Wednesday, June 10, 2026

 (సం)బంధాలు గురించి తెలుసుకుందాం.

బంధం మరియు సంబంధం మధ్య సున్నితమైన తేడా ఉంది. బంధం అనేది ఇద్దరు వ్యక్తులను దగ్గర చేస్తుంది. కానీ కేవలం బంధం, ఇద్దరి వ్యక్తులను దగ్గరగా ఉంచ లేదు. ఉదాహరణకు పెళ్లి ఇద్దరి వ్యక్తులను దగ్గరగా చేరుస్తుంది. కానీ ఇద్దరు మనుషులు దగ్గర కావాలంటే ఈ బంధం సరిపోదు. మనుషులతో పాటు మనసులు దగ్గర కావాలి. మనసులు దగ్గర కావాలంటే బంధం సంబంధంగా మారాలి. ప్రేమ, నమ్మకం, అవగాహనలతో గట్టిపడినప్పుడు బంధం సంబంధంగా వికసిస్తుంది. కానీ సంబంధాన్ని నిలబెట్టుకోవడం ఒక కళ.  సంబంధాలను సజీవంగా ఉంచుకొని, రోజు రోజుకి పెంచుకొని, పిల్లలతో పంచుకోగలిగితే ,మానసిక సంబంధాలు ఆత్మీయ అనుబంధాలుగా మారతాయి. 

మానసిక సంబంధం ఆత్మీయ అనుబంధంగా మారాలంటే కొన్ని సూత్రాలను పాటించాలి. 
మొదటగా, ఎదుటి వ్యక్తిని వారు ఉన్నట్లుగానే అంగీకరించాలి. వారిని మన అభిరుచులకు, ఆలోచనలకు అనుగుణంగా మార్చాలని ప్రయత్నించడం, అనేక సమస్యలకు కారణమవుతుంది. ఈ ప్రపంచంలో అతి కష్టమయిన పని ఎదుటి వారిని నీకు అనుగుణంగా మార్చడం. సంబంధాలలో అధిక అంచనాలు ఒత్తిడిని సృష్టిస్తాయి. అంచనాలు నెరవేరనప్పుడు నిరాశ, బాధ, అసంతృప్తి కలుగుతాయి. అందుకే ఆశలను తగ్గించి, అంగీకారాన్ని పెంచుకుంటే పగలు తగ్గి , ప్రేమలు పెరుగుతాయి. 

స్నేహితుల మధ్య అపార్థాలు సహజం. ఒకే మాటను ఇద్దరు వ్యక్తులు తమ తమ మనస్తత్వం, అనుభవం, భావోద్వేగాల ఆధారంగా వేర్వేరుగా అర్థం చేసుకోవచ్చు. కోపంలో ఉన్నప్పుడు అనేక అనగూడని మాటలు అనుకోకుండా ఆవేశం రూపంలో బహిర్గతమవుతాయి. మాటలు అనిన మనిషి ‘ఆవేశంలో అన్నాను’ అంటాడు. మాటలు పడిన మనిషి  ‘నిజంగానే అన్నావు’ అంటాడు. అన్న వ్యక్తి ‘పొరపాటు’ అని చెప్పటానికి ప్రయత్నించినా పడ్డ వ్యక్తి అది ‘నీ అలవాటు’ అంటాడు. అందుకే మాటల కంటే మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యo.

మనం ఒక పెంపుడు కుక్కను తెచ్చుకొని పెంచుకుంటాం. కంటికి రెప్పలాగా తనను ప్రేమతో కాపాడుకుంటాం. కోపంతో ఒక సారి కొరికింది అనుకుందాం. అంత మాత్రాన ఆ కుక్కను వదిలించుకోవడానికి ప్రయత్నించం.అలా ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అవసరయితే డాక్టర్ దగ్గరకు తీసుకెళతాం. 

నోరు లేని జంతువులతో ఆలా ప్రవర్తించే మనం, నోరు,మనసు, బుద్ధి ఉండి కూడా తోటి మనుషులతో ఆలా ఎందుకు ప్రవర్తించ లేక పోతున్నాం? ఎందుకు ప్రేమించ లేక పోతున్నాం? ఎందుకు క్షమించ లేకపోతున్నాం?.  కారణం జంతువులలో లేకుండా, మనుషుల్లో ఉండే ఒకటి మనలో ఉండటమే. దాని పేరే అహం (ego).

మానవ సంబంధాలలో అహంకారం ప్రవేశించినప్పుడు, అది ఇద్దరినీ వ్యతిరేక దిశలకు లాగుతుంది. అప్పుడు దూరం పెరుగుతుంది. వారిలో అహం శృతి మించినప్పుడు అది వారిలో, పగ, ప్రతీకారంగా మారుతుంది. పగ ప్రతీకార జ్వాలలు మనసులో ఎగిసి పడే సమయంలో వాటితో  అవతల వ్యక్తిని కాల్చి వేయాలనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో ఇవతలి వ్యక్తి కాలిపోవడం జరుగుతుంది. కానీ “క్షమించు”, “మన్నించు”, అనే చిన్న చిన్న పదాలు, ఒక కౌగిలింత, ఒక కరచాలనం వంటి ప్రేమ పూర్వక చర్యలు, ఆ దూరాన్ని కరిగించగలవు. అహం నిర్మించిన గోడలను ప్రేమ కూల్చివేయగలదు.అహం సృష్టించిన ఆగాధాన్ని ప్రేమ పూడ్చివేయగలదు.

ఎదుటి వ్యక్తిని పూర్తిగా అంచనా వేయడం చాలా కష్టం. అవతల వ్యక్తిపై మన అవగాహన ఎల్లప్పుడూ సంపూర్ణం కాదు. వ్యక్తిగత తీర్పు చాలాసార్లు ఏకపక్షంగా ఉంటుంది. అన్ని కోణాలను తెలుసుకోకుండా నీకు నీవే ఇచ్చుకునే తీర్పు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.

మన చర్యలు ఇతరుల ప్రవర్తనపై ఆధారపడకూడదు. ఇతరుల చర్యలకు ప్రతిస్పందనగా చేసే పని ప్రతిచర్య. కానీ అవగాహనతో, స్వచ్ఛందంగా చేసే పని చర్య.
ప్రతిచర్య సమస్యలను జటిలం చేస్తుంది. చర్య పరిష్కారాలను సులభం చేస్తుంది.  ప్రతిచర్య అంటే ద్వేషంచే మనిషిని ద్వేషంచడం. చర్య అంతే ద్వేషించిన మనసుని ప్రేమించడం. ఎదుటి వ్యక్తి ప్రేమ చూపకపోయినా ప్రేమించడం ఉత్తమ వ్యక్తిత్వం. ముల్లుగుచ్చుకుందని గులాబీని ద్వేషంచo. దానిని కోసిన తరువాత కూడా అది తన సువాసనను వెదజల్లుతుంది. అలాగే నిజమైన ప్రేమ ప్రతిఫలం కోసం ఎదురు చూడదు.

గట్టి గొట్టాన్ని విరగగొట్టడం కంటే వంచడం ఎంతో సులువైన  పని. అలాగే సంబంధాన్ని తెంచుకోవడం కంటే దాన్ని పెంచుకోవడం తెలివైన పని. విలువైన పని.

సంబంధాలను కాపాడుకోవడానికి, మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక భాగమే. అవి మనకు ప్రేమ, త్యాగం, ఓర్పు, సహనం, క్షమాగుణం వంటి అమూల్యమైన గుణాలను నేర్పిస్తాయి. ఆ గుణాలు పెంచుకోవడానికి ధ్యానం జ్ఞానం సహకరిస్తాయి.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment