Thursday, April 9, 2026

 ఆదిమధ్యాంతాలు లేని ఆత్మ ఉనికిని ఎవరు ఎప్పుడు ఎలా కనుగొన్నారు? వివరాలు పంచుకోండి.


మోక్షస్య కారణం సాక్షాత్

తత్వజ్ఞానం ఖగేశ్వరా" " - గరుడపురాణం

" మోక్షానికి కావలసినది ఆత్మజ్ఞానమే.‌ ఇది లేకుండా ఎన్ని వేదాలు, శాస్త్రాలు చదివినా సత్కర్మలు చేసినా ప్రయోజనం లేదు. ఆత్మజ్ఞానం లేకుండా యజ్ఞాలు యాగాలు చేయడం గాడిదలు గంధపుదుంగలు మోసుకుంటూ వెళ్ళడం లాంటిది. గంధపు సుగంధం గాడిదలకు తెలియదు అని. ఉపవాసం చేసి దేహాన్ని బాధపెట్టడం పాము చావాలని పుట్టను కొట్టడం లాంటిది. పాము ఆత్మ, పుట్ట దేహం. ముందు ఆత్మజ్ఞానం పొందు " అన్నారు విష్ణువు గరుత్మంతుడితో.

ఈ ఆత్మజ్ఞానం గురించి వేల సంవత్సరాల క్రితమే మన కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తులలో విస్తారంగా వివరించబడింది.

ఈ విషయాలు గమనిస్తే మన ఋషుల విద్వత్తు, పరిశీలనా శక్తి ఎంత అద్భుతమో అర్ధమవుతుంది.

కఠోపనిషత్తులో ఆత్మతత్త్వాన్ని గూర్చి యమధర్మరాజు నచికేతుడికి అద్భుతమయిన విషయాలు తెలియచేశారు:

శాశ్వతమైనది ఆత్మేనని, అది అణువుకన్నా చిన్నదని, అతి పెద్దదానికన్నా పెద్దదని, సూర్యచంద్రాదులు కూడా దాన్ని ప్రకాశింపజేయజాలరని, అది స్వయం ప్రకాశమైనదని, జీవి శరీరంలో ఉన్నప్పుడు అంగుష్టమాత్రంగా హృదయకుహరంలో జ్యోతి వలె ఉంటూ శరీరాన్ని చైతన్య పరుస్తుందని యముడు ఆత్మస్వరూపాన్ని వివరించారు.

నైతిక విలువలను పాటిస్తూ, శ్రేయోమార్గంలో పయనిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది. అప్పుడు ఇంద్రియాలను బాహ్యవిషయాల నుండి మరలించి అంతర్ముఖం చేసి సాధన చేస్తే ఆత్మావలోకనం సాధ్యమవుతుంది. అయితే ఇది అంత సులభమైనది కాదు. కత్తిమీద సాము లాంటిది. అందుచేత, " మేలుకో. ఉద్యుక్తుడవు కమ్ము. లక్ష్య సిద్ధి అయ్యే వరకు ఆగకు " అని తెలియచేసారు యముడు.

మనోబుద్ద్యహంకారాల మీద, నైతిక విలువల మీద ఇంకా అనేక మౌలిక విషయాల మీద చర్చించి సదుపదేశాన్నిచ్చిన సమగ్రమైనది కఠోపనిషత్తు.

మరణానంతరం మిగిలేది ఆత్మ అని తెలియచేస్తూంది ఈ ఉపనిషత్తు.

కేనోపనిషత్తు " ఇంద్రియాలకు అగోచరమైన ఆత్మను మనో బుద్ధులతో తెలుసుకోగలమా? " అంటే అసాధ్యం అంటుంది. శాస్త్ర జ్ఞానంతో కూడా అసాధ్యం అంటుంది. ఏకాగ్రతతో ధ్యానం చేసి బ్రహ్మసాక్షాత్కారం చేసుకోవాలని బోధిస్తుంది.

మరి పరమాత్మను తెలుసుకోవాలంటే ఏమేమి సాధనాలు కావాలి? అంటే

తపస్సు, శమదమాది సద్గుణాలు సాధనాలుగా ఉండాలి అని తెలియచేస్తూంది ఈ ఉపనిషత్తు. తపస్సు అంటే నిరంతర, కఠిన సాధన.

ప్రశ్నోపనిషత్తు " ఆత్మన ఏష ప్రాణో జాయతే (3.2) " - ప్రాణం ఆత్మ నుండే జనిస్తుంది అని తెలియచేస్తూంది.

యచ్చిత్తస్తేనైష ప్రాణమా

యాతి, ప్రాణస్తేజసా యుక్తః

సహాత్మనా యథా సంకల్పితం

లోకం నయతి " - 3.10

" మరణ సమయంలో ఎటువంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతోనే ముఖ్య ప్రాణం సూక్ష్మశరీరంలో ప్రవేశిస్తుంది. ఆ ఆలోచనకు అనుగుణమైన జన్మ లభిస్తుంది. అందుచేత మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి " అని తెలియచేస్తూంది ఈ ప్రశ్నోపనిషత్తు.

ముక్తి లభించే సమయం ఆసన్నమైనప్పుడే ఈ ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉంటుందని తెలుస్తూంది.

శుభమస్తు

No comments:

Post a Comment