Wednesday, June 10, 2026

 మరణం మరణిస్తుంది . అది ఎలాగో తెలుసుకుందాం.

ఈ విశ్వంలో రెండు విషయాలు అందరిని సమానంగా చూస్తాయి. ఒకటి కాలం, రెండు మరణం. దేశాధ్యక్షుడికైనా, బిక్షాటకుడికైనా, ధనికుడకైనా, దరిద్రుడికైనా కాలమరణాలు రెండూ ఒకటే. అధికారంలో తేడా ఉన్నా అందరికీ ఉండేది రోజుకి ఇరవై నాలుగు గంటలే. ధనంలో, మదంలో హెచ్చు తగ్గులు ఉన్నా అందరం చివరకి చేరవలసింది  మరణ తీరానికే. అందుకే యముడికి మరియొక పేరు కాలుడు.అందుకే మరణించిన వారిని ‘కాలం చేసారు’ అంటాం.

కాలం మనిషిని తనతో చేతులు కలిసి నడవమంటుంది. కాలంతో చేతులు కలిపి నడిచే వాడు నిత్యం వర్తమానంలో ఉంటాడు. వర్తమానంలో ఉండటమంటే ధ్యాన స్థితిలో ఉండటమే. అంటే కాలంతో చేతులు కలిపి నడిచే వ్యక్తి నడిచే నిత్య ధ్యానిగా మారతాడు.

మరణం మనిషిని ఎప్పుడూ తన వెంటే ప్రక్కనే 
నడవమంటుంది. మరణాన్ని పక్కన పెట్టుకుని నడిచే వాడు నిత్యం చైతన్యంతో ఉంటాడు.  చైతన్యంతో ఉండటమంటే ఆత్మ స్థితిలో ఉండటమే. మరణమనేది ఎల్లప్పుడూ మన పక్కనే నడుస్తూ మనల్ని భయంనుంచి రక్షించే పెంపుడు శునకం లాంటిది. . మరణం పక్కలో  బల్లెం కాదు. “మనం శాశ్వతం”, అనే ఆలోచనకు కళ్లెం. నిత్యం మన ప్రక్కనే నడుస్తూ మన దేహం యొక్క అశాస్విత తత్వాన్ని  గుర్తుచేస్తూ, ఇల్లు చేరే దాక కంటికి రెప్ప లాగా కాపాడుతూ, మనo పుట్టిన ఇంటికి చేర్చి, ఆ తరువాత తనూ మరణిస్తుంది. అందుకే శునకానికి (కుక్కకి) మరియొక పేరు కాలభైరవుడు.

మన పెంపుడు శునకానికి మన పేరు తెలియదు. మన ఆర్ధిక స్థితి గతులు తెలియదు. తన యజమాని 
లక్షాధికారా? లేక బిక్షాధికారా? అని ఆలోచించదు. ప్రేమిస్తే నీ పక్కనే నడుస్తుంది. ప్రతి విషయంలో నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. మరణం కూడా అంతే.

మరణం తృటిలో లో తప్పి పోయిన ప్రమాదాలు (నాతో సహా), ప్రతి వారి జీవితంలో చాలా ఉంటాయి. వాటిని తప్పించిది దేవుడు అనుకుంటాం. ఆది నిజం కాదు. నిత్యం నీ పెంపుడు శునకం లాగా నీతో కలిసి నడిచే నీ మరణమే. నీతో వున్న కాల భైరవుడే నిన్ను మరణం నుంచి తప్పించాడు.

నీవు ఇల్లు చేరే వరకూ, బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులే కాదు, అష్ట దిక్పాలకులు నీకోసం వచ్చినా మరణమనే కాల భైరవుడు అడ్డుకుంటాడు. కానీ కాల గమనంలో నీవు చేరవలసిన ప్రదేశం చేరిన తరువాత విస్వేశ్వరుడు వచ్చి వద్దని వారించినా పక్కకు తోస్తాడు. యమ ధర్మాన్ని 
తూ చా  తప్పకుండా పాటిస్తాడు. నిన్ను నీ గమ్యానికి చేర్చి, నీకు అమృతత్వాన్ని కల్పించి, మరణుడు మరణిస్తాడు.

మరణానికి నీ కుటుంబం గురించి తెలియదు. నీ పిల్లల గురించి తెలియదు. నీవు దేవుడివా? జీవుడివా? అన్న విషయంకూడా ఆలోచించదు. ప్రదేశం గురించి 
పట్టించుకోదు. నీ దేహం యొక్క అంతిమ ఘడియలకు ఆ ప్రదేశం అనువైనదా కాదా అని కూడా యోచించదు. అది ఇల్లా, ఎడారా,నీరా, ఆకాశమా,అంతరిక్షమా అనేవి ఏవీ తనకు అవసరం లేదు. తనకు కావాల్సిందల్లా సమయం. కాల చక్రమనే కాలమానంలో, కాల యానంలో రావలసిన సమయం వచ్చిందా లేదా అనేదే తను పట్టించుకునే విషయం. కాయ పండుగా మారిందా లేదా అనేదే తన ఆలోచన. రాలే సమయం ఆసన్నమైందా లేదా అన్నదే తన యోచన.

ఇది నిజమా కాదా అని చాలామంది ఆధ్యాత్మిక వాదులకు అనుమానం రావచ్చు. ఆధ్యాత్మిక సత్యాలు అన్నింటికీ శాస్త్ర ప్రమాణం ఉండాలి. అది ఉంటే ఇది సత్యం అని నమ్మొచ్చు. అందరి హృదయాలను తట్టి లేపే ఒక శాస్త్ర ప్రమాణంతో మరణం దృష్టిలో దేవుడు జీవుడి సమానమని నిరూపించే ఒక చక్కని జరిగిన కధతో, రేపటి ప్రసాదంలో రుజువు చేసుకుందాం.

ఆచార్య డా అనిల్ ప్రసాద్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment