రామనామము ఇంత మధురంగా ఉండడానికి కల కారణం
ఎంతో అనుభవించి ఉంటేగాని ఈ ప్రశ్న అడిగగలిగే అవకాశం లేదు
అందుకని అభినందనలు
ఆ మాధుర్యం పంచిపెట్టాలని ప్రశ్న గా అడిగారని అనిపిస్తోంది కాబట్టి మరీమరీ నమస్కృతులు
ఈ రామనామం ఇంత మధురంగా ఉంటుంది అని ఎంతో మంది అప్పటి రామదాసు ఆయనేకాదు పేరుపెట్టిన వశిష్టుడు ఎందరో ఋషులు చెప్పారు
రమ ఇతి రామః రమింపజేసేది రామనామం తెలియకుండానే మనసు ఆనందం తో నిండిపోతుంది
రామో విగ్రహవాన్ ధర్మః అన్న మారీచుడు రామనామం పలుకుతుంటే ఎక్కడనుంచి వచ్చి కొట్టేస్తాడో అని భయపడినా పలకకుండా ఉండలేకపోయాడు
కదళీ ఖర్జూరాది ఫలములకన్ననూ అధికమౌ నీనామమేమి రుచిరా అన్న వాడు ఎందుకు అది మధురమో చెప్పలేకపోయాడు
పేరుపెట్టిన వశిష్టుడు ఈతడు తన నామంతో తరింపజేస్తాడన్నాడేమో కానీ ఎందుకో చెప్పలేదు
మరి ఎవరిని అడగాలీ
పేరు పలుకుతూనే ప్రాణం వదిలేసిన దశరధుణ్ణడుగుదామంటే నా కొడుకు కదా అంటాడు నీకు నలుగురు కదయ్యా కొడుకులంటే తెల్లమొహం వేస్తాడేమో
ఋషుల్నడిగితే తరింపజేస్తాడు కాబట్టి అందుకు అంటారు అయ్యో ఆయన పరబ్రహ్మమండీ ఆయన గాకింకెవరూ అంటే జవాబు చెప్పలేక ధ్యానంలోకెళ్ళిపోతారేమొ
పోనీ గుహుణ్ణడుగుదామా అంటే నాఫ్రెండు కదా అందుకూ బలేవాడివయ్యా మా ఫ్రెండు కాదా అంటే పకపకా నవ్వేస్తాడేమో
హనుమనడుగుదామా అంటే నోరుమూసుకుని జపం చేసుకో ఎందుకురా టైమ్ వేస్టు చేస్తావూ ఈ లోపు ఓ వందసార్లైపోయేవి కదా అని కోప్పడతాడు సో డోంట్ డిస్టర్బ్
త్యాగయ్య గారిని పట్టుకుందాం అంటే ఎందుకు చెప్పలేమో ఓకీర్తనగా పాడేస్తాడు మన సంగీత కారులంతా పెన్ను పేపరూ పుచ్చుకుని లిరిక్సూ ట్యూన్స్ూ చూసుకోడం కోసం చుట్టూ మూగేస్తారు మరి నాలాటి సంగీతం తెలియని వాడికి స్థానం లేదని తోసేస్తారు
బోల్డు దిగులేసి ఇంత పెద్దాళ్ళే చెప్పలేకపోతే ఇవ్వాళ శివరాత్రి కదూ అందరికంటే పేద్ద భక్తుడు శివయ్య నవ్వేసి ఇలా అంటాడేమో
ఒరే పిచ్చి సూరీ చెరుకుని బెల్లాన్నీ ఇంత తీపెందుకని అడిగారాఎవరైనా అలా అడిగితే ఏవంటారూ అలా పిచ్చి చూపులు చూడక తొందరగా తినేయ్ అంటారా మరి
అందుకే రామనామం జపిస్తూ అలా మాధుర్యం అనుభవించేయడమే కారణాలు శోధిస్తే కాలం గడిచిపోతుంది
అనుభవించేయ్
డా సూర్యనారాయణ వెన్నేటి
No comments:
Post a Comment