనుకో" నవ్వుతూ చెప్పాడు శ్రీధర్.

"ప్రమోషన్ రాకపోతే ఇతరుల ముందు మీరు ఎక్కడ చులకన అయిపోతారో అనుకునేదాన్ని. ఫలితాలకు, మీ విలువకు సంబంధం లేదని తెలిసి మనసుకు హాయిగా ఉంది. నిజం చెప్పాలంటే మీకెక్కడ ప్రమోషనొచ్చి  ఇక్కడనుండి ట్రాన్స్ఫరైపోతుందోనని ఇంతకాలం మనస్సులో చాలా బెంగగా ఉండేది.  ఇప్పుడు నిశ్చింతగా ఉంది"  అలవాటైన ప్రదేశం, పరిచయమున్న వ్యక్తులకు, దూరం  కావటంలేదని తెలిసిన తర్వాత సంధ్య గొంతులో ఆనందం ధ్వనించింది.

" సంగీతం మాస్టారు శంకరం గారికి శ్రావ్య వాళ్ళ నాన్న గారి రికమెండేషన్ మీద ఒక ప్రముఖ స్కూలో లో ఫుల్ టైం  మ్యూజిక్ టీచర్ ఉద్యోగం వచ్చిందంట. ఇందాక శ్రావ్య వాళ్ళ నాన్న గారు కనపడి మాటలలో ఈ విషయం చెప్పారు. మన మృదుల సంగీతం క్లాస్ మానేసినందుకు ఆయన బాధపడ్డారు. మృదుల బాగా పాడుతుందని వాళ్ళ శ్రావ్య చెప్పిందంట" ఏ భావాలు లేకుండా నిదానంగా శ్రీధర్ చెబుతుంటే ఆశ్చర్యంగా చూసింది సంధ్య.

"అదన్నమాట  శంకరం  మాస్టారి గారి ప్రవర్తనలో  మార్పుకు   కారణం" 
తన  మనస్సులోని  భావాలను దాచుకోలేకపోయింది సంధ్య.

"పోనీలే! ఒక విధంగా మొదట్లోనే ఇలా జరగడం మన మంచికే అనుకో. నీ దగ్గర 
పాప ఏ భయం లేకుండా ఇప్పుడు చక్కగా సంగీతం అభ్యసిస్తోంది కదా! పిల్లలకు అనువైన వాతావరణం కల్పించకపోతే వాళ్ళు ఏ రంగంలోనూ  రాణించలేరు. వీలు చూసుకుని మృదులను ఇంకో చోట సంగీతం క్లాస్ లో మళ్ళీ చేర్పిద్దాము" సముదాయించేడు శ్రీధర్.

సెల్ ఫోన్ మ్రోగితే ఎత్తింది సంధ్య.

"సంధ్య గారూ, మీ ఇంటర్వ్యూ ఫలితాలు ఇప్పుడే అనౌన్స్ చేశారు. మీరు సెలెక్ట్ అయితే బాగుండునని మేము, మీ పాఠాలు ఎంతో ఇష్టంగా వినే విద్యార్థులు కోరుకున్నాము కానీ, మా ఆశకు భిన్నంగా ఫలితాలలో ఇంకొకరి పేరు వుంది. ఎంక్వయిరీ చేస్తే ఆవిడ ప్రిన్సిపల్ గారికి  బంధువని తెలిసింది.  వెరీ సారీ సంధ్య గారూ" మృదుల క్లాస్ టీచర్ రమ గారి గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది.

"రాగద్వేషాలకు లోనై  ప్రతిభ, అర్హత ఉన్న వాళ్ళను అణచివేసి, అర్హత లేని వాళ్ళను అందలమెక్కిస్తే సమాజమెలా బాగుపడుతుందని , సమాజం 
బాగుపడకపోతే దేశమెలా అభివృద్ధి చెందుతుందని స్వాతంత్ర దినోత్సవం నాడు స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలిచ్చిన మీ ప్రిన్సిపల్ గారు కూడా  మానవ బలహీనతలకు అతీతులు కారెవరూ అని సగటు మనిషి గానే ప్రవర్తించారు. లీవ్ వేకన్సీలో పని చేయడానికి అర్హత ఉన్న నేను పెర్మనెంట్ వేకన్సీలో పనిచేయడానికి అనర్హురాలినైపోయానన్న మాట. పోనీలెండి, మనల్ని వద్దనుకునే వారి దగ్గర పనిచేసి ఇబ్బందులు పడే కంటే పని చేయకపోవడమే మేలు. మీ సహకారానికి ధన్యవాదాలు" అని ఫోన్ పెట్టేసింది సంధ్య . 

"బాగా చెప్పావు. రాగద్వేషాల వలన కొన్ని అవకాశాలు మన చేజారినా, మనలో నైపుణ్యము, పని చేయగల శక్తి  ఉంటే 
కాలమే ఏదో ఒక రోజు మనకు సరియైన గుర్తింపును తప్పకుండా తెచ్చిపెడుతుంది. నిరాశ , నిస్పృహలకు లోనుకాకుండా సహనాన్ని , ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని నీలోని నైపుణ్యాన్ని నిరంతరం పదును పెట్టుకో. సరైన అవకాశం రాలేదని భావించిన రోజున స్వయం ఉపాధి పధకం క్రింద నువ్వే 
ఒక ట్యూషన్ సెంటర్ పెడుదువు గానీ" పరిపక్వతతో శ్రీధర్ చెప్పిన మాటలు సంధ్యకు సాంత్వన చేకూర్చడమే కాక ఆమె యొక్క ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేశాయి.

             ************
దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను దిగువ ఫోన్ నంబర్ కి వాట్సప్ ద్వారా తెలియచేయండి *8897027778*

No comments:

Post a Comment