Thursday, April 9, 2026

*విసనకర్ర*

పూర్వపు రోజుల్లో ఒకతను విసనకర్రల్ని అమ్ముతూ ప్రతిరోజూ రాజప్రాసాదం ప్రక్కనుంచి వెళ్తూ ఉండేవాడట. 

తను అమ్మే విసనకర్రలు ఎంతో గొప్పదనీ, అధ్భుతమైనవనీ గొప్పగా వర్ణించేవాడు. ఇంత గొప్ప విసనకర్రల్ని ఇంతవరకూ ఎవ్వరూ కనీ వినీ ఏరుగరని గొప్పలు చెప్పేవాడు.

ప్రపంచంలోని అన్ని దేశాల నుండీ రకరకాల విసనకర్రల్ని అప్పటికే సేకరించి ఉంచుకున్న రాజు గారికి ఈ మాటలు కుతూహలాన్ని రేకెత్తించాయి. 

ఈ కొత్త విసనకర్రలు ఎలా ఉంటాయో చూద్దామనుకుని రాజు గారు వరండాలోకి వచ్చి క్రిందికి తొంగిచూశారు. 

అవి మామూలు విసనకర్రల్లాగే ఉన్నాయి ఏ ప్రత్యేకతా ఆయనకు కనిపించలేదు. ఒక ఆజా విలువ కూడా చెయ్యడని ఆయనకు అనిపించినా విసనకర్రల్ని అమ్మేవాణ్ణి పైకి రమ్మన్నాడు "ఏమిట్రా వీటి ప్రత్యేకత? వీటి ధరెంత?" అని అడిగారు.

"దణ్ణాలు మారాజా! ఇవి చవకేనండీ. ఇవి గొప్ప విసనకర్రలు కాబట్టి ధర ఎక్కువ చెప్పడం లేదండీ. ఒక్కోటి వంద రూపాయలు మాత్రమేనండీ!"

ధర విని రాజు గారు ఆశ్చర్యచకితులయ్యారు "వంద రూపాయలే?! ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి విసనకర్రలు కానీకి ఒకటి, దమ్మిడీకి ఒకటి దొరుకుతున్నాయి. నువ్వు వంద రూపాయలు అడుగుతున్నావు! ఏంట్రా నీ విసనకర్రల గొప్పతనం?"

"ఇవా స్వామీ! ఇవి బహుగొప్పవండీ వందేళ్ళు పనిచేస్తాయని నేను హామీ ఇస్తున్నానండీ. వంద సంవత్సరాలు వాడినా ఇవి చెడిపోవండీ!"

"వీటిని చూస్తుంటే ఇవి ఒక్క వారం కూడా పనిచెయ్యవని నాకు అనిపిస్తోంది. నన్నే మోసగిద్దామనుకుంటున్నావా? ఇంత మోసమా? పైగా రాజు దగ్గరా?"

విసనకర్రలు అమ్మేవాడు వినయంగా ఇలా అన్నాడు 

"మిమ్మల్ని మోసగించేటంతోణ్ణా మహారాజా? నేను రోజూ మీ ప్రాసాదం ప్రక్కనుంచే వెళ్తూ ఉంటానని మీకు బాగా తెలుసు కదా స్వామీ! ఈ విసనకర్ర ధర వందరూపాయలే. ఇది గనక వందేళ్ళు పనిచెయ్యకపోతే పూచీ నాది, నేనెప్పుడూ ఈ వీధుల్లోనే కదా తిరుగుతూ ఉంటాను, నేనెక్కడికి పోతాను సామీ? మిమ్మల్నే మోసం చేస్తే నేను కుశలంగా ఎలా ఉంటాను మహారాజా?"

వాడు అడిగిన డబ్బిచ్చి రాజు గారు ఓ విసనకర్రను కొనుక్కున్నారు. అమ్మేవాడి మీద రాజు గారికి ఏ మాత్రం నమ్మకం లేకపోయినా వాడి ధీమా ఏమిటో చూద్దామని రాజు గారికి కుతూహలం రెట్టింపు అయ్యింది. ఒక వారం తరువాత మళ్ళీ తనకు కనిపించమని వాడ్డి అజ్ఞాపించి రాజు గారు వాణ్ణి పంపించేశారు.

మూడురోజుల్లోనే విసనకర్ర మధ్యలో ఉండే బద్దీ ఊడి వచ్చేసింది. వారం పూర్తిగా తిరక్కముందే విసనకర్ర నామరూపాల్లేకుండా నాశనమైపోయింది.
రాజు గారు ఏడోరోజు ప్రొద్దున్నే సరిగ్గా చెప్పిన వేళకే అతను దగ్గరకొచ్చినమస్కారం పెట్టేసరికి  ఆశ్చర్యపోయాడు.

"దండాలు మారాజా, మీ సేవకుణ్ణి"

రాజు గారికి ఒళ్ళు మండిపోయింది "పోకిరీ వెధవ! మూర్ఖుడా! చూడు. నీ విసనకర్ర అక్కడ ముక్కలు ముక్కలై పడి ఉంది. వారం రోజుల్లో దీని పరిస్థితి ఇలా తయారైంది. ఇది వందేళ్ళ ఖచ్చితంగా పనిచేస్తుందని పూచీ కూడా యిచ్చావు. నిజం చెప్పు నువ్వు పిచ్చోడివా, లేకపోతే మహా మోసగాడివా?"

విసనకర్రలు అమ్మేవాడు వినయంగా జవాబిచ్చాడు, "మీరు గొప్పోళ్ళు సామీ! కానీ ఈ విసనకర్రను ఎలా ఉపయోగించాలో మీకు తెలిసినట్లు లేదు. ఇది నిజంగా నూరేళ్ళు ఉండాలి. దీనికి పూచీ ఉంది కూడా. దీన్ని మీరు ఎలా వాడారు సామీ?"

"ఓరి దేవుడా! విసనకర్రను ఎలా  వాడాలో కూడా నేను నేర్చుకోవాలన్న మాట.

"కోపం వద్దు సామీ! ఏడు రోజుల్లో ఈ విసనకర్ర ఇలా తయారయ్యింది. ఎందుకని? మీరు దీన్ని ఎలా వాడారు సామీ?"

రాజు గారు మరో విసనకర్రను పుచ్చుకుని కాస్సేపు విసురుకుని చూపించారు.

"అదీ సంగతి మహారాజా, దాన్ని అలా వాడకూడదు!"

"ఇంకెలా విసురుకోవాల్రా దీంతో!"

"చెప్తా సామీ, విసనకర్రను కదలకుండా పట్టుకోవాలి. ముఖం ముందు దాన్ని స్థిరంగా పట్టుకుని తలను అటూ-ఇటూ, ఇటూ అటూ తిప్పాలి. 

*విసనకర్ర వందేళ్ళు ఉంటుంది.*

 మీరు పోవచ్చు కానీ విసనకర్ర మాత్రం బాగానే ఉంటుంది. విసనకర్ర తప్పేమీ లేదు. మీ పద్ధతే తప్పు. విసనకర్రను పట్టుకుని తల మాత్రం తిప్పాలి. నా విసనకర్ర తప్పు చెయ్యదు తప్పు మీదే విసనకర్రది కాదు."
*****

తననే తప్పు పట్టేటప్పటికి రాజుగారికి  తలతిరిగి పోయింది. వాణ్ణి ఏమీ అనలేక వదిలిపెట్టాడు.

No comments:

Post a Comment