Wednesday, June 10, 2026

 మధ్యే మార్గం(Middle Path)

మధ్యే మార్గం అంటే మధ్యలో (మధ్యస్తంగా ) జీవించే జీవన విధానం. అదే ఉన్నతమైన జీవన మార్గమని పత్రీజీతో సహా పలువురు ఆధ్యాత్మిక వేత్తలు మనకు బోధించారు.భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా మధ్యే మార్గాన్ని గురించి ప్రస్థావించాడు. 

జీవితం ఒక అల లాంటిది. అల మద్యమ స్థానం నుండి పైకి లేచి పొంగుతుంది. మరు క్షణం మద్యమ స్థానాన్ని తాకుతుంది. తరువాతి క్షణంలో కిందికి కుంగుతుంది.  ఇలా ఆటు పోటులతో అల ముందుకు సాగుతుంది. మద్యమ స్థానాన్ని మరువకుండా ఎగుడు దిగుడులను అల అనుభవిస్తుంది. 

ఇదేవిధంగా మన మద్యమ స్థానాన్ని మరువకుండా, మనం జీవించ గలిగితే, మనుషుల మధ్య ఉంటూనే, సన్యాస  దశకు వెళ్లకుండానే మనిషి ఋషిగా మారవచ్చు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించ వచ్చు.

ఒకవైపు అఖిల భోగాలను అనుభవించాలని కోరుకునే రాగ ప్రవృత్తి, మరోవైపు సకల భోగాలను త్యజించాలని కోరుకునే వైరాగ్య నివృత్తి. సంఘ జీవనం గడిపే వ్యక్తికి ఈ రెండూ అభిలషణీయం కాదు.అందుకనే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే శ్లోకం ఆవిర్భవించింది.

వీణ తీగలను బాగా బిగిస్తే అవి తెగిపోతాయి. వాటిని చాలా వదులుగా ఉంచితే విడి పోతాయి. సంగీతం సరిగా పలకదు. సరైన మద్యమ స్థితిలో వాటిని  ఉంచినప్పుడే మధురమైన స్వరాలను మనకి వినిపిస్తాయి.మన జీవితం కూడా అంతే. భోగాల పేరుతో దేహాన్ని అతిగా సుఖ పెట్టడం వల్ల భోగ లాలత్వం నిన్ను వాటికి బానిసను చేస్తుంది. క్రమ శిక్షణ పేరుతొ దేహాన్ని అతిగా కష్ట పెట్టడం  వల్ల సుఖ రాహిత్యం అలవాట్లను  ఎక్కువ కాలం నిలువకుండా చేస్తుంది. మనసు ఇంద్రియాలను ఎదురు తిరిగేటట్లు చేస్తుంది.

లావుగా వున్న వాళ్ళు సన్నగా అందంగా మారాలని అతిగా వ్యాయామం చేసి, అతిగా ఆహార నియంత్రణ చేసి వడి వడిగా బరువు  తగ్గుతారు. కానీ ఆ బరువు తగ్గుదల దీర్ఘ కాలం నిలవదు. మళ్ళీ శరీరం మరియు ఇంద్రియ సహకారం లోపించి విపరీతంగా తింటూ, అసలు వ్యాయామం చేయకుండా ఇదివరకు కంటే ఎక్కువ లావు అవుతారు. ఇందుకు కారణం మధ్యే మార్గాన్ని పాటించక పోవడం వల్లే అన్న విషయం వారు అర్థం చేసికోరు.

మధ్యే మార్గం అంటే మనల్ని బలహీనులను చేసే రాజీ వ్యవహారం కాదు; అది వివేకంతో కూడిన బలమైన దీర్ఘ కాలిక సమతుల్య జీవనం. అతిశయాలను విడిచిపెట్టి, సత్యాన్ని, శాంతిని, ఆత్మజ్ఞానాన్ని అన్వేషించే మార్గం.

మధ్యే మార్గం అనేది కేవలం ఆహారం, నిద్ర, పని వంటి బాహ్య విషయాలలో మాత్రమే కాదు; ఆధ్యాత్మిక సాధనలో కూడా అవసరం. అధిక ఆనందంలో మునిగిపోవడం ఎంత ప్రమాదమో, అధిక దుఃఖంలో కూరుకుపోవడం కూడా అంతే ప్రమాదం. విజయాన్ని చూసి గర్వపడకుండా, అపజయాన్ని చూసి నిరాశ చెందకుండా ఉండడం ఆధ్యాత్మిక  మధ్యే మార్గానికి ఉదాహరణ.

ఆధ్యాత్మిక దృష్టిలో మధ్యే మార్గం అంటే ద్వంద్వాలను అధిగమించడం. మంచి-చెడు, లాభం-నష్టం, గౌరవం-అవమానం వంటి జంటల మధ్య చిక్కుకోకుండా అంతర్గత సమత్వాన్ని నిలుపుకోవడం. ఆ సమత్వమే యోగమని భగవద్గీత బోధించింది.

మధ్యే మార్గాన్ని అనుసరించే వ్యక్తి, జీవితాన్ని తిరస్కరించడు; అలాగే జీవితానికి బానిస కూడా కాడు. అతను ప్రపంచంలో జీవిస్తాడు,  కానీ ప్రపంచం అతనిలో జీవించనివ్వడు. అతను సంపదను ఉపయోగిస్తాడు, కానీ సంపదకు బానిస కాడు. అతను సంబంధాలను ప్రేమిస్తాడు, కానీ ఆసక్తి బంధనాలలో చిక్కుకోడు.

ప్రకృతిని పరిశీలిస్తే కూడా మధ్యే మార్గం కనిపిస్తుంది. నది తన రెండు తీరాల మధ్య ప్రవహించినప్పుడు జీవనదిగా మారుతుంది. తీరాలను దాటి ప్రవహిస్తే వరద అవుతుంది. అలాగే మన కోరికలు, భావోద్వేగాలు, ఆశయాలు వివేకపు తీరాల మధ్య ప్రవహించినప్పుడు జీవితం అందంగా ఉంటుంది. కానీ అవి పరిధులు దాటిన నాడు జీవితం అంధకారమవుతుంది.

మధ్యే మార్గం మనకు శాంతిని ఇస్తుంది. శాంతి నుండి స్పష్టత వస్తుంది. స్పష్టత నుండి జ్ఞానం పుడుతుంది. జ్ఞానం నుండి విముక్తి లభిస్తుంది. విముక్తి నుండి ముక్తి ప్రాప్తిస్తుంది.

అందువల్ల మధ్యే మార్గం కేవలం ఒక జీవన విధానం కాదు; అది ఆత్మవికాసానికి, అంతర్ముఖతకు, పరమసత్యానుభూతికి దారి తీసే ఆధ్యాత్మిక మార్గం. అతిశయాల అంధకారాన్ని విడిచి సమతుల్యత వెలుగులో నడిచే వాడే నిజమైన సాధకుడు,శోధకుడు.

సమతుల్యతా సాధనా వాహనాన్ని సరి అయిన మార్గంలో  నడిపించే జంట గుర్రాలు;  జ్ఞానం,ధ్యానం.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment