☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
113. నిర్దురర్మణ్య ఊర్జా మధుమతీ వాక్
శక్తిమంతమైన మన మధుర వాక్కు ఎప్పుడూ దుష్టత్వాన్ని పొందకుండుగాక (అథర్వవేదం)
‘వాక్ పురుషో రసః' - అని ఉపనిషద్వాక్యం. మానవుని సారం వాక్కు. అతని ప్రాణ, బుద్ధి, శరీర సంస్కారాలు వాక్కు ద్వారా వ్యక్తమవుతాయి. వాక్కును
సంస్కరించుకుంటే, మన వ్యక్తిత్వమంతా బాగుపడుతుంది.
'వాగ్భూషణం భూషణం' - నిజమైన అలంకారం మాటయే అని సుభాషితకారుని మాట.
( శుభాన్ని కోరి, శుభ(పాజిటివ్) భావనతో పలికే పలుకు భగవంతుని
స్తుతియే. ఈ మాటకి 'భగవత్ స్తుతి శుభమైనది' అనే అర్థం కూడా ఉంది.
నిర్మలుడైన భగవానుని మలినంలేని మాటతోనే సన్నుతించాలి. కపటం,
దుఃఖకరం, అసత్యం - ఇవి వాక్కుకి మలినాలు. ఇవి లేని వాక్కే నిర్మలం.
కపటం, దూషణం... వంటి దోషాలు లేని మాటయే మధుర వచనం.)
ఎదుటివారిని నొప్పించకుండా, సత్యాన్ని తప్పకుండా, హితంగా, మితంగా,ప్రియంగా మాట్లాడడం ఉత్తమ జీవనవిధానం. అవతలి వారిని బాధించే సత్యం చెప్పవలసి వస్తే, మౌనమే శ్రేయస్సు. అది అసత్యం క్రిందకు రాదు. కోపం, ఆవేశం కలిగినప్పుడు నోరు తూలకుండా, మౌనాన్ని అవలంబిస్తే - దుష్పరిణామాలను
తొలగించడమే కాదు, క్రమంగా కోపాది దుస్స్వభావాలు నిగ్రహమౌతాయి. సాత్విక స్వభావం వృద్ధి చెందుతుంది.
మాటకి రెండు లక్షణాలను పై మంత్రంలో చెప్పారు:
1. ఊర్జా
2. మధుమతీ
భగవంతుడు మన వాక్కుకు ఇచ్చిన ప్రత్యేకతలివి. వీటిని కాపాడుకోవాలి.
'ఊర్జా' అనగా శక్తిమంతమైనది. వాక్కు అగ్నిస్వరూపం. అగ్ని దేవతాకమైన వాక్శక్తికి అమోఘమైన శక్తి ఉంది. నియంత్రణ కలిగే వాక్కు అమోఘం (వ్యర్థం కానిది)
అవుతుంది. అదే సత్యవచస్సు.
అశ్లీలం, అసత్యం లేకుండా - ఉత్తమ దివ్యవిషయాలను మాట్లాడి, తగిన మౌనం, మంత్రజపం చేసేవారి వాక్కుకి వరమై ఫలించే ప్రభావం ఉంటుంది. వీరినే 'వాక్ శుద్ధి' కలవారు అంటారు.
'శివేన వచసా’
“నిర్మలుడైన ఓ గిరీశా! శివా! శుభంకరమైన పలుకులతో నిన్ను స్తుతిస్తున్నాము”అని రుద్రనమక మంత్రం.
శుభాన్ని కోరి, శుభ(పాజిటివ్) భావనతో పలికే పలుకు భగవంతుని స్తుతియే.
ఈ మాటకి 'భగవత్ స్తుతి శుభమైనది' అనే అర్థం కూడా ఉంది. నిర్మలుడైన
భగవానుని మలినంలేని మాటతోనే సన్నుతించాలి. కపటం, దుఃఖకరం, అసత్యం -ఇవి వాక్కుకి మలినాలు. ఇవి లేని వాక్కే నిర్మలం.
కపటం, దూషణం... వంటి దోషాలు లేని మాటయే మధుర వచనం.
వాక్కుకి మరొక అర్థం - బుద్ధి, విద్య... అని కూడా. విద్యలకి కూడా పై
లక్షణాలుండాలి. ప్రజాహితకారి అయిన విద్యలే శక్తిమంతమైనవి, మధురమైనవి.
"తిట్టు లేని బ్రతుకు ఒక్క దినమైన చాలు” అని అన్నమయ్య పలుకు. ఇతరులను తాను తిట్టకుండా, ఇతరులచే తిట్లుతినే చెడు పనులు చేయకుండా బ్రతికే జీవితమే
- దుష్టస్వభావం లేని మధురశక్తి జీవితం.
No comments:
Post a Comment