Wednesday, June 10, 2026

 కష్టం సుఖం ఈ రెండు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.

“చిన్నప్పుడు కష్టపడితే పెద్దయ్యాక సుఖపడవచ్చు” అని తండ్రి చెప్పిన మాటను నమ్మి చిన్ననాటి నుంచే ఎంతో శ్రమపడ్డాడు ఒక కొడుకు. కానీ పెద్దయ్యాక కూడా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, “నాన్నా! నీవు చెప్పింది తప్పు కదా?” అని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్న వెనుక ఒక అమాయకత్వం దాగి ఉంది. “నేను కష్టపడాల్సిన బాధ్యతను నిర్వర్తించాను; ఇప్పుడు సుఖపడటం నా హక్కు” అనే భావన అతనిలో కనిపించింది. ఆ హక్కును విశ్వం తనకు అందకుండా అడ్డుకుంటోందనే భావంతో, అతను తండ్రికి విశ్వంపైనే ఫిర్యాదు చేశాడు.

“ధ్యానం చేయి” అని తండ్రి చెప్పితే, “నాకు దైవంపై నమ్మకం పోయింది” అంటున్నాడు. “సమస్యను ధైర్యంగా ఎదుర్కో” అంటే, “నా శక్తి సరిపోవడం లేదు” అంటున్నాడు. కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం, ఈ కష్టాల నుండి ఎలా బయటపడతాడో అన్న ఆందోళన, ఆ తల్లిదండ్రుల హృదయాలను కలవరపెడుతున్నాయి. క్రమంగా కష్టం మనోవ్యథగా మారుతోంది.

“నేను కష్టం అనే ధర చెల్లించాను; మరి సుఖం అనే ఫలితం ఎందుకు దక్కలేదు?” అనే ఒక వ్యాపార దృష్టికోణం, శారీరకంగా మరియు మానసికంగా ఎదిగినా, ఆధ్యాత్మికంగా ఇంకా పరిపక్వత పొందని ఆ పసి హృదయంలో మొలకెత్తింది.

అప్పుడు వారి తరఫున నేను విశ్వాన్ని ప్రశ్నించాను. “ఈ ఫిర్యాదుకు నీ సమాధానం ఏమిటి?” అని ధ్యానంలో విశ్వాన్ని నిలదీశాను. అప్పుడు విశ్వం నాకు అందించిన జవాబే ఈ రోజు మీ ముందున్న ఈ ‘ప్రసాదం’.

విశ్వం ఇలా చెప్పింది:
“కష్టం అంటే నీవు అనుకున్నది జరగకపోవడం. సుఖం అంటే నీవు అనుకున్నది అనుకున్నట్లే జరగడం. నీవు నీ స్వంత అభిప్రాయాల ఆధారంగా మంచి–చెడులను నిర్ణయించుకుంటావు. గత జన్మలను మరచిపోతావు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తావు. భవిష్యత్తునే దృష్టిలో ఉంచుకుని, నీ చుట్టూ నీవే ఒక పరిధిని గీసుకుని, దాని లోపల నుంచే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావు.

కానీ విశ్వం అలా ఆలోచించదు.
అది నీ గత కర్మలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ జన్మలో నీ మనో–వాక్కాయ కర్మలను గమనిస్తుంది. వాటికి అనుగుణంగా నీ భవిష్యత్తు మార్గాన్ని నిర్మిస్తుంది. అవసరమైతే మార్పులు, చేర్పులు కూడా చేస్తుంది.

నీ దృష్టిలో నీవు ఒక్క వ్యక్తివి. కానీ విశ్వం దృష్టిలో నీవు ‘వసుధైవ కుటుంబకం’ అనే విశాల కుటుంబంలోని ఒక సభ్యుడివి.

నీ కష్టానికి కారణం చాలాసార్లు నీకు కనిపించని గతంలో దాగి ఉంటుంది. నీ సుఖానికి విలువ, అది వచ్చినప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తావో దానిపై ఆధారపడి ఉంటుంది.

నీకు వచ్చిన కష్టం శాశ్వతం కాదు. నీకు వచ్చిన సుఖం కూడా శాశ్వతం కాదు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఈ రెండింటి మధ్య ఉన్న ఆనంద తత్వాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే, కష్టాలు కాలచక్రంలో కలిసిపోతాయి; సుఖాలు సుఖసాగరంలో కరిగిపోతాయి.

నీ కష్టాలకు దేవుడో, మరెవరో కారణమని నిత్యం నిందించడం మానివేయి. కష్టాన్ని ఓర్పుతో, నేర్పుతో ఎదుర్కొని, కడిగిన ముత్యంలా దాని నుండి బయటకు రా. ఆ కష్టం నేర్పిన పాఠాన్ని నీ జీవితంలో ఆచరించి, ఇతరులతో పంచుకో. అప్పుడు ఆ కష్టమే నీకు ఒక ఆధ్యాత్మిక గురువుగా మారుతుంది.

కష్టాన్ని కష్టంగా మాత్రమే చూస్తే నష్టపోయేది నీవే. దానికి ఒక కారణం ఉందని గ్రహించు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడానికి ప్రయత్నించు. దానిని ప్రారబ్ధ కర్మ ప్రక్షాళనగా స్వీకరించు. కర్మల కాష్టంలో గత కర్మలను దహనం చేయగలిగితే, ఆ ధునిలో శోకం అంతరించి, శ్లోకం అవతరిస్తుంది. ఆ శ్లోకమే — ‘అహం బ్రహ్మాస్మి’.

ఈ ప్రారబ్ధ కర్మ దహన ప్రక్రియ కొత్తది కాదు. ఎందరో మహాత్ములు ఈ మార్గంలో నడిచారు. తీవ్రమైన శారీరక బాధలను కూడా ఆధ్యాత్మిక అవకాశాలుగా స్వీకరించి, తమ కర్మలను దహనం చేసుకుని, కడిగిన ముత్యాలవలె ప్రకాశించారు. అందుకే వారు యుగయుగాల పాటు మన హృదయాలలో జీవిస్తున్నారు.

గుర్తుంచుకో —
ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది.
ప్రతి సుఖానికి ఒక ఫలితం ఉంటుంది.
ప్రతి కష్టానికి ఒక గతం ఉంటుంది.
ప్రతి సుఖానికి ఒక భవితవ్యం ఉంటుంది.

కారణం లేని, ఫలం లేని, గతం లేని, భవిష్యత్తు లేని ఒకే ఒక్క స్థితి ఆనందం. ఆనందాన్ని నీకు అందించగలిగినవి రెండే రెండు. అవి  జ్ఞానం మరియు ధ్యానం.

– ఆచార్య డా. అనిల్ ప్రసాదం
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment