Wednesday, June 10, 2026

 మరణం మరణిస్తుంది – 2
మరణం మానవుని శత్రువు కాదు. నిత్యం మనల్ని నీడగా ఆంటుకుని నడిచే సహచరుడు. మన దేహం అశాశ్వతమని ప్రతి క్షణం గుర్తుచేస్తూ, జనన–మరణాల పరంపర, చివరి మజిలీ చేరే వరకూ, కంటికి రెప్పలా మన వెంట నడుస్తూ, మనలను మన అసలు ఇంటికి — పరమగమ్యానికి — చేర్చే మార్గదర్శి మరణమే. మన ప్రయాణం పూర్తయిన తర్వాత దాని పని ముగుస్తుంది. అప్పుడు మరణం కూడా మరణిస్తుంది.

ఈ భావనను చాలామంది ఆధ్యాత్మికవాదులు ప్రశ్నించవచ్చు. “మరణం ఎలా మరణిస్తుంది?” అని సందేహించవచ్చు. ఆధ్యాత్మిక సత్యాలకు శాస్త్రప్రమాణం అవసరమే. అలాంటి ప్రమాణం ఉన్నప్పుడే వాటిని సత్యంగా అంగీకరించగలం.

అందుకే సాక్షాత్తు భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుని అంతిమ ఘడియలను పరిశీలిస్తే, ఈ సత్యం మరింత స్పష్టమవుతుంది. మహాభారతంలోని మౌసల పర్వం,శ్రీకృష్ణుని మరణాన్ని, ఎంతో హృదయవిదారకంగా వర్ణిస్తుంది.

దూరాన ద్వారక ఉంది. మరింత దూరంలో ఒక తపోవనం ఉంది. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు.

అదే సమయంలో ద్వారకలో ఆయన తండ్రి వసుదేవుడు పరమపదించాడు. అంత్యక్రియలు ఆలస్యం చేయలేని పరిస్థితి. బలరాముడు అక్కడ లేడు. శ్రీకృష్ణుడు కూడా అందుబాటులో లేడు. అందువల్ల బంధుమిత్రుల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని అర్జునుడే నిర్వహించాడు.

అంత్యక్రియలు ముగిసిన తరువాత, ఈ విషాదవార్తను శ్రీకృష్ణునికి స్వయంగా తెలియజేయాలని అర్జునుడు తపోవనం వైపు బయలుదేరాడు. అడవులలో వెతికాడు. రెండు రోజుల పాటు అలసట తెలియకుండా తిరిగాడు.

చివరకు ఒక చోట శ్రీకృష్ణుడు కనిపించాడు.
కానీ…ఆయనలో ప్రాణం లేదు. అది శ్రీకృష్ణుని శవం. ఆ దృశ్యం చూసి అర్జునుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది నిజంగా శ్రీకృష్ణుని దేహమేనా అని కూడా నమ్మలేకపోయాడు.అప్పటికే ఒక బోయవాని బాణం ఆయన పాదంలో తగిలి, శ్రీకృష్ణుడు దేహత్యాగం చేసి నాలుగు–ఐదు రోజులు గడిచిపోయాయి.

ద్వారక అప్పటికే సముద్రంలో లీనమవడానికి సిద్ధమవుతున్నది. అందువల్ల ఆ దేహాన్ని అక్కడికి తీసుకెళ్లే అవకాశం లేదు. చివరికి అర్జునుడు అక్కడే అత్యంత నిరాడంబరంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఎలాంటి రాజసంబరాలు లేవు. ఎలాంటి వైభవం లేదు. ప్రపంచాన్ని నడిపించిన మహానుభావుడికి ప్రకృతి ఇచ్చిన వీడ్కోలు మాత్రమే ఉంది.

ఎనిమిది మంది భార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, అపారమైన బలగం, అఖండమైన కీర్తి కలిగిన శ్రీకృష్ణుని అంత్యక్రియల సమయంలో, ఆయన పక్కన నిలిచింది అర్జునుడు ఒక్కడే. తండ్రి వసుదేవుడికి ఇద్దరు కుమారులు ఉన్నా, వారి చేతుల మీదుగా అంత్యక్రియలు జరగలేదు.

ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది.మరణం ముందు బంధాలు, అధికారాలు, సంపదలు, కీర్తిప్రతిష్ఠలు అన్నీ పరిమితమైనవే. కాలం నిర్ణయించిన క్షణం వచ్చినప్పుడు, ప్రతి జీవి ఒంటరిగానే ఆ ద్వారం దాటాలి.

భగవద్గీతలో మరణ రహస్యాన్ని బోధించిన శ్రీకృష్ణుడు, తాను బోధించిన సత్యాన్నే తన జీవితంలో ఆచరించి చూపించాడు. మరణాన్ని భయంకరమైన సంఘటనగా కాక, పాము కుబుసం విడిచినట్లు ఆత్మ దేహాన్ని విడిచే సహజ ప్రక్రియగా మన ముందుంచాడు.

అందుకే మరణం అంతం కాదు; అది ఒక మార్పు మాత్రమే. జీవుని ప్రయాణం పూర్తయినప్పుడు మరణం తన కర్తవ్యాన్ని ముగిస్తుంది. ఆ క్షణంలో, మరణం కూడా మరణిస్తుంది.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment