పలుకులు బంగారమైతే ఆత్మీయులకు కొదవ ఏముంటుంది. దీని గురించి రెండు సంఘటనల ద్వారా తెలుసుకుందాం.
మనిషికి ధనం, బలం అన్నీ ఉన్నా బలగం అంటే- స్వజనం దూరమవడానికి కారణం ఏంటన్న సందేహం వేధిస్తుంటుంది కొందరిని. అదుపు లేని మాటల వల్లే ఆ పరిస్థితి తలెత్తుతుంది. 'నీ మాట నిశ్శబ్దాన్ని మించినదైతే తప్పకుండా మాట్లాడ'మన్నారు మహాత్ములు. 'వాచాలత్వం లేని వాక్సంపద వల్ల అంతా శుభమే' అని బోధించారు అన్న మయ్య.
జీవితంలో సమస్త సంపదలూ ఉన్నా, మనశ్శాంతి కరవవడానికి మూలకారణం మాటల తీరు కావచ్చు. ప్రకృతికి ఒక నియమం ఉంది. అది సమస్త జీవరాశితో సహా మానవులకూ వర్తిస్తుంది. నీటి పాత్రలో రాళ్లు వేసి నేలమీద పోసినప్పుడు నీరు భూమి లోకి ఇంకిపోతుంది. కఠినమైన రాళ్లు అలాగే మిగిలిపోతాయి. మనిషి జీవనయాత్ర ఆ జలం లాంటిది. అన్నీ అంతర్ధానమవుతాయి. కానీ నోటినుంచి వెలువడిన కఠినమైన మాటలు మాత్రం జనం గుండెల్లో ఇంకి పోకుండా కలకాలం నిలిచిపోతాయి.
ఒక మహారాజు ప్రజలకు విందు ఏర్పాటు చేశాడు. అదే రోజున ఒక గృహస్థు కూడా తన ఇంట్లో పూజలు చేసుకుని విందుకు రావాలని ఆత్మీయులను ఆహ్వానించాడు. రాజు ఇంటి విందుకు వెళ్లినవారిలో కొందరు మళ్లీ ఈ గృహస్థు ఇంటికి వచ్చారు. కోటలో సేవకులు విసుగుతో పెట్టిన భోజనం వారికి రుచించలేదు. గృహస్థు ఆత్మీయమైన పలక రింపుతో వడ్డించిన మామూలు ఫలహారం అమృత సమానమై వారికి సంతృప్తినిచ్చింది. మధురమైన సంభాషణ పంచభక్ష్య పరమాన్నాలకన్నా మిన్న.
లంకలో సీతమ్మను చూసి వచ్చిన హనుమంతుడు తొలిమాటగా 'చూశాను సీత మ్మను' అని రాముడి ఆందోళన ఉపశమించేలా పొందికైన పదాలతో చెబుతాడు. అటు వంటి పలుకులు మనసులను రంజింపజేస్తాయి. మనోధైర్యాన్నిస్తాయి. చాణక్యనీతిలో శుభ వాక్యాల వివరణ ఉంది. ఒక దుకాణంలో వృద్ధురాలు గాజు సామాను కడుగు తుండగా ఒక పాత్ర చేజారి వేలికి గాయమైంది. ఆ వయసులో ఆమెకు అది కష్టమైన పనే అయినా భుక్తికోసం చేస్తోంది. యజమాని కోప్పడి పనిలోనుంచి తీసేస్తాడని భయ పడింది. కానీ అతడు 'అవ్వా, విశ్రాంతి తీసుకో. ఈరోజు నీకు ఎక్కువ శ్రమ ఇచ్చాను' అనగానే ఆమె ఆనందంతో 'ఏం ఫర్వాలేదయ్యా పని పూర్తిచేసి కూర్చుంటాను' అని చెప్పింది.
మనసెరిగి పలికే మాటలలో మహత్తు ఉంటుంది. మనం ఏదిస్తే అదే పదింతలై తిరిగి వస్తుందని ఆర్యోక్తి. ప్రేమాస్పద పలుకులు ఉత్సాహాన్నిస్తాయి. మృదు సంభాషణ వలన సమస్యలెన్నో సమసిపోతాయి. కార్యసాధకులు మార్దవంగా మాట్లాడతారు. రమణ మహర్షి తమ సందేశాలలో మౌనం, సహనశీలత గొప్పవని, సత్యం చెబుతూనే, మృదువుగా చెప్పమన్నారు. పలుకు బంగారమైతే ఆత్మీయులకు కొదవే ముంటుంది?! అందరి హృదయాలలో ప్రేమ వనం కుసుమించి పరిమళిస్తుంది.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment