[6/2, 22:33] +91 94918 93164: *యోగి వేమన -1*
రచన : మాలయశ్రీ
నిక్కమైన మంచి నీలమొకటిచాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల ? కులమునుద్ధరించు కొడుకొక్కడే చాలు ; విశ్వదాభిరామ వినురవేమ!
అక్షర లక్షలు:
ధారా నగరంలో భోజరాజు ఆస్థానంలో కవులంటే చాలు సంభావనలు ముట్టేవి.
అన్నార్థులైన పొరుగూరు బ్రాహ్మలు కొందరు నగర సత్రంలో బస చేసి ఏదయినా ఒక శ్లోకం వ్రాసి రాజుగారి దయవల్ల మరునాడు మృష్టాన్న భోజనం చేయాలని సంకల్పించారు.
అందరూ కల్సి నానా తంటాలు పడి అనుష్టుప్ ఛందస్సులో సగం శ్లోకం పూర్తిచేశారు. మిగతా సగం వ్రాయడానికి ప్రయాసపడుతుండగా, అటు వైపు వెళ్ళిన కాళిదాసు కవి విషయం విని నవ్వుతూ శ్లోకం పూరించి వెళ్ళాడట.
మరుసటి దినం రాజాస్థానంలో ఆ శ్లోకం వినిపిస్తే ప్రభువు ఆ విప్రుల కోర్కె తీర్చాడట. రెండవ సగభాగం రచనకు ముగ్ధుడై అది ఎవరిదా? అని విచారించి కాళిదాసు మహాకవిదని తెల్సి ఆనందంతో ఆక్షరలక్షలిచ్చి సత్కరించాడట. ఆ శ్లోకమిది-
భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం। మాహిశంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి||
ఓరాజా! పప్పునెయ్యితో కూడిన భోజనం పెట్టించుము, అని అయ్యగార్ల అరశ్లోక భావం.
శరదృతువు నందలి వెన్నెలవంటి పెరుగు గేదెది కూడా కావాలిసుమా-అని కాళిదాసు రచించిన శ్లోకార్ధభావం. ఇందులో పదరమ్యత తప్ప ఏ మహత్తర నీతి కానీ జనప్రయోజనం కానీ ఉందా?
విశ్వళ్శేయఃకావ్యం-అనే సూక్తికి న్యాయమూ చేకూర్చదు.
భోజనం లభించింది బ్రాహ్మణులకు!
సత్కారం లభించింది మహాకవికి !!
సామాన్య జనానికి కావల్సినవి సరళశైలిలో సజీవ భావాలు, సామాన్య పదాల పాదాల పద్యాలు. అలాంటివి వందలు వేలు మహత్తరంగా రచించిన అసలు సిసలయిన అచ్చపు తెలుగుకవి మన వేమనయోగి, ఆయన పండిత కవి కాకున్నా ప్రజాకవి!
మకుటం వికటం:
వేమన మహాకవిని కవి కాదన్న పండిత శ్రేష్టులు ఆయన ఆటవెలది పద్యమకుటం 'విశ్వదాభిరామ వినురవేమ'కు ఇంతవరకు సరియైన అర్థం చూపించలేకపోయారు. ఎవరికి తోచిన కల్పన వాళ్ళు చేస్తున్నారు.
విశ్వద అభిరామ వేమ వినర-అని అన్వయం. విశ్వానికి (జ్ఞానం) ఇచ్చు ప్రియమైన వేమా విను, అనే అర్థం ఎక్కువమంది చెప్పారు. 'విశ్వద’ దేవదాసి పేరుగా ఊహించి ఆమెకి అభిరాముడైన వేమన అని అన్వయం చూపింది రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు. కాని వేశ్యను నిరసించి వెళ్ళిన వేమన ఆమె పేరును తన పేరుతో జోడించుకున్నాడనడం సరిగా తోచదు. ఏది ఏమైనా జనం మెచ్చింది కవిత్వం. చదివిన వెంటనే మరచిపోకుండా జనం జ్ఞాపకముంచుకో గల, తిరిగి తిరిగి పఠించగల మంచి రచనలు చేసేవాడే కవి.
వేమన రసవత్కవి:
అలాంటి యోగివేమన మహాకవి కవితల గొప్పతనాన్ని మొట్టమొదట గుర్తించి వ్యాప్తికి తెచ్చినది ఆంగ్ల అధికారి సి.పి. బ్రౌను, తర్వాత పట్టం కట్టింది సి.ఆర్.రెడ్డి. ఆ తర్వాత ఎందరెందరో గుర్తించారు ప్రస్తుతించారు. పండితుల్లో పామరుల్లో వేమన కవి పద్యాలకు విశేష ప్రచారం జరుగుతున్నది. ఆ కవికి చక్కని గుర్తింపు గౌరవం కలిగాయి. వేమన పద్యాలు నాలుగైదైనా రాని తెలుగు చదువరి వుండడు.
*ఎవరీ వేమన ?*
ఇంతటి మహాకవి జీవితం గురించి ఊహలే తప్ప నిజమేమిటో మనకు తెలియదు. కారణం? వేమన ఏ రాజాశ్రయాన్నీ కోరకపోవడం తనను గూర్చి తన పద్యాల్లో అంతగా ఏమీ చెప్పుకోకపోవటం.
అజంతా చిత్రకారులుకానీ, ఎల్లోరా శిల్పులుకానీ తాము రూపొందించిన ఆపూర్వకళాఖండాల క్రింద తమ పేర్లు వ్రాసుకోలేకపోయారు. కావాలనుకుంటే వ్రాయకపోదురా. నాటివారికి కళాప్రతిభను చాటాలని లోకోపకారం కలిగించాలనే కాని తమ పేర్లు నిలిచివుండాలనే తపన స్వార్థం లేకుండేవి. వేమన కవిదీ అదే ధోరణి.
అయితే జనవ్యాప్తిలో ఉన్న విషయాలను బట్టి వారి కథ కొంత తెలియవస్తున్నది. పద్యాలబట్టి కొంత ఊహింపబడుతున్నది.
జనం వ్యాప్తిని నమ్ముదామంటే ఒకేకాలపువారు కాని శ్రీనాథ-పోతన కవులకు బంధుత్వం అంటకట్టలేదా? అక్బర్ చక్రవర్తి కాలపు కబీరుదాసుతో ఔరంగజేబు-తానీషా కాలంనాటి రామదాసుకు లంకె వేయలేదా?
ఏది సత్యం!
పద్యాలలోని భావాలబట్టి కథను ఊహించుదామంటే, కవి అన్నీ తాను ఆనుభవించిన భావాలనే వ్రాయడం జరుగుతుందా? ఇతరులవలన తెలిసినవి తాను లోకంలో చూసినవీ వ్రాస్తాడుకదా: ఏది దారి?
వేమన పద్యాలపై సాగినంత పరిశ్రమ ఆయన జీవితచరిత్రపై సాగలేదు. కాలం గడిచిన కొద్ది సత్య కథ మరుగున పడిపోతుంది- (పోయింది) కల్పనలు వ్యాప్తికొస్తాయి.
ఆయనపై నవలలు నాటకాలూ తక్కువే వచ్చినై. పంచనాదంగారి నాటకం ఒక్కటే అధిక వ్యాప్తి, అది చిత్తూరు నాగయ్యగారు నటించిన యోగి వేమన సినిమా కంటే పూర్వపుది. ఈ మధ్య విజయచందర్ నటించిన సినిమా దానికి అనుకరణ అని ఆ చిత్ర దర్శకుడు సి.ఎస్.రావు అన్నారు. ఈ చిత్రం దెబ్బతిన్నది.
అవి ఆ కాలపు రచయితల భావాలను ప్రదర్శించేవిగా వున్నవే తప్ప కవి జీవితానికి- స్వభావానికీ న్యాయం చేకూర్చేవిగా లేవు.
నార్లవారి 'వేమన' ఆంగ్ల పుస్తకంలో ప్రజావ్యాప్తిలో వున్న కథను తప్పని పద్యాల బట్టే కథను ఊహించారు. వేమన కవితపై పరిశోధన సల్పిన డా॥ఎన్. గోపి, నార్లవారి బాటనే అనుసరించారు.
నాకు ఆ దారి సమ్మతం కాలేదు..
నేను 1984లో రచించిన 'ప్రజాకవి యోగివేమన' నాటకం కవి జీవితానికి ఎంత సన్నిహితమో తెలియదుకాని వారి స్వభావాన్ని, ధ్యేయాన్ని మాత్రం చక్కగా చాటింది, పన్నెండుసార్లు రసవత్తరంగా ప్రదర్శనలిచ్చాం.
కరీంనగర్ 'కళాభారతి'లో జూ॥ లెక్చరర్స్ రాష్ట్ర సదస్సులో ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు గుంటూరు ఉపన్యాసకులు వచ్చి ప్రశంసించడం అపూర్వ గౌరవంగా భావించాను. వారిది వేమన సంచరించిన ప్రాంతం అని ఆనందించాను. మా నాటకం రచన దర్శకత్వంతో పాటు వేమన పాత్ర పోషణ నాది (మలయశ్రీ). సంగీతానికి, నటనకు, ఇతర పాత్రలకు సరియైన సహకారం అందించిన మా మిత్రులు అభినందనీయులు.
ఇప్పుడు నవరత్నా వారి కోరికగా ఈ ఆంధ్ర కవిరత్నం జీవితాన్ని 'యోగివేమన' మీ ముందుంచుతున్నాను. ప్రజలవ్యాప్తిలో వున్న కథల పద్యాల ఆధారంగానే ఆ మహాకవి జీవితాన్ని - కవిత్వ సారాన్ని మితంగానయినా 'కొండ అద్దమందు కొంచెమై యుండదా' అన్నట్లు చూపుతున్నాను.
ఆణిముత్యాల్లాంటి పద్యాలను కొన్ని చివరగా ఇచ్చాను.
ఈ చరిత్ర పురుషుని జీవితచరిత్ర ఊహించవలసిరావటం విచిత్రం, నా రచన పోతన మహాకవి నుడివినట్లుగానే సాగింది.
“విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేట పరతు"
సరసులు సంతోషింతురు గాక; సత్య సంశోధకులు ఇంకా మదించి నిజమయిన చరిత్రను వెలయింతురుగాక-
వేమన మహాకవి,
కామిగా విహరించిన, కడగండ్లు గడచిన కవిగా సంచరించిన, కటు సత్యాలు గానంచేసిన "కొండవీడు"కు వెళదాం పదండి!
కొండవీడు...
గుంటూరు మండలంలో కొండవీడు ప్రఖ్యాత గిరిదుర్గం. ಅದಿ రెడ్డిరాజుల ప్రాభవానికి కంచుకోట-విజయ పతాక!
అక్కడి కొండరాళ్ళకు తెల్సు నాటి తెలుగువీరుల గుండె లెంతటి దృఢమైనవో, అక్కడి పిల్లవాయువులకు తెల్సు నాటి సాహితీ పరిమళాలెంతటి ప్రతిభావంతమైనవో, అభిమాన ధనానికి కదనవీరానికి వీడు కొండవీడు.
శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయుల తర్వాత ప్రభవించిన తెలుగు రాజన్యులు రెడ్డి రాజులు- పద్మనాయక వెలమ ప్రభువులు. వీరి తర్వాత వెలసింది హంపీ విజయనగర ఆంధ్ర సామ్రాజ్యం.
కొండవీటి రెడ్లకు పూర్వీకుడు కోమటి వేమారెడ్డి. ఒంగోలు జిల్లాలోని అద్దంకి పరిపాలకుడు. ఆ వంశములోని మల్లారెడ్డి కవిత్రయంలోని ఒకడయిన ఎర్రనకు ఆశ్రయమిచ్చాడు. ఆయన ప్రబంధ పరమేశ్వరుడని ఖ్యాతిపొందిన కవి, కొమరగిరి వేమారెడ్డి తర్వాత (ఆయనే కర్పూర వసంతరాయలు) కొండవీడు ఈ వంశంవారికి దక్కలేదు. కాపు కులస్తుడైన చందవోలు వేమారెడ్డి ప్రభువైనాడు.
ఆయన కొడుకు రాచవేమన తర్వాత ఈ రాజ్యం రాజమండ్రి రెడ్లపాలయినది. కొమరగిరి తర్వాత వేమారెడ్డి ఆస్థానంలో వాసి గాంచినవాడు శ్రీనాథకవి సార్వభౌముడు.
మన కవి వేమన అన్న పై రాచవేమనా? అయితే శ్రీనాధునికి సమకాలికుడు. ఎందుకో కాని చారిత్రకులెవ్వరూ ఆ విషయం పేర్కొనలేదు. ఆధారాలూ లభించలేదు. కొండవీడు రాజ్య పతనానంతరం రాజమండ్రి రెడ్డిప్రభువుల పాలనలో, కవి వేమన అన్న రాచవేమన ఉండవచ్చును. రాజబంధువు కానోపును.
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
[6/2, 22:33] +91 94918 93164: *యోగి వేమన -2*
రచన : మాలయశ్రీ
*వేమన బాల్యం*
వేమన పుట్టింది కర్నూలులోని మూగచింతలపల్లి. బాల్యంలోనే తల్లీదండ్రీ గతించారు. అన్న రాచవేమన, వదిన నరసమాంబ గారాబంగా పెంచారు కొండవీటిలో.
వారికి ఒక కూతురు. జ్యోతీ వ్యవహార నామం, పుత్ర సంతానం లేదు. పుత్రునిలాంటి మరది వుండగా వేరే పుత్రులెందుకని ఆయమ్మ తృప్తిపడింది. మరది వేమన్నను కన్నకొడుకుగానే చూసింది. ఇంకా అంతకు మిన్నగా అన్నా తప్పులేదు. పెంచిన ప్రేమ కన్న ప్రేమకంటే యెక్కువకదా!
రాచ వేమన్నకు రాచ కార్యాలెక్కువ గ్రామాధికారి. ప్రజా వ్యవహారాలను చూసే సందడిలో తమ్ముని సంగతిని పట్టించుకునే తీరికెక్కడిది.
విద్యా గురువుల నేర్పరిచాడు. నాటి చదువులు వేరు. ఆశ్రమాలు-మఠాలు ఆలయాలు, అయ్యవార్ల ఇళ్ళల్లోనే విద్యాబోధన. వేరే పాఠశాలలు లేవు. ధనవంతుల ఇండ్లకు వెళ్ళి అధ్యాపకులు పిల్లలకు చదువు చెప్పేవారు.
అక్షర పరిచయం గుణింతం అయింతర్వాత శతకాలు, కొన్ని పురాణాల భారత భాగవతాల ఘట్టాలు చదివితే సామాన్యుల చదువు అయిపోయినట్లే. పండితులు కావాలంటే కావ్యాలు, నాటకాలు చదివేవారు. వైదిక చదువులు వేరు.. ఉపనిషత్తులు దర్శనాలు వేదాలు.
వేమన సంస్కృతం చదవలేదనుకోవచ్చు, తెలుగులో కావ్యాలు చక్కగానే చదివాడు. అవసరానికి తగిన లెక్కలు నేర్చాడనుకోవచ్చు.
నాడు వ్యక్తి ప్రతిభను అనుభవాన్ని బట్టి గుర్తింపు రాజోద్యోగాలు లభించేవి, అవే ధనసంపాదనకు జన సన్మానాలకు కారణమయ్యేవి.
సర్టిఫికేట్ల డిగ్రీల చదువులుకావు, ఉద్యోగాల కోసంకాదు. బలవంత పెట్టి చదివించేవారు లేరు. కాబట్టి ఆయన చదువు నిలిచిపోయింది.
అందుకు మరో కారణం వయసు. యౌవనారంభంలో మనసు నిలకడ తక్కువ- కోరిక లెక్కువ, గుర్రాలవలె పంచేంద్రియాలు పరుగులు పెట్టేదశ, దానికి దుడుకు మిత్రులు తోడ్పడుతారు అగ్నికి వాయువువలె, పెద్దల అదలింపో బుద్ధి అదుపో లేకపోతే ఆ పడుచు జీవితం తెగిన గాలిపటం.
పాడిపంటలకు కొదవలేని కాలం, పుష్టిగా ఏపుగా పెరిగాడు వేమన. ఆటపాటల్లో ఉత్సాహం కలవాడు కనుక ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉండేవాడు.
*మత సాంఘిక పరిస్థితులు*
శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధం- వైదికం వ్యాప్తి చెందాయి. వైదికం యజ్ఞ యాగాదులంటే విలువిచ్చే ధర్మం, బౌద్ధం శాంత్యహింసలకు సత్ప్రవర్తనకు పట్టం కట్టింది. గుంటూరు మండలంలోని 'అమరావతి' స్తూపం క్రీస్తు కాలానికి పూర్వపుది అని తెలిస్తే ఆశ్చర్యపోతాం, బౌద్ధం-జైనం ఆంధ్రదేశంలో బాగానే వ్యాపించాయి.
మహాయానశాఖ భౌద్ధ ప్రవక్త నాగార్జునుడు నివసించిన నందికొండ గుంటూరు-నల్గొండ మధ్యలోదే, అదే ఇప్పటి నాగార్జునసాగరం-
విజయపురి, జైన పంపకవి కన్నడ భారతం (నన్నయకు పూర్వం) వ్రాసింది కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో, రాజమహేంద్రంలోనే తొలి తెలుగు కావ్యంగా వైదిక పురాణ హిందూ మతోద్ధరణ కోసం ‘మహాభారత రచన' కావించాడు నన్నయభట్టు.
ఓరుగల్లు కాకతి ప్రభువులు మొదట జైనులే. పిదప శైవులయ్యారు. శివకవి పాల్కురికి సోమనాధుడు ఆ కాలపువాడే. స్వయంభూ దేవాలయం వేయి స్తంభాలగుడి వారి శివభక్తికి తార్కాణాలు, వైష్ణవం కూడా వ్యాప్తిలో ఉందనడానికి కాకతీయ సేనాని గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం సాక్షి. భాస్కర రామాయణం కూడా ఆ కాలపుదే. నెల్లూరి తిక్కన సోమయాజి శైవ వైష్ణవుల తగాదాలను దూరం చేయడానికి హరిహరనాధుని సృష్టించాడు.
ఇంత చెప్పింది కొండవీటిరెడ్డి ప్రభువుల రాజరిక కాలంలో జైన బౌద్ధాలు వెనుకకుపట్టి శైవవైష్ణవ పురాణ మతాలు వ్యాప్తిలో ఉన్నాయి అని తెలప డానికే.
రెడ్డిరాజులు శైవులు, పద్మనాయక వెలమలు వైష్ణవులు, పలనాటియుద్ధ కారకుడైన బ్రహ్మనాయకుడు వెలమవీరుడు-చెన్నకేశవ భక్తుడు, నాయకురాలు రెడ్డి నాగమ్మ శివభక్తురాలు, అదొకరీతిగా మత పోరాటమే.
ఇక కొండవీటి రెడ్డిరాజులు శైవులనడానికి ప్రబల నిదర్శనం వారు పోషించిన ఇద్దరు ప్రముఖ కవులు ఎర్రన శంభుదాసు, శ్రీనాథకవి సార్వభౌముడు శివభక్తులు.
దేవాలయాల్లో అంగరంగ వైభోగాలు రాజాదరణతో ఘనంగా, ప్రజాదరణతో మితంగా నైనా జరిగేవి. అప్పటికి ఇస్లామీ క్రైస్తవ మతాల వ్యాప్తిలేదు.
పూజారులతో పాటు బాజాలవాళ్ళు, పూలు ఇచ్చేవాళ్ళు, పరిచారకులు, నాట్యకత్తెలు. . . దేవాలయాలకు నియమింపబడి ఉండేవారు. ఈ వాతావరణంలో పెరిగాడు వేమన.
*దేవదాసితో పరిచయం*
దేవాలయాలలో నృత్యం చేసేవారిని దేవదాసీలంటారు. వారు పెళ్ళిళ్ళు చేసుకోరు. అలా శాసించింది సమాజం స్వార్థంతో, ఆటపాటల్తో స్వామిని సేవించే వారు-ప్రేక్షకులను అలరించేవారు. అదొక పుణ్యకార్యంగా భావిస్తూ గౌరవంగానే జీవించేవారు, ఈ నాట్యకత్తెలనే కళావతులు, వేశ్యలు అనేవారు.
సినిమాలు, ఆధునిక నాటకాలులేని ఆ కాలాల్లో వీధిభాగోతాలు, గొల్ల సుద్దులు, దొమ్మరాటలు, గారడీలు, భోగం మేళాలు... ఇవే ప్రజలకు కాలక్షేప సాధనాలు.
ఒకానొక పర్వదినాన కొండవీటి దేవాలయంలో దేవదాసి నృత్యం చూశాడు వేమన. ప్రేక్షకుల కళ్ళన్నీ ఆ యువనర్తకి పైన, ఆమె కళ్ళేమో దైవ విగ్రహం పైన.
కోడె వయసులో బుసలుకొట్టే కోరికలతో ఉన్న వేమన్న మనస్సును దేవదాసి సౌందర్యం ఆకర్షించింది. ఆమె కూడ అతని పై చూపు నిలిపింది. పలకరించాడు. మాటకలిపింది, వలపు కలసింది, స్నేహం పెరిగింది.
దేవదాసి భవనంలోనే వేమన నివాసం. ఆయనకు అన్నగారి గృహం తప్ప సొంత భవనమేదీ లేదుకాని, ఉంటేనా? తన ప్రేయసిని పూల పల్లకిపై ఎక్కించి తీసుకెళ్ళేవాడే! అంతటి ప్రేను ఏర్పడింది.
ప్రేమ గుడ్డిదంటారు. అదెంతవరకు నిజమోకాని, అది యువతీ యువకులను గుడ్డివాళ్ళను మాత్రం చేస్తుంది.
పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగితే మాత్రం లోకం కళ్ళను ఎన్నాళ్ళు మూయగలుగుతుంది? వేమన-దేవదాసి స్నేహం సంగతి ఊరంతా వ్యాపించింది. జనం ముచ్చట్లుగా చెప్పుకోసాగారు.
మొదట దొంగగా వెళ్ళివస్తుండేవాడు. ఇప్పుడు దొరగా వెళుతున్నాడు. ఆమె నాట్యం చేస్తుంది. అతడు తాళం వేస్తాడు, భళా! అని మెచ్చుకుంటాడు. గంటలు రోజులు ఆమె సన్నిధిలో ఆయనకు క్షణాలుగా గడిచిపోతున్నాయ్. ఈడుజోడు అందం చందం అన్నింటా సరిపడి ఆ జంట చూడముచ్చటగా ఉన్నారు. వారినిద్దరం తగులంగట్టిన బ్రహ్మనేర్పరి కదా, అన్నట్లుంది చూసేవాళ్ళకు.
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment