*లేత మనసులు*
*రచన - విజయారావు*
*(ఫోన్ 8897027778)*
"అమ్మా! ఇవ్వాళ నువ్వు చేసిన ఫ్రైడ్ రైస్ మా స్నేహితులకి ఎంత బాగా నచ్చిందంటే, నువ్వు వాళ్ళ కోసం వేరే డబ్బాలో పెట్టి ఇచ్చినది సరిపోక, నా వేపు ఆశగా చూస్తే, నేను నా డబ్బా కూడా వాళ్లకిచ్చేసి, వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్లు తిన్నాను " ఇంటికి రాగానే, ఆనందంగా బడిలోని సంగతులు తల్లికి చెప్పడం మొదలుపెట్టింది చిన్నారి మృదుల.
"అలాగా! మరి నీ డబ్బా వాళ్లకిస్తున్నప్పుడు నువ్వు బాధ పడలేదా? " కూతురిని సూటిగా ప్రశ్నించింది సంధ్య.
"లేదమ్మా! వాళ్ళు నీ వంటని మెచ్చుకుంటుంటే నాకు చాలా ఆనందం కలిగింది. నేను ఇంటికొచ్చాక తినగలను కదా అని నా డబ్బా కూడా వాళ్లకిచ్చేసాను" చేసిన ఘన కార్యం గొప్పగా చెప్పింది మృదుల.
"మంచి పని చేసావు. నువ్వు స్నానం చేసి వచ్చాక నీకు ఫ్రైడ్ రైస్ పెడతాను" కూతురు వంక మెచ్చుకోలుగా చూస్తూ చెప్పింది సంధ్య. హుషారుగా స్నానం చేయడానికి వెళ్ళిపోయింది మృదుల.
ఇంట్లో స్వీట్స్ చేసిన రోజు, ప్రత్యేకమైన వంటకాలు చేసిన రోజు, మృదుల స్నేహితుల కోసం వేరే డబ్బాలో పెట్టి ఇవ్వడం సంధ్యకు అలవాటు. సాధారణ రోజులలో మృదుల కు పెట్టే టిఫిన్, ఒక డబ్బాలోనే, కొంచం ఎక్కువ పెడుతుంది. తమ దగ్గర ఉన్నది ఇతరులతో కలిసి పంచుకుని తినడం వలన, పిల్లల మధ్య స్వార్థం తగ్గి, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని తన తల్లి తన చిన్నప్పుడు పాటించిన సూత్రాలను మరువకుండా ఆచరిస్తుంది సంధ్య.
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-
"అమ్మా! చదువుకోవడం అయిపోయింది. ఆడుకోవడానికి వెళ్ళొచ్చా? " సాయంత్రం
ఐదు గంటలు అయ్యిందని గోడ గడియారం చూపించగానే, వంట గదిలో పని చేసుకుంటున్న తల్లిని అడిగింది మృదుల.
"రాత్రి ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులలో తప్పులొచ్చాయంటే నేనూరుకోను. సందేహాలేమైనా ఉంటే ఇప్పుడే ఇంకోసారి చూసుకో " తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కూతురుని హెచ్చరించింది సంధ్య.
"నేను బాగానే చదువుకున్నాను.
నాకన్నీ వచ్చేసాయి" ఇంకో ప్రశ్నకి అవకాశమివ్వకుండా బయటకు తుర్రుమంది మృదుల. చిన్నగా నవ్వుకుంది సంధ్య. ఐదవ తరగతి సంవత్సరాంతపు పరీక్షలు వ్రాస్తుంది మృదుల. స్కూల్ వాళ్ళు ఎప్పటికప్పుడు పెట్టే పరీక్షల వలన కొత్తగా చదువుకోవలసినది ఇప్పుడు ఏమీ లేకపోయినా, సిలబస్ ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది.
భర్త శ్రీధర్ ఆఫీస్ నుండి వచ్చి , సోఫాలో విశ్రాంతి తీసుకుంటుండగా, రెండు కప్పులతో కాఫీ పట్టుకుని వచ్చింది సంధ్య. కాఫీ తాగుతూ, ఇద్దరూ మాట్లాడుకుంటుండగా,
"నాన్నా! ఇవ్వాళ కేరం బోర్డ్ ఆటలో నేనే గెలిచాను" ఇంట్లోకి వస్తూనే తండ్రిని చూసి ఆనందంగా చెప్పింది మృదుల.
"నిన్న షటిల్ గేమ్ లో కూడా నువ్వే గెలిచాననని చెప్పావు కదూ? " నవ్వుతూ కూతురిని ప్రశ్నించాడు శ్రీధర్.
ఇక తండ్రీ కూతుళ్లు, కబుర్లలో మునిగిపోతారని, ఖాళీ కప్పులు తీసుకుని, సంధ్య పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది.
"అవును. ఏ ఆటైనా గెలవాలనే పట్టుదలతో ఆడతాను కాబట్టి ఎక్కువ సార్లు నేనే గెలుస్తాను" గర్వంగా చెప్పింది మృదుల.
"ఆటలు అనేవి శారీరక వ్యాయామం, మానసిక ఉల్లాసం కోసం సృష్టించబడ్డవి. గెలుపు కోసం ప్రాకులాడకుండా ఆడితేనే ఉల్లాసం, ఆనందం దొరుకుతాయి. ప్రయోగాలు చేస్తూ, కొత్త కొత్తగా ఆడితేనే ఆట కూడా మెరుగుపడుతుంది" ఆటల గురించి సున్నితంగా కూతురికి హితబోధ చేసాడు శ్రీధర్.
"అమ్మో! ఆటలో ప్రయోగాలు చేస్తే ఓడిపోమూ? అప్పుడు స్నేహితులు వెక్కిరించరూ? " అమాయకంగా ప్రశ్నించింది మృదుల.
"ఓటమిని జీర్ణించుకునే శక్తి లేని వారికి ఆటలు ఆడే అర్హతే లేదు. ప్రతి సారీ తానే గెలవాలని భావించడం అవివేకం. ఆటలో ఎవరు తక్కువ తప్పులు చేస్తారో వారే గెలుస్తారు. ఓడిపోయిన వాళ్ళను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు" మృదువుగా కూతురి మనసులో ఓటమి అంటే ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేశాడు శ్రీధర్.
"మరి ఆటలో గెలిచిన వాళ్ళకే కదా బహుమతులు, పేరు ప్రతిష్టలు వచ్చేది? ఓడిపోయిన వాళ్లను పట్టించుకునే వాళ్ళెవరు? " కుతూహలంగా ప్రశ్న మీద ప్రశ్న వేసింది మృదుల.
"నిజమే. ఎవరెక్కువ విజయాలు సాధిస్తే , వారినే ఉత్తమ ఆటగాళ్లుగా ఈ ప్రపంచం గుర్తిస్తోంది, కానీ ఆటలో గెలవడం కన్నా , ఆటను చూస్తున్న ప్రేక్షకుల హృదయాలను గెలవడం మిన్న" ప్రజల మనసును గెలుచుకున్న వాడే అసలైన ఆటగాడు అని పరోక్షంగా చెప్పాడు శ్రీధర్.
"ఆటలో గెలవడం కంటే ఆట చూసే వారి మనస్సులు గెలుచుకోవడం గొప్పదా? " ఆశ్చర్యంగా తండ్రిని ప్రశ్నించింది మృదుల.
"అవును. నైపుణ్యం తో పాటు సత్ప్రవర్తన కూడా ఆటగాళ్లకు చాలా ముఖ్యం. గెలుపే ప్రధానంగా ఆడే క్రీడాకారులు ఓటమి ఎక్కడ తమకు సంభవిస్తుందో అనే భయంతో, తమలోని పూర్తి నైపుణ్యాన్ని ప్రదర్శించే సాహసం చేయలేక, అవసరమైనప్పుడు కూడా దూకుడుగా ఆడలేక, ప్రత్యర్థి చేసే తప్పు కోసం ఎదురు చూస్తూ, ఆటను రక్షించుకునే స్థితిలోనే ఆడడానికి ప్రయత్నిస్తారు" చెప్పడం ఆపి శ్రద్ధగా వింటుందా, లేదా అని ఒకసారి కూతురు వేపు చూసాడు శ్రీధర్.
మృదుల ఆసక్తిగా వినడం గమనించి ...
"అదే ఉత్తమ మైన క్రీడాకారులైతే, ఓటమికి భయపడక, అవసరమైనప్పుడు దూకుడుగా ఆడి, తమలోని పూర్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఎప్పుడూ వెనుకాడకుండా, ఆటలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ, ప్రత్యర్థి ప్రజ్ఞా పాటవాలను కూడా అవసరమైనప్పుడు మెచ్చుకుంటూ, ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు " ఉత్తమమైన క్రీడాకారులు ఎలా ప్రవర్తిస్తారో కూతురుకి
తెలియచెప్పాడు శ్రీధర్.
"నీ మాటలేవీ నాకర్ధం కావడం లేదు నాన్నా! " అయోమయంగా తండ్రి వైపు చూసింది మృదుల.
"ఇప్పుడు నీకర్థం కావు కానీ, నీ కంటే బాగా ఆడేవాళ్ళతో ఆడుతున్నప్పుడు , వారి ఆటలోని నైపుణ్యాన్ని గ్రహించు. నీ కంటే బాగా ఆడలేని వాళ్ళతో ఆడుతున్నప్పుడు ఆటలో ప్రయోగాలు చేసి, నీ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకో " ఆటలు ఆడే పద్ధతిని కూతురికి సూచించాడు శ్రీధర్.
"అలాగే నాన్నా! నువ్వు చెప్పినట్లే చేస్తాను" తండ్రి ఏం చెప్పినా తన మంచికే చెబుతాడని అర్థం చేసుకున్న మృదుల, తల ఊపుతూ చెప్పింది.
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-
మృదులను బడి దగ్గర దింపి, ఎప్పటిలాగే సంధ్య ఏవో జాగ్రత్తలు చెప్పబోతుండగా..
"అమ్మా! నాకు గుర్తుంది. ప్రశ్నాపత్రంలో నాకు బాగా వచ్చిన వాటికి జవాబులు ముందు వ్రాయాలి. మిగతా వాటికి నెమ్మదిగా ఆలోచించి, గుర్తుకు తెచ్చుకుని వ్రాయాలి. ఒకవేళ ఏ ప్రశ్నకైనా సమాధానం తెలియకపోతే బాధపడకుండా, ఎవరినీ అడగకుండా, దానిని వదిలేయాలి. ప్రతి పరీక్షకు ఇదే కదా చెబుతావు. నేనెలా మరచిపోతానమ్మా? " ప్రశ్నించింది మృదుల.
"పిల్లలకు పద్ధతులు నేర్పించేటప్పుడు పది సార్లు చెప్పవలసి వస్తుంది. వాళ్ళు అర్ధం చేసుకుని, ఆచరణలో పెడుతున్నారనే నమ్మకం కుదిరాక, చెప్పడం మానేస్తాము" సంధ్య నవ్వుతూ బదులిచ్చింది.
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-
"అమ్మా! సరళని వాళ్ళ పేరెంట్స్ వేరే స్కూల్లో చేర్పిస్తారంట" రిజల్ట్స్ చూసుకుని ఇంటికి రాగానే, ఒక మంచి స్నేహితురాలిని కోల్పోతున్నాననే బాధతో చెప్పింది మృదుల.
"కారణం ఏమిటో? " కూతురిని ప్రశ్నించింది సంధ్య.
"ఇక్కడ ఎప్పుడూ తనకి అరవై శాతం మార్కులే వస్తున్నాయని, సరిగ్గా చదువుకోవడం లేదని, కొత్త స్కూల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ కూడా ఆరవ తరగతి నుండే నేర్పిస్తారని, స్కూల్ మారుస్తున్నారు " వెంటనే సమాధానమిచ్చింది మృదుల.
"క్లాస్ లో మన పిల్లలు మాత్రమే వెనుకబడి ఉంటే, మార్చవలసినది మన పిల్లల మనస్తత్వాన్ని కానీ బడిని కాదు కదా?" తనని తాను ప్రశ్నించుకుంది సంధ్య.
"నీకెలా ఉంది ఈ స్కూల్?" ఎందుకైనా మంచిదని కూతురిని అడిగింది సంధ్య.
"అమ్మా! నాకు ఇక్కడ బాగానే ఉంది. మొదటి మూడు రాంకులలో నేను లేకపోయినా, నాకు ఎనభై శాతం మార్కులు వస్తున్నాయి. టీచర్లు బాగానే చెబుతున్నారు. ఎప్పుడూ పనిష్మెంట్లు ఇవ్వలేదు. మంచి స్నేహితులున్నారు. నీకు కూడా మా టీచర్లు అందరూ బాగా తెలుసు. అందువల్ల నేను స్కూల్ మారవలసిన అవసరం లేదు" స్పష్టంగా చెప్పింది మృదుల.
"సరేలే! ఈ సారి వేసవి సెలవులలో ఏమి నేర్చుకుందామని అనుకుంటున్నావు?" కూతురు ఇష్టాన్ని తెలుసుకునే నెపంతో టాపిక్ మార్చింది సంధ్య.
"స్విమ్మింగ్, కరాటే " టపీమని జవాబిచ్చింది మృదుల.
"ముందు స్విమ్మింగ్, యోగా నేర్చుకో. కరాటే నేర్చుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది. నువ్వు శారీరకంగా కొంచం ఎదిగిన తర్వాత నేర్చుకుంటే అప్పుడు బాగా వస్తుంది" అని కూతురికి నెమ్మదిగా నచ్చచెప్పింది సంధ్య.
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-
శ్రీధర్ పని చేస్తున్న ఆఫీసుకి కొత్తగా వచ్చిన మేనేజర్ గారు, స్టాఫ్ కుటుంబ సభ్యులను,
ఒక వేదిక పైకి తీసుకుని వచ్చి, వారి మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలనే సదుద్దేశంతో పిక్నిక్ ప్రోగ్రామ్ పెట్టీ, స్టాఫ్ అందరూ తమ తమ కుటుంబ సభ్యులతో తప్పనిసరిగా రావాలని కోరారు.
పిక్నిక్ స్పాట్ కి అందరూ ఇంచుమించు అనుకున్న సమయానికే రాగలిగారు. టిఫిన్లు, పరిచయాలు అయిపోయిన తరువాత చిన్న పిల్లలందరికీ రక రకాల ఆటల పోటీలు నిర్వహించారు. పిల్లలందరూ మృదుల కంటే ఒకటి, రెండు సంవత్సరాలు మాత్రమే పెద్ద వాళ్ళు. అందులో కొంత మంది మృదుల చదువుతున్న బడి లోనే చదువుతున్నారు.
పరుగు పోటీలో ఉద్రేకంతో పరిగెత్తిన ఇద్దరు పిల్లలు ఒకరినొకరు గుద్దుకుని పడిపోతే, వెంటనే పరుగును ఆపి, మృదుల, ఇంకొక అబ్బాయి పడిపోయిన వాళ్ళను లేవనెత్తారు. మిగతా పిల్లలు చలించకుండా, గెలుపు కోసం గమ్యం వైపు దూసుకు పోయారు. అదృష్టవశాత్తు నిర్వాహకులు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రాబట్టి, ఆ పిల్లల గాయాలకు మందు పూసారు.
క్విజ్ కార్యక్రమంలో తమ పిల్లలు నెగ్గడానికి, కొంత మంది తల్లిదండ్రులు నియమాలను ఉల్లంఘించి మరీ తెర చాటు సహాయం చేశారు.
మ్యూజికల్ చైర్స్ పోటీలో నిర్వాహకులు ఆట నియమాలను పదే పదే గుర్తు చేస్తున్నా కూడా
కొంత మంది పిల్లలు గెలవడమే ముఖ్యోద్దేశ్యంగా పెట్టుకుని, నియమాలకు నీళ్ళిచ్చేసారు. ఎవరితోనూ గొడవలుపడకుండా మృదుల అన్ని పోటీలలోనూ ఉత్సాహంగా పాల్గొంది. బహుమతి గెలుచుకొకపోయినా బాధ పడలేదు. పోటీలలో ఓడిపోయిన ఇతర చిన్నారులలో కొందరు బిక్క మొహం వేసుకుని ఉంటే, మరి కొందరు దుఃఖం పెల్లుబికి బావురుమన్నారు. తల్లిదండ్రులు ఆ పిల్లలను ఓదార్చలేక నానా ఇబ్బందులూ పడవలసి వచ్చింది.
భోజనాల దగ్గర పిల్లల ప్రవర్తన చూస్తే తల్లిదండ్రుల మీద జాలి కలుగుతుంది ఎవరికైనా.
"బాబోయ్! ఇది కారంగా ఉంది, నాకు వద్దు"
"నాకిది నచ్చదని నీకు ముందే తెలుసు కదా?"
"నాకు నాన్ వెజ్ కావాలి. ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే పెట్టారు"
రకరకాలుగా పిల్లలు మారాలు చేస్తుంటే, వాళ్ళను సముదాయించలేక నానా అవస్థలూ పడుతూ, వాళ్ళకి తిండి తినిపించే సరికి పగటిపూటే చుక్కలు కనిపించాయి తల్లిదండ్రులకు.
భోజనాల దగ్గర పేచీ లేకుండా, తనకు కావలసినవి మాత్రమే తల్లిని అడిగి పెట్టించుకుని తింది మృదుల.
భోజనాలు అయ్యాక ఆడవాళ్ళు అందరూ బాతాఖానీ వేసుకుంటూ, మధ్యలో పిల్లల పెంపకం విషయం వస్తే , ఒకావిడ క్రమశిక్షణకు తానెంత ప్రాముఖ్యతనిస్తుందో వివరంగా చెబితే, మరొకావిడ తన పిల్లలకి చదువులో ఒక రాంక్ తగ్గినా తానెలా కాంప్రొమైజ్ అవ్వదో గొప్పగా చెప్పింది. ఇంకొకావిడ తన పిల్లలకి చదువులోనూ, ఆటలలోనూ ఎన్ని బహుమతులు వచ్చాయో గర్వంగా చెప్పింది. మరొకావిడ తన పిల్లల టిఫిన్ ను బడిలో ఇతర పిల్లలు తినేస్తున్నారని, అలాంటి పిల్లలు సరైన పెంపకంలో పెరగటం లేదని వాళ్ళ తల్లిదండ్రులను విమర్శించింది. వాళ్ళ సంభాషణను మౌనంగా వింటున్న సంధ్య ఒకసారి మృదులను అక్కడ ఉన్న పిల్లలతో పోల్చి చూసుకుని, తమ పెంపకం సరైన దిశ లోనే సాగుతుందని ఆనందించింది.
సాయంత్రం హౌసి ఆటను పిల్లలు, పెద్దలు, ఆనందంగా ఆడుకున్నారు. తర్వాత అందరినీ అలరించడానికి మృదుల మైక్ తీసుకుని ఒక భక్తి గీతం పాడింది. అందరూ మృదులను మెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఇటువంటి కుటుంబాల కలియక ఒకటి తప్పకుండా పెట్టుకోవాలని స్టాఫ్ అంతా ఒక నిర్ణయం తీసుకున్నారు.
విడిపోయే ముందు ఆటలలో గెలిచిన పిల్లలకు బహుమతి ప్రధానం చేశారు. ఆట నియమాల ఉల్లంఘనలను గత్యంతరం లేని పరిస్థితులలో నిర్వాహకులు ఆమోదించి, ఎవరెలా గెలిచినా, వారినే విజేతలుగా ప్రకటించారు.
మంచైనా, చెడైనా, పెద్దలను చూసే పిల్లలు నేర్చుకుంటారన్న ప్రాథమిక సూత్రాన్ని మరచిన ఒకాయన, ఆట నియమాలను ఉల్లంఘించక పోవడం వలనే మృదులకు బహుమతి రాలేదన్న సంగతి గమనించకోకుండా ...
"చొరవగా ముందుకు దూసుకుని పోయేటట్లు మీ పాపని పెంచండి. లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం ఎంత కష్టమో మీకు తెలుసు కదా? చూడండి మా వాడు చురుకుగా ఉండబట్టే క్విజ్ లోనూ, ఆటల పోటీలలోనూ బహుమతులు సాధించి బెస్ట్ ఆల్ రౌండర్ గా నిలిచాడు" అంటూ చనువు తీసుకుని శ్రీధర్ కు ఒక ఉచిత సలహా నిచ్చాడు , తన పిల్లాడు క్విజ్ పోటీలో బహుమతి గెలవడానికి తను చేసిన తెర చాటు సహాయాన్ని , మ్యూజికల్ చైర్స్ పోటీలో తన కొడుకు నియమాలకు నీళ్ళిచ్చేసిన సంగతి ఇతరులు గమనించి ఉండరని భ్రమిస్తూ.
అప్పటికే మృదుల ప్రవర్తనకు ఇతర పిల్లల ప్రవర్తనకు ఉన్న తేడా గమనించి తమ పెంపకం పట్ల సంతృప్తి చెందిన శ్రీధర్, అతనితో వాదించకుండా, కాలమే ఎవరి పెంపకం మంచిదో నిర్ణయిస్తుందని నమ్మి , మర్యాద కోసం మాత్రం "అలాగేనండీ" అంటూ తల ఊపాడు.
*****************
దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను దిగువ ఫోన్ నంబర్ కి వాట్సప్ ద్వారా తెలియచేయండి
*8897027778*
No comments:
Post a Comment